ఎలిమినేటర్ ఎవరో...

Updated By ManamTue, 05/22/2018 - 21:55
ipl
  • నేడు ఐపీఎల్‌లో రాజస్థాన్, కోల్‌కతా మధ్య చివరిపోరు

imageకోల్‌కతా: ఐపీఎల్-11లో లీగ్ దశ ముగిసింది. ఒక ఉత్కంఠ పోరుకు తెరలేచింది. బుధవారం జరగనున్న కీలకమైన ఎలిమినేటర్ పోరులో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), రెండుసార్లు విజేత, ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లోని లీగ్ దశ మ్యాచ్‌ల్లో ఇంటా, బయటా ఆర్‌ఆర్‌ను కేకేఆర్ చిత్తు చేసింది. గత నెలలో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్లతో ఆర్‌ఆర్‌ను కోల్‌కతా చిత్తు చేయగా.. వారం క్రితం ఈడెన్ గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్లతో గెలిచి ప్లే ఆఫ్‌కు చేరుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇలా నాలుగో స్థానంలో నిలవడం ఇది ఆరోసారి. ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన కేకేఆర్ జట్టు గత మ్యాచ్‌లో టేబుల్ టాపర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ సేన చాలా తెలివిగా ప్రవర్తించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో హోం అడ్వాంటేజ్ తీసుకున్న ఏకైక జట్టు కేకేఆర్. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్ ఆడుతుంది. ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. మరోవైపు ఆరంభ ఐపీఎల్ విజేత రాజస్థాన్ జట్టు స్టార్ ప్లేయర్స్‌తో ప్లే ఆఫ్‌కు చేరుకుంది. కానీ ప్లే ఆఫ్‌లో జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ వంటి స్టార్ ఆటగాళ్లు లేకపోవడంతో ఇప్పడు అదృష్టంపైనే ఎక్కువగా ఆధారపడింది. రాజస్థాన్ జట్టు ఎన్నో ఒడుదు డుకులు ఎదుర్కొని ప్లే ఆఫ్‌కు చేరుకుంది. అయితే ఈ నెల 19న జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కానీ అది ఎంత మాత్రమూ సరిపోలేదు. ప్లే ఆఫ్‌కు చేరాలంటే మరో రెండు మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి వచ్చింది. వారి ప్రార్థనలు ఫలించి మిగతా మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు ఓటమిపాలై ఇంటి ముఖం పట్టాయి. దీంతో నాటకీయంగా ఆర్‌ఆర్ జట్టు ప్లే ఆఫ్‌కు చేరుకుంది. దాదాపు క్వార్టర్ ఫైనల్‌తో సమానమైన ఎలిమినేటర్‌లో తప్పిదాలకు అవకాశం లేదు. దీంతో అజింక్య రహానే సేన ప్రస్తుతం తమకున్న వనరులపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఆర్‌ఆర్ ముందున్న మొదటి సవాల్ ఏదనగా.. సునీల్ నరైన్, పియుష్ చావ్లా, కుల్‌దీప్ యాదవ్ వంటి అత్యుత్తమ స్పిన్నర్లను ఎదుర్కోవడం. లీగ్ దశ మ్యాచ్‌లన్నింటీలో పేలవ ఆటను కొనసాగించిన కెప్టెన్ రహానే (324 పరుగులు) ఈ మ్యాచ్‌లోనైనా కీలకపాత్ర పోషించాలి. పరుగుల స్వర్గ ధామంగా, రెండో బ్యాటింగ్ చేసే జట్టుకు సహకరించే ఈ పిచ్‌పై సంజు శాంసన్, ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రాహుల్ త్రిపాఠీలతో కలిసి రహానే కూడా సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు.

Tags
English Title
Someone Eliminator ...
Related News