2018 తొలి ఏడు వారాలు.. లోటు తీర్చిన విజ‌యాలు

Updated By ManamSat, 02/17/2018 - 22:58
nayan, anushka

nayan2018లోకి అడుగుపెట్టి 7 వారాలు పూర్త‌య్యింది. ఈ ఏడు వారాల్లో.. ప్ర‌తి వారం కూడా తెలుగు తెర‌పై సినిమాలు సంద‌డి చేస్తూనే ఉన్నాయి. ఈ 50 రోజుల కాలంలో అటుఇటుగా 20 సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. వాటిలో నాలుగు సినిమాలు మాత్ర‌మే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల గ‌ల‌గ‌లల‌కు చిరునామాగా నిలిచాయి. ఆ చిత్రాలే 'జై సింహా', 'భాగ‌మ‌తి', 'ఛ‌లో', 'తొలిప్రేమ‌'. ఈ సినిమాల్లో ప్ర‌తి సినిమా కూడా క‌నీసం ఇద్ద‌రికి చాలా కాలంగా విజ‌యాలు, బ్రేక్ లేని కొర‌త‌ని తీర్చ‌డం విశేషం. ఓ సారి వారిపై దృష్టి పెడితే..

సెకండ్ ఇన్నింగ్స్‌లో తొలి హిట్‌
న‌య‌న‌తార‌.. కోలీవుడ్ లేడీ సూప‌ర్ స్టార్‌. తెలుగులోనూ ఈమెకి మంచి క్రేజే ఉంది. అయితే.. త‌మిళంలో ఉన్నంత స్టార్ డ‌మ్‌ మాత్రం ఇక్క‌డ లేద‌న్న‌ది వాస్త‌వం. న‌య‌న‌తార కెరీర్‌ను 'శ్రీ‌రామ రాజ్యం' చిత్రానికి ముందు, త‌రువాత అని చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే.. ప్ర‌భుదేవాని పెళ్ళి చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌తో.. ఆ స‌మ‌యంలో సినిమాల‌కి దూరంగా ఉండాల‌నుకుంది ఈ మ‌ల‌యాళ మందారం. అయితే.. ఊహించ‌ని విధంగా ప్ర‌భుదేవాతో బ్రేక‌ప్ అవ‌డంతో.. తిరిగి కొత్త‌ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది న‌య‌న్‌. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్' చిత్రంలో న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌డ‌మే కాకుండా.. త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంది. అంతేనా.. ప్ర‌మోష‌న్స్‌కు దూరంగా ఉండే ఈ అమ్మ‌డు.. ఆ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో కూడా బాగానే పాల్గొంది. అయితే.. ఇంత‌చేసి ఆ సినిమా ఆమెకి ఏ విధంగానూ ప్ల‌స్ కాలేక‌పోయింది. ఆ త‌రువాత 'గ్రీకు వీరుడు', 'అనామిక‌', 'బాబు బంగారం' వంటి సినిమాలు చేసినా.. విజ‌యం మాత్రం ద‌క్క‌లేదు. మ‌రో వైపు.. అదే స‌మ‌యంలో త‌మిళనాట వ‌రుస విజ‌యాల‌తో నంబ‌ర్ వ‌న్ క‌థానాయిక అనిపించుకుంది. కోట్ల పారితోషికానికి ప‌డ‌గ‌లెత్తింది. అయితే.. ఒక‌టే లోటు. తెలుగులో స‌రైన విజ‌యం లేద‌ని. అయితే.. ఆ ముచ్చ‌టా తీరింది. తెలుగులో త‌న‌కి క‌లిసొచ్చిన క‌థానాయ‌కుల్లో ఒక‌రైన బాల‌కృష్ణ‌కి జోడీగా న‌టించిన 'జై సింహా' చిత్రం.. న‌య‌న్‌కు చాలా కాలం త‌రువాత తెలుగులో విజ‌యాన్ని అందించింది. ప్ర‌స్తుతం చిరంజీవి స‌ర‌స‌న 'సైరా న‌ర‌సింహారెడ్డి'లో న‌టిస్తోంది న‌య‌న్‌. 

