మనసుకు ముంజేతి అద్దం..కరచాలనం

Updated By ManamSat, 08/18/2018 - 01:51
Shake hands

imageమనిషి ఎన్ని భాషలు మాట్లాడినా, ఆ భాషలన్నింటికీ మూలం అతని శరీరం పలికించే హావభావాలే! మనిషి మాటను కనిపెట్టడానికి పూర్వమే అతని దేహం సంభాషణను మొదలుపెట్టేసింది. అందుకే మనిషి తాను కనిపెట్టిన భాషతో ఎన్ని మారువేషాలు వేసినా, శరీరం మాత్రం అతని మనసులోని నిజాన్ని పిసరంత కల్తీ లేకుండా బయట పెట్టేస్తుంది. ఆధునిక ప్రపంచం మానవదేహభాషకు ఉన్న ఈ సామర్థ్యాన్ని చక్కగా అర్థం చేసుకుంది. బాడీలాంగ్వేజ్ అన్నది ఇవాళ వ్యక్తిత్వ వికాసంలో ఒక ప్రధాన భాగమైంది. పాశ్చాత్యదేశాల్లో ఉద్యోగాల్లోకి తీసుకునే ముందుగానే ఈ బాడీలాంగ్వేజ్‌ను పరిశీలించి మరీ తమకు కావలసిన అభ్యర్థిని ఎంచుకుంటున్నారు. వ్యక్తులు చెప్పే మాటలు అన్నివేళలా వారి మనోభావాలకు ప్రతీకలు కావన్నది నిజం. ఎదుటివారి మనోభావా ల్ని ఉన్నదున్నట్టుగా చదవగలిగితే, వారి అవసరాలకు అనుగుణంగా ప్రతిస్పందించగలిగితే వారి నుంచి మనం ఆశించిన ప్రయోజనాన్ని పొందడం నల్లేరు మీద నడకే అవుతుంది. సమాజంలో కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం, వారితో సానుకూల సంబంధాల్ని ఏర్పరచుకోవడం అన్నది జీవితాన్ని విజయం వైపుగా నడిపి స్తుందన్నది మనకు తెలిసిన విషయమే. ఎవరైనా కొత్తవ్యక్తిని కలిసినప్పుడు వారిని అభినందిస్తూ, చేయిచాచి ‘కరచాలనం’ చేయ డం ఆధునిక సమాజంలో ఒక ఆనవాయితీ. కానీ కరచాలనం అనేది వ్యక్తుల తొలి కలయికలోనే ఎదుటి వారి మనస్తత్వాన్ని మనకు తెలిసేలా చేస్తుందంటే ఒకింత ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు దేహభాష వ్యాకరణం ప్రకారం ‘కరచాలనం’లో ఇమిడి ఉండే కొన్ని రహస్యాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. 

చేయి, చేయి కలిపి పరస్పరం అభినందనలు తెలుపుకునే సంప్రదాయానికి మూలాలు ప్రాచీన చరిత్రలోనే ఉన్నాయి. ప్రాచీన తెగల వారు స్నేహపూర్వక వాతావరణంలో కలుసుకున్నపుడు తమ చేతుల్ని ముందుకు చాచి, అరచేతులు కనిపించేలా ప్రదర్శించే వాళ్ళు. తద్వారా తమ వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని, తాము ఆయుధాల్ని దాచి పెట్టలేదని పరస్పరం భరోసా ఇచ్చుకునే వాళ్ళన్నమాట. ప్రాచీన రోమన్లు మణికట్టు కింద ఒక చిన్నపాటి కత్తిని దాచి ఉంచుకుని సంచరించే వారు. అందుకే స్వీయరక్షణ కోసం రోమన్లు ఎదుటి వ్యక్తి చేతి మణికట్టును పట్టుకుని ఎలాంటి మారణాయుధం లేదని నిర్ధారించుకునే వారు. ఈ సంప్రదాయమే నేటి ‘కరచాలనానికి’ మాతృక. అయితే పందొమ్మిదో శతాబ్ద కాలానికి కరచాలనానికి అర్థం మారిపోయింది. సమాన స్థాయికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర ఒప్పందానికి కరచాలనాన్ని ఒక ప్రతీక భావించడం ప్రారంభమైంది. 

