‘అంత్యేష్టి - అపరమ్’ విశిష్టత

Updated By ManamFri, 09/07/2018 - 07:50
Anteysti

Anteystiభారత హైందవ సమాజానికి షోడశసంస్కారములు ప్రధానమైనవి. ఈ సంస్కార క్రియాకలాపములు శ్రుత్యుపనిషత్తులలోగల మంత్రములలో కొన్నింటిని సందర్భోచితముగా గ్రహించి సుస్వరముగా పఠించుచూ నిర్వహింపబడుచున్నవి. పదహారు సంస్కారములలో చివరిది అంత్యేష్టి. మరణానంతరం వ్యక్తికి జరిపే కర్మకాండ. ఇది దహనానంతరం లేదా ఖననానంతరం జరుపబడుతుంది. దేశకాలములను బట్టి ఆనవాయితీగా వస్తున్న ఆచార వ్యవహారములను బట్టి, మత విశ్వాసములను బట్టి మరణించిన వ్యక్తిని దహనము చేయడమో, ఖననము చేయడమో జరుగుతుంది. ఆనాటి నుండి చనిపోయిన వ్యక్తికి సద్గతులు కలుగుటకు, స్వర్గప్రాప్తి కొరకు అపర కర్మలు శ్రుతి స్మృతి విధానములలో పురోహిత బ్రాహ్మణులచే జరుపబడును. మరణించిన వ్యక్తికి దహన కార్యక్రమమలను తంత్ర సహితముగా మంత్రయుక్తముగా అధ్వర్యులచే జరుపుటకు - విశ్వబ్రాహ్మణులకు చక్కని ప్రణాళికతో సిద్ధపరచబడిన గ్రంధము లేనందున - మహబూబాబాదు జిల్లా తొర్రూరు గ్రామస్థులైన, బహుసంవత్సర ప్రసిద్ధ బోధనాకుశలురైన సంస్కృతాంధ్రాది భాషాప్రౌఢివుగల బ్రహ్మశ్రీ తుమ్మనెపల్లి సింగయాచార్యులు అధ్యాపన సారాన్ని తమ ప్రియ శిష్యులైన, మానుకోట జిల్లా తొర్రూరు మండలం వెలికట్టె గ్రామ నివాసులైన బ్రహ్మశ్రీ తాడూరు లక్ష్మణాచార్యులుచే కూర్పు చేయబడిన గ్రంథం ‘అంత్యేష్టి - అపరమ్’ ఈ సాంప్రదాయక గ్రంథం విశ్వబ్రాహ్మ ణ పురోహితులకు కరదీపికగా విలసిల్లుచున్నది. 

ఈ గ్రంథం యాజుషాపరప్రయోగం. యజుర్వేదానికి సంబంధించిన అపరప్రయోగం. ఈ కర్మకాండలోని మంత్రభాగమంతా ఋషిప్రోక్తమే. అవి వేదోపనిషత్తుల నుంచి లేదా ఆగమముల నుంచి ఉద్ధరింపబడినవి. ఏమంత్రం ఏప్రయోగ సందర్భంలో ఉపయోగిస్తే అర్థవంతముగా నుండునో ఆలోచించి ఆయా మంత్రములను క్రమముగా కూర్చి ప్రయోగసమయంలో తంతునంతా జరిపి అపరకర్మను పరిపూర్ణముగా పురోహితబ్రహ్మలు నిర్వహించుదురు. అనంతమైన అనుభవంగల బ్రహ్మశ్రీ తుమ్మనెపల్లి సింగయాచార్యుల వారి బోధనాకృషికి, చక్కని అభినివేశము
 గల ప్రియశిష్యులు బ్రహ్మశ్రీ తాడూరు లక్ష్మణాచార్యులు సద్గ్రంధ సంకలనమును ప్రసిద్ధపరచి గురుశిష్యులిద్దరూ యశఃకాయలైనారు. 
ఇతఃపూర్వము అపరకర్మసంబంధమైన సంపూర్ణ గ్రంథము లేనందున ఆ కొరతను పూరించుటకు అంత్యేష్టి - అపరమ్ అవతరించి విశ్వబ్రాహ్మణవర్గమును తరింపజేయచున్నది. మృతులైన పిత్రాదులనుద్దేశించి శాస్త్రోక్తమైన కాలమందును, దేశమందును పక్వాన్నముగాని, యామాన్నముగాని హిరణ్యముగాని విధిప్రకారము బ్రాహ్మణులకు దాన ము చేయుట శ్రాద్ధమనబడును. అందు అగ్నౌకరణము, 2. పిండప్రదానం, 3. బ్రాహ్మణభోజనం ప్రధానములు. 
హోమశ్చపిండదానంచ తధా బ్రాహ్మణభోజనమ్,
శ్రాద్ధ శ్రద్ధాభిధేయం స్యాదేకస్మినౌపచారికమ్॥
యజోషాపిండదానంతు బహ్వృచానాం ద్విజార్చనం
శ్రాద్ధ శ్రద్ధాభిధేయం స్వాదుభయం సామవేదినాం॥
అంటే బ్రాహ్మణార్చనము ఋగ్వేదులకు, పిండదానము యజుర్వేదులకు, సామవేదులకు ప్రధానములు.

