అందరికీ ఆత్మబంధువు

Updated By ManamMon, 07/23/2018 - 06:25
image

imageపశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండల కేంద్రమైన తాళ్లపూడి గాంధీబొమ్మ వీధిలో మా ఇల్లు ఉంది. కరణంగారిల్లుగా ఊరిలో మా ఇంటికి గుర్తింపు ఉంది. అమ్మమ్మకి అమ్మ ఒకే ఒక్క కూతురవడం వల్ల అమ్మ దగ్గరే ఉండేది. ఆ విధంగా మా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ సర్వస్వం అయింది. అమ్మమ్మే మాకు జీవన విలువలు నేర్పింది.

imageఅయిదుగురు మనవలు, ఇద్దరు మనవరాళ్లు.. మొత్తం ఏడుగురు పిల్లల పెంపకంలో అమ్మకి అమ్మమ్మ ఎంతో సాయం చేసింది. ఇంటికి వచ్చే బంధువుల తాకిడి కూడా ఎక్కువగా ఉండేది. ఎప్పుడు లేచోదో తెలియదు గాని ఉదయం ఆరు గంటలకల్లా వేడినీళ్లు సిద్ధంగా ఉంచేది. ఏడు గంటలకల్లా వేడి వేడి టిఫిన్ సిద్ధం చేసేది. పూజలు, నైవేద్యాలు కూడా అయిపోయేవి. పండగలప్పుడు తలంటు స్నానాల హడావిడి చెప్పడానికి మాటలు చాలవు.

అమ్మమ్మ మనసు అమృతం అని చెప్పాలి. ఎందుకంటే రకరకాల వంటకాలు ఎంతో రుచిగా చేసేది. విసుగు విరామం లేకుండా రోజూ పదిహేను మందికి వంటలు వండేది. అప్పుడప్పుడు వచ్చే రెవెన్యూ అధికారులకు మా ఇంటి నుంచే భోజనం ఏర్పాటు అయ్యేది. బొబ్బట్లు, చక్కెర పొంగలి, సాంబారు, పెరుగావడ వంటి వంటకాల రుచిని అందరూ పదే పదే మెచ్చుకునేవారు. అమ్మమ్మ మరణించి ముప్పై యేళ్లు దాటినా ఆవిడ వంటల రుచిని చుట్టాలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

మడి, ఆచార సాంప్రదాయాలకు అమ్మమ్మ ఎంత ప్రాధాన్యం ఇస్తుందో, అంతకంటే మిన్నగా మానవతా విలువలు పాటించేది. కాలంతో వచ్చిన మార్పులని స్వాగతించేది. మా జీవన విధానంలో మార్పులకి అభ్యంతరం చెప్పేది కాదు. అదే సమయంలో తన వ్యక్తిత్వాన్నీ, ఆత్మాభిమానాన్నీ నిలబెట్టుకునేది. గౌరవంగా బ్రతకడం నేర్పింది. తలదించుకునేలా జీవించకూడదనే సిద్ధాంతం అమ్మమ్మది. ఆ విధంగానే మమ్మల్ని తీర్చిదిద్దింది. వేసవి సెలవుల్లో అందరూ అమ్మమ్మ ఊరు వెళ్తుంటే మాకు ఎక్కడకి వెళ్లాలో తెలిసేది కాదు. అమ్మమ్మకు అయిదుగురు అన్నదమ్ములున్నారు. అమ్మమ్మ వాళ్లింటికి తీసుకెళ్లేది. చాలా పెళ్లిళ్లకి అమ్మమ్మ వెళ్లేది. వచ్చేటప్పుడు ఆటవస్తువులు, స్వీట్లు తెచ్చేది.

తాళ్లపూడిలో పురాతన మదన గోపాలస్వామి ఆలయం, శివాలయంకు, గోదావరి స్నానాలకు అమ్మమ్మ తీసుకువెళ్లేది. ఆ విధంగా భక్తిభావాన్ని పెంచింది. ఉన్నంతలో నలుగురికి సాయం చెయ్యడం, అన్నం పెట్టడం, మంచిగా మాట్లాడడం.. అన్నీ అమ్మమ్మ నుంచి మాకు సంక్రమించాయి. గొప్పలు చెప్పుకోవడం, బిగ్గరగా అరవడం, తన పెద్దరికాన్ని ప్రదర్శించడం వంటివి అమ్మమ్మ ఏనాడూ చెయ్యలేదు. అందుకే అమ్మమ్మ అందరికీ ఆదర్శమూర్తిగా నిలిచింది. అమ్మమ్మ ఇంటి పేరు అవసరాల అవడం కూడా ఒక విశేషం. ఎందుకంటే ఆవిడ అవసరం లేకుండా ఆ రోజుల్లో ఏ కార్యక్రమమూ జరిగేది కాదు.

బంధువుల గృహాల్లో జరిగే వేడుకలకి పది రోజుల ముందుగా అమ్మమ్మను తీసుకువెళ్లి పర్యవేక్షణా స్థానం ఇచ్చేవారు. అనుకోకుండా వంట మనుషులు రాని సందర్భాలు ఏర్పడేవి. అప్పటికప్పుడు ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో అమ్మమ్మ ఆత్మబంధువుగా మారేది. బంధువుల్లో కొంతమంది ఆడవారిని చైతన్యపరిచి తన నాయకత్వంలో వందమందికి వంట అద్భుతంగా చేసి కార్యక్రమం గట్టెక్కించేది.

శాంతంగా, నిర్మలంగా కనిపించే అమ్మమ్మ మితిమీరిన అల్లరి చేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం వీపు విమానం మోత ఎక్కించేది. ఆవిడ కొట్టింది అంటే కచ్చితంగా తప్పు చేసినట్లే లెక్క. మాకు పంచడానికి అమ్మమ్మ దగ్గర ఆస్తులు ఏమీ లేవు. కానీ అంతకంటే గొప్పవైన మంచి మార్గదర్శకత్వం, వ్యక్తిత్వం, శీలసంపద, ఆత్మాభిమానం, సహనం, శాంతం, భక్తితత్వం, ప్రేమాభిమానాలు వంటి సుగుణ సంపదను మాకు అందించింది.

అమ్మమ్మ పెద్దగా చదువుకోకపోయినా జీవితానుభవం ఎక్కువ గడించింది. చుట్టుపక్కలవారితో మర్యాదగా, మంచిగా ప్రవర్తించడం వంటి ఎన్నో సుగుణాలు అమ్మమ్మ ద్వారా అలవడ్డాయని చెప్పవచ్చు. అందుకే ఆవిడ మాకు గొప్ప మార్గదర్శి, ఆదర్శమూర్తి. అమ్మమ్మకు వేరే ఊరు లేకపోయినా ఆమే మా బాల్యంలో గురువుగా నిలిచి క్రమశిక్షణ నేర్పి మాకు సర్వస్వం అయింది. అందరికీ సేవలు చేసి, తాను మాత్రం ఎవరిచేతా, ఎలాంటి సేవలూ చేయించుకోకూడదని భావించేది. అమ్మమ్మ కోరికను భగవంతుడు తీర్చాడు. సునాయాసంగా ప్రాణాలు విడిచింది. మా మనసుల్లో శాశ్వతంగా నిలిచింది.

- పరస రాధాకృష్ణ
సెల్: 9490832190

English Title
The soul of everyone
Related News