ఎవరు ముందు?
కరచాలనం చేసే ముందు అవతలి వ్యక్తి దానిని స్వీకరించేం దుకు సుముఖంగా ఉన్నాడా, లేడా అన్న విషయాన్ని నిర్థారించుకోవాలి. అవతలి వ్యక్తి కరచాలనానికి చేతిని చాపే వరకు వేచి చూడాలి. ఒకవేళ అతని నుంచి ఎలాంటి ప్రతిస్పం దన లభించక పోతే చిన్నగా తల ఊపడం ద్వారా మాత్రమే అభివందనం చేయాలి. తొలిసారిగా మీరు ఎవరినైనా కలిశారనుకుందాం. మీరిద్దరూ పరస్పరం కరచాలనం ద్వారా అభినందించుకున్నారు. ఆ కరచాలనం మూడు ప్రాథమిక దృక్పథాల్ని ప్రతిబింబిస్తుంది. ‘ఇతను నాపై ఆధిక్యతను ప్రదర్శిస్తు న్నాడు. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి’, ‘ఈ వ్యక్తిపై నేను ఆధిక్యతను ప్రదర్శించవచ్చు. నా కోరిక ను ఇతను నెరవేరుస్తాడు’, ‘ఈ వ్యక్తితో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’... మనకు తెలియకుండానే ఈ ఆలోచనలు ఒకరి నుంచి మరొకరికి పరస్పరం వినిమయం అవుతాయి. ఇద్దరి కలయిక తాలూకు తుది ఫలితాలపై ఈ ఆలోచనలు తక్షణ ఫలితాన్ని చూపుతాయి. మన అరచేతిని కిందికి చూపుతూ కరచాలనం చేయడం ద్వారా ఎదుటి వ్యక్తి మీద మన నియంత్రణను ప్రదర్శించవచ్చు. పురుషులతో కరచాలనం చేయవలసి వచ్చినపుడు స్త్రీలు సుతిమెత్తగా కరచాలనం చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి మీ స్త్రీత్వపు చిహ్నాల్ని అతిగా ప్రదర్శించినట్టవుతుంది. వాణిజ్య, ఉద్యోగరంగాల్లో స్త్రీలు బలంగా కరచాలనం చేయడమే మంచిది. ఇలా బలంగా కరచాలనం చేసే స్త్రీలు తమ శక్తిమంతమైన వ్యక్తిత్వాన్ని కరచాలనం ద్వారా ప్రదర్శిస్తారు. 

బలహీనమైన కరచాలనం
అరచేతిని పైకి చూపుతూ కరచాలనం చేయడమన్నది మన వ్యక్తిత్వంలోని బలహీనతను సూచిస్తుంది. ఇలాimage అరచేతిని పైకి చూపుతూ చేతిని అందించడం వల్ల ఎదుటి వ్యక్తిది ‘పైచేయి’ అవడా నికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే ఎదుటి వ్యక్తి అధికారాన్ని మీరు అంగీకరించినప్పుడు ఇలాంటి బలహీనమైన కరచాలనం మేలు చేస్తుంది. అయితే చిత్రకారులు, సర్జన్లు, సంగీతకారులు కూడా ఇలాగే బలహీనమైన కరచాలనాన్నే ఇస్తారు. అంతమాత్రం చేత వాళ్ళను బలహీనులుగా అంచనా వేయకూడదు. వాళ్ళు తమ చేతుల్ని కాపాడుకునేందుకే అరచేతిని పైకి చూపుతూ కరచాలనం చేస్తారు. ఇలాంటి వ్యక్తుల విషయంలో వారి కరచాలనంతోపాటు, వారి ముఖ కవళికల్ని కూడా చదవాలి. అప్పుడు అవతలి వ్యక్తి మనస్తత్వాన్ని కొంతమేరకైనా అర్థం చేసుకోవడానికి వీలవు తుంది. 

