ఏడేడు లోకాలు నీలోనే

Updated By ManamTue, 06/19/2018 - 10:39
yoga

imageవ్యాయామం శారీరక దారుఢ్యాన్ని కలిగిస్తుంది. కాని యోగ సాధన మనశ్శాంతిని కలిగిస్తుంది. ఏకాగ్ర దృష్టి ఉంటే ఆధ్యాత్మిక పరంగా సత్యలోకాన్ని లేదా పరమపదాన్ని పొందుతారు. ఏకాగ్రత అనేది యోగాభ్యాసం ద్వారానే సాధ్యం. దాన్ని యోగులు సాధిస్తారు. షట్చక్రాల మీద పట్టు సాధించి యోగ విధానంలో ఉండే ముద్రలను పాటించాలి. అలా చేస్తే శరీరంలోని రుగ్మతలన్నీ పోతాయి. ఈ పద్ధతి భారతీయ యోగుల వద్ద తరతరాల నుంచి ఉంది. కేవలం ఆధ్యాత్మికపరంగానే కాకుండా వైద్య పరంగా కూడా రోగ చికిత్సలకు  చక్ర సాధన ఆధారంగా ఉంది. ఈ గురువారం అంతర్జాతీయ యోగదినోత్సవం సందర్భంగా....

మూలాధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనం
నాభిస్తు మణి పూరాఖ్యం హృదయాబ్జ మనాహతం
తాలుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం
సహస్రారం బ్రహ్మరంధ్ర ఇత్యాగమ విదోవిదుః


మూలాధారం నుంచి సహస్రారం వరకూ ఉండే చక్రాలు శరీరంలో ఏయే భాగాల్లో ఉంటాయో ఈ పై శ్లోకంలో చెప్పారు. మన యోగులు, రుషులు ఈ చక్రాలకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ఆ మహనీయులు తమ తపోశక్తితో ఆ చక్రాల రంగు, ఆకారం, ఇతర విశేషాలను కూడా గ్రంథస్థం చేశారు. అవి చక్రాలు మాత్రమే కాదు లోకాలని కూడా పేర్కొన్నారు. అందుకే వాటిని ఊర్ధ్వలోక సప్తకమని కూడా యోగులంటారు. ఆ లోకాల వివరాలివి... 
మూలాధారమే భూలోకం.
గుద స్థానానికి రెండు అంగుళాల పైభాగంలో ఉంటుంది. నాలుగు రేకులతో ఎర్రని తామర పువ్వులాగా ఉండే మూలాధారానికి అధిపతి గణపతి. 
స్వాధిష్ఠానం భువర్లోకానికి సంకేతం.
జననేంద్రియం వెనక భాగంలో ఉంటుంది. ది సిందూరం రంగులో ఉంటుంది. ఆరు రేకుల పద్మంలా ఉండే ఈ చక్రానికి బ్రహ్మ తత్త్వం అధిదేవత.
మణిపూరకం సువర్లోకం.
బొడ్డు దగ్గర వెన్నెముక లోపల ఉంటుంది. బంగారపు రంగులో ఉంటుంది. పది రేకుల పద్మంలా ఉండే దీనికి విష్ణువు అధిపతి. 
అనాహతం మహర్లోకం.
గుండె వెనక వెన్నెముకలో ఉంటుంది. నీలం రంగులో ఉంటుంది. పన్నెండు రేకుల తామరపువ్వులా ఉండే దీనికి రుద్రుడు అధిదేవత. 
విశుద్ధ చక్రం జనలోకం.
గొంతు ముడిలో ఉంటుంది. నల్లని రంగులో ఉండే దీనికి అధిపతి జీవుడు. 
ఆజ్ఞాచక్రం తపోలోకం.
కనుబొమల మధ్యలో ఉంటుంది. రెండు రేకులుండి తెల్లని పద్మంలా ఉంటుంది. దీనికి ఈశ్వరుడు అధిపతి. 
సహస్రారం సత్య లోకం.
మాడు స్థానంలో ఉంటుంది. వేయి రేకుల పద్మంలా ఉండే దీనికి అధిపతి పరమేశ్వరుడు.
ఇవీ శరీరంలో ఉన్న చక్రాల స్థాన రూప విశేషాలు. ఈ చక్రాల గురించి, యోగ సాధన గురించి మన పురాణాల్లో చాలా చోట్ల ప్రస్తావించారు. ఆ చక్ర అధిష్ఠాన దేవత రూపవర్ణన ఒక్కోచోట ఒక్కోలా కనబడుతుంది. ఒక్కో చక్ర స్థానాన్ని శుద్ధి చేస్తే ఒక్కో వ్యాథి నయమవుతుందని యోగులు పలు గ్రంథాల్లో చెప్పారు. 

