అమ్మో....పాము!

Updated By ManamSun, 08/26/2018 - 10:14
Snake-bite deaths
  • ఏపీలో పలు జిల్లాల్లో పాముకాట్లు..

  • కృష్ణాజిల​ఆ దివిసీమలో మరీ తీవ్రం...25 రోజుల్లో 144మందికి కాటు

  • ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా..వరదలు..వర్షాలతో పాముల బెడద

  • ప్రాణభయంతో కాటేస్తున్న సర్పాలు.. కర్రలు పట్టుకుని రైతుల కాపలా

  • కృష్ణాజిల్లా మోపిదేవిలో ఈ నెల 29న సర్పశాంతి హోమం

snakes

అమరావతి : పాము... ఆ పేరు వింటేనే చాలామందికి భయంతో గుండె ఆగిపోతోంది. పాము కాటేసినప్పుడు కూడా ఆ విష ప్రభావం కంటే, పాముకాటుకు గురయ్యామన్న భయంతోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతారు. ఇటీవలి కాలంలో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పాముకాట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా తమ్మిలేదరు వరద ప్రభావంతో కృష్ణా, గోదావరి వరదలు వచ్చినప్పటి నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో పాముల సంచారం ఎక్కువైందని రైతులు చెబుతున్నారు. గ్రామాల్లో నీరు చేరినపుడు ఆ నీళ్లలో అత్యంత విషపూరితమైన పాములు కూడా తిరుగుతున్నాయని, చీకటి పడిందంటే వీటిబారిన పడి ఎక్కడ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన వస్తుందో అని భయపడుతున్నారు. 

కృష్ణాజిల్లా దివిసీమలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు తదితర ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో పాముకాట్లు బాగా ఎక్కువయ్యాయి. గడిచిన 25 రోజుల్లో 144మంది పాము కాటుకు గురయ్యారు. ఇంతకు ముందు కూడా ప్రతియేటా వరినాట్ల సమయంలో అంతకు ముందు వరకు పంట చేలల్లో బొరియలు చేసుకుని వాటిలో ఉండే పాములు...రైతులు దుక్కిదున్నడం మొదలుపెట్టగానే బయటకు వచ్చేవి. దాంతో నాట్ల సమయంలో పలువురు రైతులు, రైతుకూలీలు పాముకాటు బారిన పడేవారు. కానీ ఈసారి మాత్రం మునుపెన్నడూ లేనిస్థాయిలో అత్యధికంగా పాము కాటు ఘటనలు కనిపిస్తున్నాయి. ఉంగుటూరు ప్రాంతంలో రైతులు ఒక రక్తపింజర పామును చంపగా, 50కి పైగా పిల్లలు బయటకు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా అంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రకాల్వ వరద మొదలైనప్పటి నుంచి అక్కడ పాముకాట్ల ఘటన పెరిగాయి. నిడదవోలులో ఎర్రకాల్వ సమీపంలో ఒకేరోజు ఆరుగురిని పాములు కాటేయడంతో వారిని హుటాహుటీన ఆస్పత్రులకు తరలించారు. గ్రామాల్లో ఎటుచూసినా పాములే కనపడుతుండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు రైతున్నలు కర్రలు పట్టుకుని వంతులు వారీగా కాపలాలు కాస్తున్నారు. ఏ ఊళ్లో చూసినా పదులు, వందల సంఖ్యలో పాములు తిరుగాడుతుండటంతో కనిపించిన వాటిని కనిపించినట్లే చంపేస్తున్నారు. 

తూర్పు, గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలలో గోదావరి వరదల ముంపు ఫలితంగా కూడా లెక్కలేనన్ని పాములు సంచరించాయి. లంకలన్నీ వరముంపులోని ఉండటంతో ఆ నీళ్లలో విపరీతంగా విషసర్పాలు వచ్చాయి. నీళ్లు ఉన్నాయన్నకారణంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దాంతో చీకటిలో గుడ్డి దీపాల వెలుగులో పాముల భయంతో జనం అల్లల్లాడారు. ఇప్పటిదాకా మెట్ట ప్రాంతంలో ఆవాసాలు ఉంటున్న తాచులు, పొడపాములు ఒక్కసారిగా బయటపడటంతో పాటు, తాచుపాములైతే ఏకంగా తొమ్మిది, పది అడుగులు ఉంటున్నాయంటున్నారు. పడగ విప్పి మరీ నీళ్లలో అవి తిరుగుతుండటంతో వాటిని చూసి జనం భయంతో వణికిపోతున్నారు.

సర్ప శాంతి హోమం
దివిసీమ ప్రాంతంలో పాములు సంచారం చాలా ఎక్కువగా ఉండటంతో, వాటిని శాంతింపచేసేందుకు సుబ్రమణ్యస్వామి కొలువై ఉన్న మోపిదేవిలో ఈ నెల 29న సర్పశాంతి హోంమం నిర్వహించాలని ఆలయ పాలకవర్గం నిర్ణయించింది. గడిచిన నాలుగు నెలల్లో 300మందికి పైగా పాముకాట్లకు గురి కవాడంతో వాటిని కొంతయినా శాంతింపచేయాలని ఈ హోమం నిర్వహిస్తున్నారు. దివిసీమ పరిధిలోని ఏడు మండలాల ప్రజలు ఈ హోమానికి రావాలని ఆహ్వానాలు పంపుతున్నారు. ప్రభుత్వపరంగా కూడా పొల్లాల్లోంచి పాములను తరిమేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత​ చర్యల గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు ప్రజలకు ఉపశమనం కోసం ఈ హోమం నిర్వహించాలని తలపెడుతున్నారు.

English Title
Snake-bite deaths highest in Andhra Pradesh
Related News