శ్రాద్ధము నాలుగు విధములు.
1. పార్వణ శ్రాద్ధము  2. ఏకోద్దిష్ట శ్రాద్ధము 3. నాందీ శ్రాద్ధము  4. సపిండీకరణ శ్రాద్ధము.
తండ్రి, తాత, ముత్తాత వీరినుద్దేశించి, వసురుద్రాదిత్య రూపములచే ధ్యానించి, పిండత్రయమిచ్చుశ్రాద్ధము పార్వణశ్రాద్ధము.
2. ఒకరినుద్దేశించి ఒక్క పిండవేుయిచ్చునది  ఏకోద్దిష్ట మనబడును. ఏకోద్దిష్టము వసురూపముననే యని తెలియవలెను.
మృతునికి మృతదినము మొదలుకొని దశాహపర్యంతము జేయనవి నవాహ్నిక శ్రాద్ధములు.
అకృత్వాతు నవశ్రాద్ధం ప్రేతత్వాస్తేవముచ్యతే, నవశ్రాద్ధం త్రిపక్షం చ షణ్మాసిక మాసికానిచ నకరోతిసుతోయస్తు తస్యాధః వితరోగతాః
అనగా నవశ్రాద్ధములు చేయనియెుడల ప్రేతత్వము వదలదనియు, నవశ్రాద్ధము, త్రైపక్షికము, నూనషాణ్మానికము, మాసికములు చేయనిచో అతని పిత్రాదులు అధోగతినందుదురు. పదునొకండవ దినమందలి శ్రాద్ధము మొదలుగ నూనాబ్దికము పర్యంతమైన శ్రాద్ధములు నవమిశ్రములు.
3. పుత్రజన్మయందును, పుత్రవివాహమందును జేయు వృద్ధిశ్రాద్ధము నాందీశ్రాద్ధము. 
4. మృతునికి పండ్రెండవ దినము మొదలగు కాలమున పిండమును అర్ఘ్యమును మొదలగునవి విశ్వేదేవతలతో కలుపుట సపిండీకరణమనబడును. 
‘అంత్యేష్టి-అపరమ్’లో కర్మను ప్రారంభిం చుట మొదలుకొని శ్మశానక్రియ, అస్థిసంచయనం అగ్నిప్రతిష్ఠ, ఆనందహోమం, పుణ్యాహవాచనంతో దశదినకర్మ పూర్తియగును. నగ్నపిండప్రదానము, నవాహ్నికశ్రాద్ధం, వృషోత్సర్జనం, ఏకోద్దిష్ట శ్రాద్ధ ప్రయోగం, పిండప్రదానం, మండలపూజ, ప్రేత ధారాదత్తం, షోడశపిండప్రదానంతో ఏకాదశదినకర్మ పూర్తియగును. మండల త్రయార్చనం, శ్రాద్ధకర్మ, అగ్నౌకరణం, విశ్వదేవోవస్థానం, ప్రాణాహుతులు, తిలతర్పణవిధి, పిండసంయోజన సంకల్పం, వైతరణీ గోదానంతో ద్వాదశదినకర్మ పూర్తియగును. అవుదానం, ఔపాసనాగ్ని ఉద్వాసన, కాలకావుసంజ్ఞికులకు పూజ, మహదాశీర్వచనంతో స్వర్గపాధేయం యనుత్రయోదశదినకర్మ పూర్తికావింపబడును. 
స్త్రీ పురుష వ్యక్తులకు అన్వయించుటకు వీలుగా గ్రంథం తీర్చిదిద్దబడినది. ప్రతి విశ్వబ్రాహ్మణ పురోహితుని వద్ద ఉండవలసిన గ్రంథము. 
మహాప్రస్థానంలో సాగి రాలిపోయే విశ్వబ్రాహ్మణ స్త్రీపురుషులకు సద్గతులు కలుగుటకు, స్వర్గనివాసప్రాప్తికి ఔరసులచే వైదిక విధితో అపరకర్మలు చేయించి మృతులను తరింపజేయటకు వారసులను ధన్యులుగా చేయటకు విశ్వబ్రాహ్మణ పురోహితులు తంత్రసహితముగా, సుస్వరమంత్రోచ్చారణతో ప్రయత్నించి చరితార్థులు కాగలరని ఆశించనైనది. 
పుస్తక ప్రాప్తిస్థానం : అంత్యేష్టి - అపరమ్ బ్రహ్మశ్రీ ఎఱ్ఱోజు లక్ష్మణాచార్యులు ఎంఒఎల్ ప్రధానకార్యదర్శి - విజ్ఞానాశ్రమం.
ఇంటినెం. 6-1-109/16 బి2, బ్యాంకు కాలనీ రోడ్డు, మహబూబాబాదు, తెలంగాణ. 
వెల రూ.150/-   
99594 28745.
బ్రహ్మశ్రీ తాడూరు మోహనాచార్యులు

English Title
Specialty of 'Anthishek - Aapram'
Related News