పాపం.. మగాళ్లు!

Updated By ManamSun, 09/16/2018 - 01:49
Section-498
  • నలిగిపోతున్న మగమహారాజులు.. అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్య్రం

  • వాళ్ల చేతుల్లోనే 498ఎ ఆయుధం.. భర్తలను అదుపులో ఉంచే యత్నం

  • మాట చెల్లించుకోవాలన్న పంతం.. విడాకుల వరకు వెళ్తున్న కాపురాలు

  • పాతికేళ్లలోపే విడిపోతున్న భార్యలు.. సమాజం చీలిపోతోందన్న సుప్రీం

Section-498‘‘అరిటాకు వెళ్లి ముల్లు మీద పడ్డా.. ముల్లు వచ్చి అరిటాకు మీద పడ్డా చిరిగేది అరిటాకే’’. ఈ సామెత చాలా కాలంగా వాడుకలో ఉంది. ప్రస్తుత కాలమాన పరిస్థతులకు కూడా చాలా వరకు సరిపోతోంది. కానీ, అరిటాకు.. ముల్లు తమ పాత్రలను మార్చుకు న్నాయంతే! మగవాళ్లు అరిటాకుల్లా మారిపోయి నలిగిపోతున్నారు. ఈ మాట అన్నది ఎవరో నరనరాన పురుషాహంకారం నింపుకొన్న పెద్దమనుషులు కాదు.. సాక్షాత్తు సుప్రీంకోర్టే! ఎప్పుడో 1983 నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, కట్నం కోసం.. ఇతర కారణాలతో మెట్టినింట్లో గృహహింసకు బలైపోతున్న అబలలను కాపాడేందుకు రూపొందించిన సెక్షన్ 498ఎను మార్చాల్సిన అవసరం ఉందని స్వయంగా సుప్రీంకోర్టే వ్యాఖ్యానించే వరకు పరిస్థితి వెళ్లింది. అమ్మాయిల పట్ల సమాజ దృక్పథం మారింది. ఒకప్పుడు గుండెల మీద కుంపటిటా భావించే తల్లిదండ్రులు కూడా తమకు కూతురుందని గర్వంగా చెప్పుకొనే పరిస్థితి వచ్చింది. చదువులు, ఉద్యోగాల దగ్గర నుంచి సంపాదన వరకు అన్నింట్లోనూ వాళ్లు దూసుకెళ్లిపోతుండటంతో పుట్టింట్లో వాళ్లను మహారాణుల్లా చూస్తున్నారు. సమాజంలో కూడా కావల్సినంత గౌరవం లభిస్తోంది. చిన్న వయసులోనే మంచి ఉద్యోగాలు సంపాదించడం, కూతురి సంపాదన తమకెందుకని తల్లిదండ్రులు కూడా వాళ్లకు వదిలేయడంతో.. అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్య్రం వస్తోంది. చిన్న వయసులోనే పెద్ద సంపాదన కళ్లజూస్తున్నారు. ఇలాంటి సమయంలో పెళ్లిళ్లు అయినపుడు ఒక్కసారిగా తమకు బాగా అలవాటైపోయిన స్వేచ్ఛా ప్రపంచంలోంచి ఉన్నట్టుండి పంజరం లాంటి జీవితంలోకి రావడం వాళ్లకు కష్టంగా అనిపిస్తోంది. అత్తమామలు, భర్త అందరూ మంచివాళ్లే అయినా అక్కడ సర్దుకోవడం చాలామందికి సాధ్యం కావడం లేదు. ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా పీజీలలో ఉండేటపుడు కావాలంటే తినడం లేదంటే ఏ స్విగ్గీలోనో, జొమాటోలోనో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం అలవాటుగా మారి.. ప్రతిరోజూ ఇంట్లో వంట చేయాలన్నా, తినాలన్నా కూడా కొంత కష్టంగానే అనిపిస్తోంది. మరోవైపు మగవాళ్లకు మాత్రం ఉద్యోగం వచ్చిన తర్వాత బాధ్యతలు పెరుగుతున్నాయి. 

