శ్రీసిటీకి ఆసియా మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్ అవార్డు

Updated By ManamSun, 03/11/2018 - 23:49
sri-city

sri-cityసింగపూర్: అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక నగరంగా గుర్తింపు పొందిన చిత్తూరు జిల్లా శ్రీసిటీ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్న శ్రీసిటీ ఖాతాలో మరో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు చేరాయి. 2017-18 ఏడాదికి గానూ ఆసియా మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్ అవార్డుతోపాటు, దేశంలో 50లోపు బెస్ట్ సీఎఫ్‌వో అవార్డులను సొంతం చేసుకుంది. సింగపూర్‌లోని రిట్జ్ కార్ల్‌టన్‌లో వైట్ పేజ్ ఇంటర్నేషనల్, యూకే ఏసియన్ బిజినెస్ కౌన్సిల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేశారు. గతేడాదిగా ఆసియాలోని వివిధ దేశాల నుంచి ఉత్తమ సేవలు (సర్వీసు), ఆర్థికవృద్ధి కనబరిచిన 100 ప్రశంసాత్మక సంస్థలను ఈ అవార్డుల్లో పరిగణనలోకి తీసుకున్నాయి. సత్యవేడులోని శ్రీసిటీ తరఫున సీఎఫ్‌వో ఆర్.నాగరాజన్ ఈ అవార్డులను స్వీకరించారు. ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కడంపై శ్రీసిటీ వ్యవస్థాపక సంచాలకులు రవీంద్ర సన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమను ఈ అంతర్జాతీయ అవార్డులకు ఎంపిక చేసినందుకు గర్వంగా ఉందని, వైట్ పేజ్ ఇంటర్నేషనల్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే ఇలాంటి వేదికల ద్వారా పారిశ్రామిక విజయాలు సాధించిన ప్రతి ఒక్కరిని కలుసుకుని, వారి విజయగాథలను తెలుసుకునే అవకాశం ఉంటుందని సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. వీటిని పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ సాగిస్తోన్న విజయ ప్రస్థానానికి దక్కిన గుర్తింపుగా అభివర్ణించారు. ఈ అవార్డుల కార్యక్రమంలో వివిధ సంస్థలకు చెందిన 250 మంది సీఈఓలు, ఆసియా వ్యాపారవేత్తలు, వీఐపీలు, మార్కెటింగ్, యాడ్ విభాగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.

Tags
English Title
Sreesitka is Asia's Most Outstanding Brand Award
Related News