తడబడి.. ఆనక నిలబడి

Virat Kohli
  •  కోహ్లీ, రహానే అర్ధ సెంచరీలు

  • ఆస్ట్రేలియా 326 ఆలౌట్ 

  • తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 172/3

  • రెండో టెస్టు మ్యాచ్

పెర్త్: విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే అర్ధ సెంచరీలు చేయడంతో ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కష్టాల నుంచి కోలుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కోహ్లీ (82), రహానే (51) క్రీజులో ఉన్నారు. అంతకుముందు మార్నింగ్ సెషన్‌లో ఆస్ట్రేలియా 326 పరుగులకు ఆలౌటైంది. ఇషాంత్ శర్మకు నాలుగు వికెట్లు దక్కాయి. నాలుగో ఇన్నింగ్స్ ఆడటం అంత సులభం కాదు. కాబట్టి తొలి ఇన్నింగ్స్ చాలా ముఖ్యం. కనుక తొలి ఇన్నింగ్స్‌లో బాగా ఆడాలి. కానీ టీమిండియా ఓపెనర్లిద్దరూ మురళీ విజయ్, కేఎల్ రాహుల్ విఫలమయ్యారు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో విజయ్ పరుగుల ఖాతా ప్రారంభించకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. డిఫెన్స్ ఆడాల్సిన బంతిని పుష్ చేయబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక రాహుల్ భోజన విరామం తర్వాత హాజిల్‌వుడ్ వేసిన యార్కర్‌కు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇటువంటి సమయంలో టీమిండియా ఎదురుదాడికైనా దిగాలి లేదా రక్షణాత్మక ధోరణిలోనైనా ఆడాలి. అయితే కోహ్లీ, చటేశ్వర్ పుజారా రెండు విధాలుగా ఆడారు. కోహ్లీ వేగంగా పరుగులు సాధించాడు. హాజిల్‌వుడ్ వేసిన ఒకే ఓవర్‌లో కోహ్లీ మూడు ఫోర్లు కొట్టాడు. మరోవైపు పుజారా డిఫెన్స్ ఆడాడు. దీంతో కోహ్లీ 10 బంతుల్లోనే 18 పరుగులు సాధించాడు. అయితే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్‌కు దిగగానే కోహ్లీ దూకుడు తగ్గించాడు. లియాన్ ఎప్పటిలాగే కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి పరుగుల వరదను అడ్డుకున్నాడు. దీంతో మరో ఎండ్ నుంచి పేస్ బౌలర్లు దాడికి దిగారు. ఒకానొక దశలో టీమిండియా 20 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే చేసింది. వరుసగా 22 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. అవుట్‌సైడ్ ఆఫ్ స్టంప్ మీదుగా వెళుతున్న బంతులకు కూడా కోహ్లీ వదల్లేదు. మరోవైపు పుజారా కూడా సమర్థవంతంగా ఆడాడు. దీంతో టీ విరామం వరకు ఎటువంటి నష్టమూ జరగలేదు. 

అయితే టీ విరామం తర్వాత పుజారా అవుటయ్యాడు. మిచెల్ స్టార్క్ వేసిన బంతికి పుజారా వికెట్ కీపర్ టిమ్ పెయిన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 74 పరుగులు భాగస్వామ్యానికి తెర పడింది. కోహ్లీ, పుజారా కలిసి 33 ఓవర్లు ఆడారు. 82 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. తర్వాత రహానే రావడంతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. ఇండియా ఇన్నింగ్స్‌కు జీవం వచ్చినట్టయింది. రహనే వచ్చీరాగానే పేస్ బౌలింగ్‌లో పుల్ షాట్స్, అప్పర్ కట్స్ ఆడుతూ బంతిని బౌండరీకి తరలించాడు. అంతేకాదు స్టార్క్ బౌలింగ్‌లో రహనే థర్డ్ మాన్ బౌండరీ మీదుగా సిక్స్ కొట్టాడు. అయితే అదృష్టవశాత్తు రహానే అనేకసార్లు వైడ్ బాల్స్ ఆడినప్పటికీ బంతి అతని బ్యాట్ అంచును తాకలేదు. రహానే తొలి 22 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. ఆ తర్వాత క్రీజు వద్ద నిలదొక్కుకున్నాడు. తర్వాత కోహ్లీ రహానే జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందకు కదిలించారు. అయితే కమ్మిన్స్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టడంతో కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మరి కాసేపటికే రహానే కూడా అర్ధ సెంచరీ సాధించాడు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో రహానే రెండు చూడ చక్కని షాట్లు ఆడాడు. తొలుత స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. దీంతో హాజిల్‌వుడ్ షార్ట్ పిచ్ బాల్ వేశాడు. దాన్ని కూడా రహానే అప్పర్ కట్ ద్వారా బౌండరీకి తరలించాడు. కెప్టెన్, వైస్ కెప్టెన్ చివరి వరకు ఆడారు. అంతకుముందు 6 వికెట్ల నష్టానికి 277 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 326 పరుగులకు ఆలౌటైంది. టిమ్ పెయిన్, పాట్ కమ్మిన్స్ టీమిండియాను టెన్షన్ పెట్టారు. వీరిద్దరు గంట సేపు ఆడారు. కొన్ని కారణాల వల్ల రెండో రోజు జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేయలేకపోయాడు. ఆస్ట్రేలియా 310 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఉమేష్ యాదవ్ ఈ జంటను విడదీశాడు. ఉమేష్ బౌలింగ్‌లో కమ్మిన్స్ క్లీన్ బౌల్డ్ కావడంతో 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రెండు బంతుల అనంతరం బుమ్రా బౌలింగ్‌లో పెయిన్ ఎల్‌బిడబ్ల్యూగా అవుటయ్యాడు. చివరి రెండు వికెట్లను ఇషాంత్ శర్మ పడగొట్టడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. ఇషాంత్‌కు మొత్తం నాలుగు వికెట్లు లభించినట్టయింది. 

స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 277/3): టిమ్ పెయిన్ ఎల్‌బిడబ్ల్యూ (బి) బుమ్రా 38, కమ్మిన్స్ (బి) ఉమేష్ యాదవ్ 19, స్టార్క్ (సి) పంత్ (బి) ఇషాంత్ 6, లియాన్ నాటౌట్ 9, హాజిల్‌వుడ్ (సి) పంత్ (బి) ఇషాంత్ 0; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం 108.3 ఓవర్లలో 328 ఆలౌట్; వికెట్ల పతనం: 7-310, 8-310, 9-326, 10-326; 
బౌలింగ్:  ఇషాంత్: 20.3-7-41-1, బుమ్రా: 26-8-53-2, 
ఉమేష్: 23-3-78-2, షమీ: 24-3-80-0, విహారి: 14-1-53-2, విజయ్: 1-0-10-0.
ఇండియా తొలి ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (బి) హాజిల్‌వుడ్ 2, మురళీ విజయ్ (బి) స్టార్క్ 9, పుజారా (సి) పెయిన్ (బి) స్టార్క్ 24, కోహ్లీ నాటౌట్ 82, రహానే నాటౌట్ 51; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం 69 ఓవర్లలో 172/3; వికెట్ల పతనం: 1-6, 2-8, 3-82; బౌలింగ్: స్టార్క్: 14-4-42-2, హాజిల్‌వుడ్: 16-7-50-1, కమ్మిన్స్: 17-3-40-0, లియాన్: 22-4-34-0.

సంబంధిత వార్తలు