శ్రీవారి సేవా టికెట్ల కుంభకోణం

Updated By ManamSat, 08/18/2018 - 00:13
tirumala
  • నకిలీ ఆధార్‌తో సుప్రభాత సేవ టికెట్ల విక్రయం

  • నిఘాకు చిక్కిన దళారి ప్రభాకర్

tirumalaతిరుమల: తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం టికెట్లను వ్యాపార వస్తువుగా చేసుకున్న ఓ వ్యక్తి గుట్టురట్టయ్యింది. శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల అమ్మకాల్లో అక్రమాల నియంత్రణకు టీటీడీ ఆధార్‌ను తప్పనిసరి చేసింది. అయితే మహారాష్ట్రలో షోలాపూర్‌కు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి టీటీడీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి దేవస్థానం లక్కీడిప్‌లో అందించే టికెట్లను పొందేవాడు. వాటిని అధిక ధరకు ఇతరులకు విక్రయించేవాడు. ఇదే విధంగా సుప్రభాత సేవకు సంబంధించిన నాలుగు టికెట్లను కొనుగోలు చేసిన ప్రభాకర్ మహారాష్ట్రకు చెందిన భక్తులకు వాటిని విక్రయించాడు. లక్కీడిప్ ద్వారా టీటీడీ అందించే టికెట్లలో అక్రమాలు జరుగుతున్నాయని డయల్ యువర్ ఈవో కార్యక్రమాలు గతంలో పలు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులు అందుకున్న టీటీడీ అధికారులు ఈ వ్యవహారంపై నిఘా ఉంచారు. శుక్రవారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొంటున్న భక్తుల టికెట్లను సిబ్బంది తనిఖీ చేయగా అక్రమం వెలుగు చూసింది. షోలాపూర్‌కు చెందిన నాగేష్ జనార్ధన్ గుప్తా, అతని భార్య వనిత, విజయ్‌కుమార్, బసవరాజు, రామచంద్ర చౌగులేల ఆధార్ కార్డులను పరిశీలించగా అందులో ఉన్న పేర్లు, టికెట్‌పై ఉన్న పేర్లకు పొంతన లేదు. టీటీడీ సిబ్బంది వారిని ప్రశ్నించగా తమ ప్రాంతానికి చెందిన ప్రభాకర్ వద్ద అధిక ధర చెల్లించి టికెట్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ వారు లక్కీ డిప్‌లో కేటాయించే టికెట్లలో ప్రభాకర్ ఇప్పటివరకు వందకు పైగా పొందినట్లు విచారణలో తేలింది. 

English Title
Sriwari Seva ticket scandal
Related News