ప్రాణ చికిత్సలో... 
మన యోగశాస్త్రం ఆరు చక్రాలను గురించి చెబితే ప్రాణచికిత్సలో మాత్రం పదకొండు చక్రాలున్నాయి. ప్రాణ చికిత్స లేదా ప్రాణిక్ హీలింగ్ అనే పద్ధతి చైనా దేశంలో ఉంది. దీనికి మూలం మన యోగ శాస్త్రమే. ప్రాణ చికిత్స విధానం శరీరంలో ఉండే చక్రాలతో అనుసంధానమై ఉంటుంది. జీవశక్తి శరీరంలో చక్రాల రూపంలో కొన్ని ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉంటుంది. గుండె, ఊపిరితిత్తుల వంటి పైకి కనబడని అవయవాలు - కన్ను, కాలు, చెయ్యిలాంటి అవయవాలు, ఇతర జ్ఞానేంద్రియాలు ఉన్నట్టే శరీరం లోపల చక్రాల రూపంలో శక్తి కేంద్రాలు ఉన్నాయి. సాధారణంగా ఈ చక్రాలు మూడు నుంచి నాలుగు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. శరీరంలోని అన్ని భాగాలకు ఇవి శక్తినందిస్తాయి. ఇవి సరిగా పనిచేయకపోతే సాధారణ ఇంద్రియాలకు శక్తి అందక అనారోగ్యం కలుగుతుంది. పెద్ద చక్రాలుకాక మరి కొన్ని చిన్న చక్రాలు కూడా శరీరంలో ఉంటాయి. ఇవి ఒకటి నుంచి రెండు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో అంత ఎక్కువ ప్రాధాన్యం లేని భాగాలను నియంత్రిస్తూ వాటికి శక్తినందిస్తూ ఉంటాయి. ప్రాణశక్తిని గ్రహించి దాన్ని శరీరంలోని వివిధ భాగాలకు సరఫరా చేయడం వీటి పని. శరీరంలోపల ఉండే వినాశగ్రంథులను ప్రధాన చక్రాలు నియంత్రిస్తాయి. ప్రధాన చక్రాల్లోని కొన్ని చక్రాల ద్వారా మానసిక శక్తులను వృద్ధి చేసుకోవచ్చు. ఇలా శారీరక, మానసిక అనారోగ్యాలను తొలగించుకుని ఆరోగ్యాన్ని పొందేందుకు శరీరం లోపల ఉన్న చక్రాలు ఉపకరిస్తాయి. 