తొలి విజ‌యం ద‌క్కింది
కె.ఎస్‌.రవికుమార్‌.. త‌మిళ‌నాట నంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్‌.  ఆయ‌న రూపొందించిన ప‌లు చిత్రాలు ఇక్క‌డా అనువాద‌మై.. ఘ‌న‌విజ‌యం సాధించాయి. 'ముత్తు', 'భామ‌నే స‌త్య‌భామ‌నే', 'న‌ర‌సింహా' వంటి చిత్రాల‌ను ఈ జాబితాలో చేర్చుకోవ‌చ్చు. అయితే.. తెలుగులో నేరుగా రూపొందించిన సినిమాలు మాత్రం ర‌వికుమార్‌కు అంత‌గా అచ్చిరాలేదు. చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేసిన 'స్నేహం కోసం' యావ‌రేజ్ కాగా.. నాగార్జున‌తో చేసిన 'బావ‌న‌చ్చాడు', రాజ‌శేఖ‌ర్‌తో రూపొందించిన 'విల‌న్' ప‌రాజ‌యం పాల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో.. దాదాపు 15 ఏళ్ళ త‌రువాత కె.ఎస్‌.ర‌వికుమార్ చేసిన తెలుగు  చిత్రం 'జై సింహా'. బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో చేసిన ఈ మాస్ మూవీ.. బాక్సాఫీస్ వ‌ద్ద విజేత‌గా నిలిచింది. ర‌వికుమార్‌కు తెలుగులో తొలి విజ‌యాన్ని అందించింది.

తొమ్మిదేళ్ళ త‌రువాత‌
అనుష్క ద‌శ‌, దిశ‌ని మార్చివేసిన చిత్రం 'అరుంధ‌తి'. ఆ సినిమా త‌రువాత హీరోయిన్ ఒరియెంటెడ్ మూవీస్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌లా మారింది ఈ మంగ‌ళూరు బ్యూటీ. 'పంచాక్ష‌రి', 'వ‌ర్ణ‌', 'రుద్ర‌మ‌దేవి', 'సైజ్ జీరో'.. ఇలా స్వీటీ చేసిన నాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల‌న్నీ ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఇలాంటి త‌రుణంలో  వ‌చ్చింది.. 'భాగ‌మ‌తి' . జ‌న‌వ‌రి 26న విడుద‌లైన ఈ పొలిటిక‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌.. 'అరుంధ‌తి' త‌రువాత లేడీ ఒరియెంటెడ్ మూవీస్ ప‌రంగా అనుష్కకు విజ‌యాలు లేని లోటును తీర్చింది. అలాగే.. ఓవ‌ర్సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూళ్ళు సాధించిన తొలి నాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రంగా నిలిచింది. 

నిరీక్ష‌ణ ఫ‌లించింది
'పిల్ల జమీందా'ర్ చిత్రంలో మాన‌వ‌తా విలువ‌ల‌ను చ‌క్క‌గా ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు జి.అశోక్‌. అయితే ఆ త‌రువాత ఆయ‌న రూపొందించిన 'సుకుమారుడు', 'చిత్రాంగ‌ద' చిత్రాలు పూర్తిగా నిరాశ‌ప‌రిచాయి. అయితే.. అనుష్క‌తో రూపొందించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ 'భాగ‌మ‌తి'..  అశోక్‌కు మ‌రో మంచి విజ‌యాన్ని అందించింది. కొత్త త‌ర‌హా స్క్రీన్‌ప్లేతో ఆయ‌న సెల్యూలాయిడ్‌పై చేసిన మాయాజాలం.. స‌క్సెస్ కోసం నిరీక్షిస్తున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌కు సూప‌ర్ హిట్ రిజ‌ల్ట్‌ను అందించింది. 

వినోదం మెప్పించింది
'ఊహ‌లు గుస‌గుస‌లాడె' చిత్రంతో యువ‌త‌రంలో త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌. ఆ త‌రువాత 'దిక్కులు చూడ‌కు రామ‌య్య‌', 'క‌ల్యాణ వైభోగ‌మే', 'జో అచ్యుతానంద' వంటి సినిమాలు చేసినా.. సాలిడ్ హిట్ మాత్రం ద‌క్క‌లేదు. అయితే.. త‌న హోమ్ బేన‌ర్‌పై చేసిన 'ఛ‌లో' చిత్రంతో సాలిడ్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 2న విడుద‌లైన ఈ సినిమా.. ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కి లాభాల బాట ప‌ట్టింది. ఈ సినిమా త‌రువాత నాగ శౌర్య మార్కెట్ పెరిగింద‌నే చెప్పాలి.

