మాట్లాడండి!

Updated By ManamWed, 10/24/2018 - 01:37
mudra
  • ‘మీ-టూ’ అనుభవాల్ని నిస్సంకోచంగా చెప్పండి

  • కుంగుబాటుకు గురవుతున్న యువత

image‘మీ-టూ’... ఇప్పుడు దేశాన్ని సిగ్గుతో తలవంచుకునేలా చేస్తున్న పదం ఇది. పనిచేసే చోట, చదువుకునే చోట..., ఎక్కడపడితే అక్కడ మహిళలు మృగాళ్ళ చేతిలో అవమానాలకు గురైన సందర్భాలన్నీ ఇవాళ గాయాలై సలపరిస్తున్నాయి. అధికారం, డబ్బు, పదవి..., ఇలా ఒకటేమిటి, అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వదలకుండా ఉపయోగించుకుని తమతో కలిసి పనిచేస్తున్న మహిళల్ని అసభ్య ప్రవర్తనతో బాధించిన ‘మహామహుల’ గుట్టంతా రట్టవుతోంది. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన, నిలబడతారనుకున్న ‘సెలబ్రిటీలు’, ‘రాజకీయవాదులు’, ‘అధికారులు’ తామంతా ఒకే తానులో ముక్కలమని నిరూపించుకుంటున్నారు. గాయం ఇవాల్టిది కాకపోయినా, దానికి చికిత్స జరగనంత వరకు ఏళ్ళుపూళ్ళూ అది బాధిస్తూనే ఉంటుంది. కొందరిలో ఇది ఆత్మన్యూనతకు, మానసిక కుంగుబాటుకు దారి తీస్తుంది కూడా! అవమానకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్న మహిళలు ఇవాళ గొంతెత్తి తమ అనుభవాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచం ముందుకు తెస్తున్నారు. అయితే తమకు జరిగిన అవమానాల్ని ఇలా సమాజం ముందుకు తెచ్చే సాహసం చేయలేని వాళ్ళు ఇంకా జరిగిన అవమానాన్ని తలచుకుని కుమిలి పోతూనే ఉన్నారు. పత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్న ‘మీ-టూ’ కథనాలు ఇలాంటి వారిలో మానసిక ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. తమ అనుభవాల్ని సమాజంతో పంచుకోవాలో, వద్దో తెలియక వీరు సతమతమవుతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ వేదనకు గురవుతోంది. 

‘మీ-టూ’ కథనాల్ని చదివనప్పుడల్లా తమ అనుభవాల్ని వెల్లడించాలన్న ఆతురత ఒక వైపు, ఆ అనుభవాలు గుర్తుకు రావడం వల్ల కలిగే వేదన మరోవైపు వీరిని వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే, దయచేసి మీ అనుభవాల్ని ఓర్పుగా విని, సానుకూలంగా స్పందించే వారితో వాటిని పంచుకోవాలన్నది నిపుణుల సలహా. ఇంతకాలం మీరు మీ అవమానాల్ని ఒంటరిగా, మౌనంగా భరించారు, సహించారు. ఇప్పుడిక నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిన సమయం వచ్చేసింది. జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదన్న విషయాన్ని మీరు ముందుగా గ్రహించాలి. 
ఇలాంటి అనుభవాలకు గురైన యువతులు జరిగిన దానికి తామే బాధ్యులమన్న అపోహలో ఉంటారు. తమకు జరిగిన అనుభవాన్ని బయటకు చెప్పుకునే ధైర్యం లేక, ‘నా మాటల్ని నమ్మరేమో?!’ అన్న అనుమానానికి కూడా గురవుతుంటారు. ఇలాంటి అనుభవాల గురించి బయటకు పొక్కితే ముఖ్యంగా కుటుంబ సభ్యులు తమకు దూరమై పోతారన్న భయం కూడా వీరిని వెన్నాడుతుంటుంది. ‘ముందుగా ధైర్యాన్ని కూడగట్టుకోండి. బయటకు చెప్పడమన్నది ధైర్యానికి సంబంధించింది, మీ మాటల్ని అందరూ నమ్మక పోవచ్చు.

కానీ కొందరు తప్పక నమ్ముతారు. అలా నమ్మే వాళ్ళు ఉన్నందు వల్లే మీ-టూ ఉద్యమం ఈ స్థాయిలో ముందుకు వచ్చింది’ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ‘మీరు ఎవరితో అయితే ఈ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నారో, వారు మీ సన్నిహితులైతే, మీ సహ ఉద్యోగి లేదా దూరపు బంధువులాంటి వాళ్ళయితే, మీరు తొందర పడకండి. ఇలాంటి సన్నిహితులతో మీకు జరిగిన అవమానాన్ని పంచుకోవాలంటే, అందరు మగవాళ్ళు ఒక్కటే, వీరికి చెప్పినా అర్థం కాదేమో?! అనే భయం మీకు కలుగుతుంది. అందుకే, మీరు తొందర పడకండి. సావధానంగా ఉండండి. ముందుగా మీ అనుభవాన్ని కొద్ది మందితో చెప్పి చూడండి. ఇలాంటి అవమానాలకు సంబంధించి ఇంతవరకు ఈ ప్రపంచానికి మౌనం మాత్రమే తెలుసు, కాబట్టి మీరు మాట్లాడండి, ఇతరులతో నెమ్మదిగా దీని గురించి సంభాషించండి. మీ అనుభవాల్ని ప్రపంచం ముందుకు తెచ్చే దారేదో మీరే కనుక్కోండి. ఇలాంటి విషయాల్లో మౌనం విషానికన్నా ప్రమాదకరమని గుర్తించండి. మాట్లాడండి’ అన్నదే మానసిక నిపుణుల సలహా! ఈ సలహాను పాటించండి, మౌనాన్ని విడనాడండి. మీకు మీరు న్యాయం చేసుకోక పోతే, మీకు న్యాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రారన్న విషయాన్ని గుర్తుంచుకోండి!
- విదుషి 

Tags
English Title
Speak!
Related News