ఇంట్లో తల్లిదండ్రులు అప్పటివరకు కష్టపడి ఉంటారు కాబట్టి వాళ్ల మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత స్వతహాగానే మగపిల్లల మీద ఉంటుంది. బాగా ధనవంతులైన కుటుంబాల సంగతి ఎలా ఉన్నా.. మధ్యతరగతి, ఎగువ, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యోగాల కోసం ఊరికి దూరంగా వె ళ్లినపుడు అప్పటివరకు హోటళ్లలోనో, పీజీలోనో నోటికి ఏమాత్రం నచ్చకపోయి నా అలాగే తినేసి కాలక్షేపం చేసినవాళ్లు పెళ్లయిన తర్వాత భార్య వండిపెడితే తినాలని ఆశపడుతున్నారు. సరిగ్గా ఇక్కడే ఇద్దరికీ మధ్య వైరుధ్యం తలెత్తుతోంది. తాను కూడా సమానంగా సంపాదిస్తున్నప్పుడు ఇంట్లో వంట చేయాల్సిన ఖర్మ తనకేంటన్న ఆలోచనలు అమ్మాయిలకు తలెత్తుతున్నాయి. దీంతో చిన్న చిన్న గొడవలు కాస్తా చినికి చినికి గాలివానగా మారి విడాకుల వరకు వెళ్తున్నాయి. పట్టుమని పాతికేళ్ల వయసు కూడా రాకముందే విడాకులు తీసుకుంటున్న అమ్మాయిల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. కేవలం విడాకులు తీసుకోవడమే కాక, తమ చేతిలో ఉన్న 498ఎ అనే బ్రహ్మాస్త్రాన్ని భర్త, అత్తమామల మీద ప్రయోగించడానికి కూడా మగువలు వెనుకాడటం లేదు. ఇది ఆడవాళ్లు, మగవాళ్ల మధ్య యుద్ధంగా మారిపోతోందని, ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తూ భర్త, వాళ్ల తరఫు బంధువులను వేధించడానికి అమ్మాయిలు ప్రయత్నిస్తున్నారని స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. ఇలాంటి వేధింపుల నుంచి భర్తలకు రక్షణ కల్పించాలని సూచించింది. పోలీసులు కూడా అమ్మాయిలు ఫిర్యాదు చేయగానే వెంటనే అతిగా స్పందించి వెంటనే అరెస్టు చేయడం సరికాదని, ఇలా చేయడం వల్ల సమాజం నిట్టనిలువుగా చీలిపోతుందని కోర్టు వ్యాఖ్యానించింది. 498ఎ సెక్షన్‌ను దుర్వినియోగం చేయకుండా ఉండేలా ఆ చట్టానికి తగిన సవరణలు చేయాలని చెప్పింది. ఎప్పుడో దాదాపు 35 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉన్నందున.. ఇప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపింది. కోర్టులు ముందస్తు బెయి ల్ మంజూరు చేయచ్చు లేదా మొత్తం క్రిమినల్ విచార ణనే రద్దు కూడా చేయచ్చని.. అలా చేస్తే స్త్రీ పురుషుల మధ్య యుద్ధాన్ని నివారించడానికి కొంతవరకు వీలవు తుందని జస్టిస్ దీపక్ మిశ్రా చెప్పుకొచ్చారు. జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో 498ఎ ఫిర్యాదులను క్షుణ్ణం గా పరిశీలించాలని, ఆ కమిటీ తుది నివేదిక ఇచ్చేవరకు అరెస్టులు చేయకూడదని తన ఉత్తర్వులలో తెలిపారు. 

నలిగిపోయిన అరిటాకులు..
ఇప్పటికే ఒకసారి విడాకులు తీసుకున్న భర్తల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటోంది. విడాకులు నిజంగా మంజూరయ్యాయా, ఒకవేళ అయితే అందుకు కారణం ఏంటి, క్రిమినల్ కేసు (498ఎ) ఏమైనా పెండింగులో ఉందా.. కొట్టేశారా? ఇలాంటి అనేకానేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అన్నింటికీ సమాధానాలు ఇచ్చి సిద్ధపడి పెళ్లి చేసుకున్నా అది నిలుస్తుందన్న గ్యారంటీ లేకపోవడంతో తమ బతుకులు నలిగిపోయిన అరిటాకుల్లా తయారవుతున్నాయని ఈ మధ్యనే విడాకులు తీసుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అశోక్ వాపోయాడు.

English Title
Sin .. males!
Related News