లాభాల స్వీకరణతో స్వల్ప క్షీణత

Updated By ManamTue, 03/13/2018 - 22:19
bse

bseముంబయి: కొన్ని బ్యాంకుల షేర్లు, ఎఫ్.ఎం.సి.జి షేర్లలో ట్రేడింగ్ చివరలో చోటుచేసుకున్న లాభాల స్వీకరణ, టీసీఎస్ షేర్ల ధర తీవ్ర పతనంతో బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజ్ (బి.ఎస్.ఇ) ‘సెన్సెక్స్’ మంగళవారం 61.16 పాయింట్లు క్షీణించి 33,856.78 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజ్ (ఎన్.ఎస్.ఇ) సూచి ‘నిఫ్టీ’ మాత్రం సోమవారంనాటి స్థాయిని నిలబెట్టుకోగలిగింది. యాభై షేర్ల ధరల్లో హెచ్చు తగ్గులను ప్రతిబింబించే ‘నిఫ్టీ’ రెండవ రోజున స్వల్పంగా 5.45 పాయింట్లు లాభపడి 10,426.85 పాయింట్ల వద్ద ముగిసింది. టి.సి.ఎస్, ఐ.టి.సి షేర్ల ధరలు క్షీణించినా, హెచ్.పి.సి.ఎల్, యాక్సిస్ బ్యాంక్, గెయిల్ షేర్లలో లాభాలతో ‘నిఫ్టీ’ నిలదొక్కుకోగలిగింది. రోజంతా స్టాక్ మార్కెట్లు ఉత్థాన పతనాలను చూస్తూనే ఉన్నాయి. ఫెడ్ రేటు పెంపుదలలు ఏ విధంగా ఉండగలవో అంచనా వేసేందుకు అవెురికా ద్రవ్యోల్బణ డాటా ఇచ్చే సంకేతాల కోసం మదుపరులు ఎదురు చూశారు. టాటా కన్సల్టెన్సీ (టి.సి.ఎస్) షేర్ ధర 5.22 శాతం క్షీణించి రూ. 2,892.45కి పతనమైది. దాని ప్రమోటర్ టాటా సన్స్ ఈ ఐ.టి దిగ్గజంలో వాటా విక్రయం ద్వారా దాదాపు రూ. 8,200 కోట్లు సమీకరించే యోచనలో ఉందని వార్తలు రావడంతో టి.సి.ఎస్ షేర్ ధర పడిపోయింది.

ఎఫ్.ఎం.సి.జి మేజర్ ఐ.టి.సి 0.5 శాతం తగ్గింది. కోటక్ బ్యాంక్, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ 1.46 శాతం క్షీణించడంతో ట్రేడింగ్ మొదట్లో కనిపించిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆసియాలోని ఇతర మార్కెట్ల నుంచి సంకేతాలు బలహీనంగా ఉండడంతో ‘సెన్సెక్స్’ 33,818.22 పాయింట్ల బలహీన స్థితి వద్దనే మొదలైనా, వెంటనే 34,000 పాయింట్ల స్థాయిని అందుకుంది. స్థూల ఆర్థిక డాటా సానుకూలంగా ఉండడంతో 34,077.32 పాయింట్ల గరిష్ఠ స్థితిని చూసింది. అయితే, చివర్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో, 33,856.78 పాయింట్ల వద్ద ముగియడానికి ముందు 33,722.96 పాయింట్లకు పడిపోయింది.  ‘‘ద్రవ్యోల్బణం సడలడం, ఐ.ఐ.పి డాటా ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉండడంతో, మార్కెట్ సానుకూల గతినే సంతరించుకుంది. అయితే, ఐ.టి రంగ షేర్లలో అమ్మకాలు, బ్యాంకుల షేర్లలో లాభాల స్వీకరణతో రోజంతా మార్కెట్ ఆ సానుకూలతను నిలబెట్టుకోలేకపోయింది’’ అని జియోజీత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ చెప్పారు. 

రిటైల్ ద్రవ్యోల్బణం ఆశ్చర్యకరంగా మందగించి 2017 డిసెంబరులో ఉన్న 5.2 శాతం నుంచి 2018 జనవరికి 5.1 శాతానికి, వరుసగా రెండవ నెల ఫిబ్రవరిలో 4.4 శాతానికి తగ్గింది. పారిశ్రామిక ఉత్పత్తి వరుసగా మూడవ నెలలోనూ బలమైన వేగంతో వృద్ధి చెంది జనవరిలో 7.5 శాతంగా నిలిచింది. ‘‘మందగొడిగా ఉన్న ఇతర ఆసియా మార్కెట్లు దేశంలోని స్టాక్ మార్కెట్లను తీవ్ర హెచ్చు తగ్గులకు లోను చేశాయి. దేశానికి చెందిన సానుకూల స్థూల ఆర్థిక డాటా దేశీయ సెంటిమెంట్‌ను స్వల్పంగా పెంచింది’’ అని బీఎన్‌పి పరిబస్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ల విభాగ డిప్యూటి సి.ఇ.ఓ ఆనంద్ షా చెప్పారు. 

Tags
English Title
Slight decline with profit receipts
Related News