తండ్రికి త‌గ్గ త‌న‌యుడు
మ‌ణిశ‌ర్మ‌.. ఇండ‌స్ట్రీ హిట్ చిత్రాల‌న్నెంటికో సంగీత‌మందించిన నిన్న‌టి త‌రం మేటి సంగీత ద‌ర్శ‌కుడు. ఆయ‌న స్వ‌ర‌వార‌సుడిగా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టాడు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌. 'జాదుగాడు' వంటి సినిమాలు చేసినా.. అత‌ని ప్ర‌తిభ‌కి స‌రైన గుర్తింపు రాలేదు. ఇలాంటి స‌మ‌యంలో 'ఛ‌లో' రూపంలో వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నాడు. త‌న పాట‌ల‌తో, నేప‌థ్య సంగీతంలో ఆ సినిమా విజ‌యంలో భాగ‌స్వామ్యం వ‌హించాడు. ముఖ్యంగా 'చూసీ చూడంగానే' పాట‌తో సంగీత ప్రియుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నాడు.

ప్ర‌తిభ‌కి త‌గ్గ గుర్తింపు
'ఊహ‌లు గుస‌గుస‌లాడె' చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అయ్యింది ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా. ఆ సినిమా త‌రువాత 'జోరు, జిల్‌, బెంగాల్ టైగ‌ర్‌, శివ‌మ్‌, సుప్రీమ్‌,  హైప‌ర్‌, జై ల‌వ‌కుశ‌, ఆక్సిజ‌న్‌, ట‌చ్ చేసి చూడు' వంటి సినిమాలు చేసినా.. ఆ చిత్రాల‌న్నీ ఆమెను గ్లామ‌ర్ హీరోయిన్‌గానే ఎలివేట్ చేశాయి. అయితే ఈ నెల 10న విడుద‌లైన 'తొలిప్రేమ' చిత్రం ఆమెలో దాగిఉన్న మంచి న‌టిని ఆవిష్క‌రించింది. భావోద్వేగాల‌కు అవ‌కాశ‌మున్న వ‌ర్ష పాత్ర‌లో రాశి జీవించింద‌నే చెప్పాలి. ఈ ఒక్క‌ చిత్రంతో నాలుగేళ్ళుగా.. ఇంత‌కు ముందు చేసిన ప‌ది తెలుగు చిత్రాల‌తో రాని గుర్తింపు వ‌చ్చింది. 

ప్రేమ‌క‌థల‌కు సైతం..
త‌మ‌న్‌.. ఒక‌ప్పుడు ఈ పేరు వింటే బీట్ ఒరియెంటెడ్ సాంగ్స్ మాత్ర‌మే గుర్తొచ్చేవి. ఇప్పుడు.. ఆ లెక్క మారింది. కేవ‌లం మాస్ మూవీస్‌, హార‌ర్ చిత్రాలకే త‌ను ప‌రిమితం కాద‌ని.. స‌రైన అవ‌కాశం రావాలే కాని.. ప్రేమ‌క‌థా చిత్రాల‌కు త‌ను అద్భుత‌మైన స్వ‌రాలు ఇవ్వ‌గ‌ల‌న‌ని నిరూపించుకున్నాడు త‌మ‌న్‌. 'తొలిప్రేమ' చిత్రం.. ఇందుకు వేదిక‌గా నిలిచింది. ఇందులోని 'నిన్నిలా నిన్నిలా', 'తొలిప్రేమ టైటిల్ సాంగ్‌', 'అల్ల‌సాని' అనే మెలోడీ గీతాలు త‌మ‌న్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి.

ఇలా.. ఏడు వారాల కాలంలో 8 మంది ప్ర‌తిభావంతుల‌కు క‌లిసొచ్చిన 2018.. పూర్తి సంవ‌త్సరంలో ఇంకెంత‌మందికి నెగెటివ్ సెంటిమెంట్స్‌కు బ్రేక్ వేస్తుందో,  అలాగే స‌రైన బ్రేక్ లేనివారికి ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలుస్తుందో చూడాలి.  

English Title
special article about 2018 first 7 weeks
Related News