మూలాధార చక్రం: 
దీన్ని ఆంగ్లంలో బేసిక్ చక్ర అంటారు. ఈ చక్రం కండరాలు, ఎముకలు, వెన్నెముకకు రక్త ప్రసరణ నియంత్రిస్తుంది. రక్త నాణ్యతను సరిగా ఉంచుతుంది.  అన్ని కణాలను బాగా పనిచేసేలా చూడడం మూలాధారం పని. ఈ చక్రం సరిగా పనిచేయకపోతే కీళ్ల వాపులు, వెన్నెముక సంబంధ వ్యాధులు సంభవిస్తాయి. 
స్వాధిష్ఠాన చక్రం:
 దీన్ని ఆంగ్లంలో సెక్స్ చక్ర అంటారు. జననేంద్రియాలను, మూత్రాశయాన్ని నియంత్రిస్తూ వాటికి శక్తినందిస్తుంది. ఈ చక్రం సరిగా పనిచేయకపోతే లైంగిక సమస్యలు తలెత్తుతాయి. ఆజ్ఞ, విశుద్ధ, మూలాధార చక్రాలు స్వాధిష్ఠానంపై ప్రభావం చూపిస్తాయి. వాటిలో ఏది సరిగా పనిచేయకపోయినా స్వాధిష్ఠాన చక్రం మందగిస్తుంది. 
మెంగ్ మెయిన్ చక్రం: 
చైనా దేశంలో ప్రాణ చికిత్సకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఆ చికిత్సలో ఈ చక్రానికి చోటుంది. బొడ్డుకు వెనక భాగాన వెన్నెముకపై ఇది ఉంటుంది. మూలాధార చక్రం నుంచి వచ్చే సూక్ష్మమైన ప్రాణశక్తిని పైకి పంపుతూ శక్తి ప్రసరణకు ఇది దోహదం చేస్తూ ఉంటుంది. మూత్ర పిండాలను, అడ్రినల్ గ్రంథులను అదుపులో ఉంచుతుంది. ఈ చక్రం రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.
మణిపూరక చక్రం: 
దీనికి ఆంగ్లంలో నావల్ చక్ర అని పేరు. ఆంగ్లంలో నాభిని నావల్ అంటారు. ఆ ప్రాంతంలో ఉంటుంది కనుక దీనికి ఆ పేరొచ్చింది. చిన్న పెద్ద పేగులను, అపెండిక్స్‌ఏను నియంత్రిస్తూ వాటికి శక్తినందిస్తుంది. ఇది సరిగా పనిచేయకపోతే మల బద్ధకం, అపెండిసైటిస్, ప్రసవంలో ఇబ్బంది, ఒంట్లో ఓపిక తగ్గడం, పేగులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి.
ప్లీహచక్రం:
దీన్ని ఆంగ్లంలో స్ల్పీన్ చక్ర  అంటారు. ఎడమ వైపు పక్కటెముకల్లో అట్టడుగున ఉన్న పక్కటెముక మధ్యభాగంలో ఇది ఉంటుంది. మిగిలిన ప్రధాన చక్రాల కన్నా ఇది తక్కువ పరిమాణంలో ఉంటుంది. ప్రాణశక్తిని ఈ చక్రం తీసుకుని దాన్ని శరీరమంతటికీ వ్యాపింపజేస్తుంది.
సోలార్ ప్లెక్సస్: 
ఈ పేరు మీద రెండు చక్రాలుంటాయి. కుడి, ఎడమ, పక్కటెముకల మధ్యభాగంలో గుంటలా ఉన్న ప్రదేశంలో ముందు వైపున ఒకటి, వెనక భాగాన మరొకటి ఉంటాయి. ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పాంక్రియాస్, కాలేయాలను ఇది నియంత్రిస్తూ వాటికి శక్తినిస్తుంది. గుండె భాగాలకు కూడా ఇది కొంత శక్తినిస్తుంది. 
హృదయ చక్రం: 
వక్ష స్థలానికి మధ్యలో ముందు భాగాన ఈ చక్రం ఉంటుంది. దీన్ని హార్ట్ చక్ర అని కూడా అంటారు. గుండె, రక్త ప్రసరణ వ్యవస్థను అదుపులో ఉంచుతూ శక్తినిస్తుంది. ఇది కూడా ముందూ, వెనకా అని రెండు రకాలుగా ఉంటుంది.
విశుద్ధచక్రం: 
దీన్ని ఆంగ్లంలో త్రోట్ చక్ర అంటారు. ఇది సరిగా పనిచేయకపోతే గొంతు వాపు, గొంతు బొంగురుపోవడం, ఉబ్బసం లాంటి వ్యాధులు వస్తాయి. 
ఆజ్ఞా చక్రం: 
కనుబొమల మధ్యభాగంలో ఈ చక్రం ఉంటుంది. పిట్యూటరీ, ఆజ్ఞావినాళగ్రంథులను నియంత్రిస్తూ వాటికి శక్తిని ఇస్తుంది. దీని ప్రభావంతో కళ్లు, ముక్కు పనిచేస్తూ ఉంటాయి. 
ఫాల చక్రం:
 దీన్ని ఆంగ్లంలో ఫోర్ హెడ్ చక్ర అంటారు. నుదుటి భాగం మధ్యలో ఇది ఉంటుంది. పివియల్ గ్రంథిని, నాడీ మండలాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. ఇది సరిగా పనిచేయకపోతే జ్ఞాపకశక్తి తగ్గడం, పక్షవాతం, మూర్చలులాంటివి వస్తాయి. 
సహస్రార చక్రం: 
దీన్ని క్రౌన్ చక్ర అని అంటారు. ఇది మెదడును, శరీరాన్ని పూర్తిగా నియంత్రిస్తూ శక్తిని ప్రసరింపజేస్తుంది. ఈ చక్రాన్ని ఉత్తేజపరిస్తే శరీరంలోని ఇతర చక్రాలకు కూడా శక్తి అంది అక్కడున్న వ్యాధులు తొలగుతూ ఉంటాయి. ఇది సరిగా పనిచేయకపోతే మానసిక రుగ్మతలు తలెత్తుతాయి.
ప్రాణ చికిత్సా సాధకులు లేదా ఆ చికిత్స చేసేవారు మనిషిలోని ఆ వ్యాధిని గమనించి అది ఏ చక్రం పనిచేయనందువల్ల వచ్చిందో తెలుసుకుని దానికి తగిన శక్తిని ప్రసరింపజేస్తూ చికిత్స చేస్తారు. ఈ చక్రాలు బయటకు కనిపించడంలేదని, వాటిని నమ్మడం ఎలా అని కొందరి ప్రశ్న. ప్రకృతి సంబంధమైన, దైవ సంబంధమైన అంశాలన్నీ నమ్మకం మీదనే ఆధారపడి ఉంటాయి. ఎంతో కష్టతరమైన తపస్సు, యోగా భ్యాసం ద్వారా మన పూర్వ రుషులు వీటిని దర్శించగలిగారు. 
- ముకుందప్రియ

English Title
Seven hundred are in you
Related News