చిన్నబోయిన సూచీలు

Updated By ManamMon, 09/03/2018 - 22:34
Sensex

Sensex_Catch_ముంబై: సోమవారం సెషన్ చివరలో చోటుచేసుకున్న అమ్మకాలతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి 333 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో మారకంలో రూపాయి విలువ క్షీణిస్తూపోవడం, పెరుగుతున్న ముడి చమురు ధరలు, ప్రపంచ వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలపై వేధిస్తున్న ఆందోళనలతో ‘‘సెన్సెక్స్’’ వరుసగా నాల్గో సెషన్‌లో నష్టాలను నమోదు చేసింది. వేగంగా అమ్ముడుపోయే వినియోగ వస్తువులు, రియల్టీ, విద్యుచ్ఛక్తి, బ్యాంకింగ్ రంగ షేర్లు సెషన్ చివర్లో విస్తృత అమ్మకాలకు లోనయ్యాయి. 

పెరుగుతున్న చమురు ధరలు
ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు చమురు సరఫరాలను దెబ్బతీయవచ్చనే భయాలతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగిపోతున్నాయి. అయితే, గుడ్లిలో మెల్లలా ధర పెరుగుదల ఇప్పటికీ పరిమితంగానే ఉంది. ఇరాన్ కారణంగా సరఫరాలో ఏర్పడే వెలితిని సౌదీ అరేబియా, రష్యా, అమెరికాల సరఫరాలు తీర్చగలవనే ఆశాభావం కూడా ఉంది. బి.ఎస్.ఇ ‘‘సెన్సెక్స్’’ సానుకూల ధోరణితో ప్రారంభమై ఆరంభ ట్రేడ్‌లో 289 పాయింట్లు పెరిగి 38,934.35 స్థాయిని తాకింది. మొదటి త్రైమాసిక జి.డి.పి డాటా బాగుండడం, రూపాయి కొంత రికవరవడం మార్కెట్‌కు టానిక్‌లా పనిచేసింది. కానీ, చివరలో చోటుచేసుకున్న అమ్మకాలతో ఆ లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. వస్తూత్పత్తి కార్యకలాపాలు ఆగస్టులో మందగించినట్లు నివేదిక రావడంతో ‘‘సెన్సెక్స్’’ 38,270.01 కనిష్ఠ స్థితిని చూసింది. చివరకు ‘‘సెన్సెక్స్’’ 332.55 పాయింట్ల భారీ నష్టంతో 38,312.52 వద్ద ముగిసింది. గత మూడు సెషన్లలో ‘‘సెన్సెక్స్’’ 251.56 పాయింట్లను కోల్పోయింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 98.15 పాయింట్లు కోల్పోయి 10,600 దిగువన ముగిసింది. అది 11,567.40 నుంచి 11,751.80 మధ్య ఊగిసలాడి చివరకు 11,582.35 వద్ద ముగిసింది. రెండు సూచీలు ఒకే రోజులో ఇంత ఎక్కువగా పాయింట్లను నష్టపోవడం ఆగస్టు 2 తర్వాత ఇదే మొదటిసారి. ఆగస్టు 2న ‘‘సెన్సెక్స్’’ 356.46 పాయింట్లు కోల్పోగా, ‘నిఫ్టీ’ 101.50 పాయింట్లు నష్టపోయింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు శుక్రవారంనాడు రూ. 212.81 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 171.92 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేసినట్లు తాత్కాలిక డాటా సూచించింది. 

చితికిపోతున్న రూపాయి
డాలర్‌తో పోలిస్తే భారతీయ కరెన్సీ సోమవారం నాడు నూతన జీవిత కాల కనిష్ఠ స్థాయి రూ. 71.21కి పడిపోయింది. ఇది స్థూల ఆర్థికవ్యవస్థపై కొత్త గుబులును రేకెత్తించింది. మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా దేశ వస్తూత్పత్తి రంగ కార్యకలాపాలు ఆగస్టులో వరుసగా రెండో నెలలో సడలినట్లు నెలవారీ నివేదిక ఒకటి వెల్లడించింది. చైనాపై నూతన సుంకాలు విధించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  గత వారం ప్రకటించిన తర్వాత, ప్రపంచ వాణిజ్య యుద్ధ స్థితిగతులకు సంబంధించిన పరిణామాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. 

English Title
Smaller indexes
Related News