కొనసాగిన కొనుగోళ్ళు పుంజుకున్న సెన్సెక్స్, నిఫ్టీలు

Updated By ManamMon, 02/12/2018 - 22:48
sensex-recovers

sensex-recoversముంబయి: దేశీయ ఈక్విటీలు కడపటి పది సెషన్లలో రెండవసారి లబ్ధి పొంది, రెండు వారాల క్షీణతల నుంచి సోమవారం కాస్త కోలుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల మధ్య మదుపరులు ఇటీవల బాగా దెబ్బతిన్న లాభసాటి షేర్ల కొనుగోలుకు దిగడంతో బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజ్ (బి.ఎస్.ఇ) సెన్సెక్స్ దాదాపు 295 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజ్ (ఎన్.ఎస్.ఇ) సూచి నిఫ్టీ 85 పాయింట్లు లాభపడ్డాయి. దానికితోడు కంపెనీలు ప్రకటిస్తున్న ఆదాయాలు పటిష్టంగా ఉన్నాయి.  రిటైల్ ద్రవ్యోల్బణం కొద్దిగానన్నా తగ్గుతుందనే అంచనాలు సెంటిమెంట్ పునరుద్ధరణకు తోడ్పడ్డాయి. ఇటీవల బాగా దెబ్బతిన్న విద్యుత్, స్థిరాస్తులు, యంత్రాలు, యంత్ర పరికరాలు, బ్యాంకింగ్ రంగ షేర్లను మదుపరులు భారీగా కొనుగోలు చేశారు. దేశీయ మ్యూచువల్ ఫండ్ల నిర్వాహకులు, రిటైల్ మదుపరులు ఇద్దరూ కొనుగోళ్ళు కొనసాగించారు. టాటా స్టీల్ ఈ ఆర్థిక సంవత్సర మూడవ త్రైమాసికానికి 5 రెట్లు ఎక్కువగా నికర లాభాన్ని ప్రకటించడంతో, ఆ కంపెనీ షేర్ ధర బి.ఎస్.ఇలో 4.22 శాతం పెరిగింది. ఇటీవల బాగా అమ్మకాలను చవిచూసిన ఆరోగ్య రక్షణ రంగ షేర్లు సోవువారం కొనుగోళ్ళను చూశాయి. ఈ క్యూ 3కి సంబంధించి భారీ నష్టాన్ని నమోదు చేసిన స్టేట్ బ్యాంక్ ఇండియా షేర్ ధర మాత్రం బాగా పతనమైది. 

తెప్పరిల్లిన ప్రపంచ మార్కెట్లు
శుక్రవారంనాడు వాల్‌స్ట్రీట్ చక్కని పరిస్థితి కనబరచింది. ఆసియాలోని ఇతర మార్కెట్లు, ఐరోపా మార్కెట్లు కూడా దృఢపడుతున్న ధోరణి కనిపించింది. అవి దేశీయ మార్కెట్లలో మదుపరుల ఉత్సాహాన్ని పెంపొందించాయి. షాంఘై కాంపొజిట్ 0.78 శాతం, సింగపూర్ 0.28 శాతం, మలేషియా 0.57 శాతం లాభపడ్డాయి. ట్రేడింగ్ ప్రారంభంలో యూరోపియన్ మార్కెట్లు పెరుగుతున్న స్థితిలో ఉన్నాయి.

పెరిగిన చమురు ధరలు
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు వరుసగా ఆరవ రోజు శుక్రవారంనాడు తగ్గినవి మళ్ళీ పెరగడం ప్రారంభించాయి. డాలరుతో  రూపాయి మారకం విలువ కూడా కోలుకుంటున్న బాటలో ఉన్నట్లుగా కనిపించింది. ఇవి కూడా సెంటిమెంట్లను పునరుద్ధరించాయి.

లాభపడ్డ సూచీలు
సెన్సెక్స్ సోమవారం ఒక దశలో 34,351.34 పాయింట్ల గరిష్ఠ స్థితిని చూసి తర్వాత 34,115.12 పాయింట్లకు తగ్గింది. మళ్ళీ కొద్దిగా పెరిగి మొత్తానికి సోమవారంనాడు 34,300.47 పాయింట్ల వద్ద ముగిసింది. అది శుక్రవారం (ఒక నెల కనిష్ఠ స్థాయి) 34,005.76 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సోమవారం 10,555.50 పాయింట్ల గరిష్ఠ స్థితిని చూసి, 10,539.75 పాయింట్ల వద్ద ముగిసింది. 

దేశీయ కొనుగోళ్ళు
తాత్కాలిక డాటా ప్రకారం, దేశీయ మదుపు సంస్థలు శుక్రవారం నికరంగా రూ. 588.42 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు  నికరంగా రూ. 1,351.70 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేశారు. 

నేడు సెలవు 
మహా శివరాత్రి సందర్భంగా స్టాక్ మార్కెట్లు 2018 ఫిబ్రవరి 13 మంగళవారంనాడు మూసి ఉంటాయి. 

English Title
The Sensex and Nifty were up on buying
Related News