సమానత్వం
తామే అధికులమని భావించే ఇద్దరు వ్యక్తులు పరస్పరం కరచాలనం చేసుకుంటే, అక్కడ అధికారం కోసం సంఘర్షణ తలెత్తుంది. ఇద్దరూ ఎవరికి వారే అవతలి వ్యక్తి అరచేతిని లొంగుబాటును సూచించేలా పైకి తిప్పడానికి ప్రయత్నిస్తారు. తత్ఫలితంగా ఇద్దరి చేతులూ సమాంతరంగా కలుస్తాయి. అది వారి మధ్య సమానత్వానికి, పరస్పర గౌరవానికి చిహ్నంగా మారుతుంది. 

సామరస్యాన్ని సాధించడమెలా?
కరచాలనం ద్వారా సామరస్యాన్ని సాధించాల నుకుంటే ప్రధానంగా రెండు విషయాలపై దృష్టిని నిలపాలి. తొలుత మీ అరచేయి, ఎదుటి వ్యక్తి అరచేతికి సమాంతరంగా ఉండేలా చూసుకోండి. మీ ఇద్దరిలో ఏ ఒక్కరూ అధికులుగా కానీ, అథములుగా కానీ కాకుండా పరస్పరం సమానులుగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. ఎదుటి వ్యక్తి మీ చేతిని ఎంత బలాన్ని ఉపయోగించి నొక్కుతున్నాడో గమనించి, అంతే బలాన్ని ఉపయోగిస్తూ ప్రతిస్పందించండి. 

డబుల్ హ్యాండర్
imageప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన సంకేతమిది. నేరుగా కళ్ళలోకి చూస్తూ, ఆత్మీయంగా నవ్వుతూ ఎదుటి వారి పేరును ఉచ్ఛరిస్తూ, వారి ఆరోగ్యాన్ని గురించి వాకబు చేస్తూ మీ రెండు చేతులను ఉపయోగించి కరచాలనం చేయడమన్నది మంచి ఫలితాన్నిస్తుంది. కరచాలనానికి తొలుత ఉద్యుక్తుడైన వ్యక్తి ఈ డబుల్ హ్యాండర్ ద్వారా మరింత ఎక్కువగా ఎదుటి వారితో భౌతిక సంబంధాన్ని పెంచుకుంటారు. దీనివల్ల అతను కరచాలనాన్ని స్వీకరించే వ్యక్తి మీద నియంత్రణను సాధిస్తూ అతని కుడిచేతిని అదుపులోకి తీసుకుంటాడు. డబుల్ హ్యాండర్‌ను ఉపయోగించే వ్యక్తి తాను మరింత నమ్మదగిన నిజాయి తీపరుడినన్న భావనను కలిగిస్తాడు. అయితే అప్పుడే తొలిసారిగా కలుసుకున్న వ్యక్తుల మీద డబుల్ హ్యాండర్‌ను ప్రయోగిస్తే, వాళ్ళు మీ ఉద్దేశాలను శంకించే ప్రమా దముంది. డబుల్‌హ్యాండర్ అనే కరచాలనం కౌగిలికి సంక్షిప్తరూపం. పటిష్టమైన ఆత్మీయానురాగాలున్న సందర్భంలోనే డబుల్‌హ్యాండర్‌ను వాడడం మంచిది. 

కరచాలనమన్నది ఒక పలకరింపు కోసం, ఒక నిష్క్రమణ కోసం, ఒక ఒప్పందం కుదిరినందుకు సంకేతంగా వాడడం కోసం ఉద్దేశితమైంది. కాబట్టి అదెప్పుడూ స్నేహపూర్వకంగా, సానుకూలం గా, ఆత్మీయంగా ఉండేలా చూసుకోండి.

English Title
Shake hands
Related News