క‌లిసొచ్చిన మాసంలో అగ్ర‌ తార‌ల సంద‌డి

Updated By ManamFri, 03/30/2018 - 21:54
nagarjuna

nagవేస‌వి.. సినిమా ప్రియుల‌కు మంచి వినోదాన్ని ఇచ్చే చ‌క్క‌ని  వేదిక‌. ఈ సీజ‌న్‌లో వ‌చ్చే సినిమాల‌కు చాలా వ‌ర‌కు మంచి ఆద‌ర‌ణే ఉంటుంది. కంటెంట్ బాగుంటే చాలు.. స‌మ్మ‌ర్‌లో యావ‌రేజ్ మూవీ కూడా సూప‌ర్ హిట్ అయిపోతుంది. ఈ క్ర‌మంలోనే.. ఈ ఏడాది వేస‌విలో కూడా చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయి. ఇప్ప‌టికే ఆయా చిత్రాల నిర్మాత‌లు విడుద‌ల తేదీల‌ను కూడా ప్ర‌క‌టించేశారు. చివ‌రి నిమిషంలో జ‌రిగే మార్పుల‌ను మిన‌హాయిస్తే.. వేస‌వి వినోదానికి ఢోకా లేన‌ట్టే. ఎప్ప‌టి లాగే ఈ ఏడాది వేస‌వికి కూడా అగ్ర క‌థానాయ‌కుల సినిమాల‌తో పాటు యువ క‌థానాయ‌కుల సినిమాలు కూడా తెర‌పైకి రానున్నాయి.  వీరిలో కొంత‌మందికి ఈ సీజ‌న్  ఇప్ప‌టికే బాగా అచ్చొచ్చింది. మ‌రోసారి కూడా అది పున‌రావృతం చేస్తారో లేదో చూడాలి. ఓ సారి ఆ హీరోలు, చిత్రాల వైపు దృష్టి సారిస్తే..

నాగార్జున‌
nagసీనియ‌ర్ క‌థానాయ‌కుడు నాగార్జున‌కి.. వేస‌వికి మంచి అనుబంధ‌మే ఉంది. ఎందుకంటే.. క‌థానాయ‌కుడిగా నాగ్ తొలి అడుగులు ప‌డింది ఈ సీజ‌న్‌లోనే మ‌రి. ఈ అక్కినేని హీరో న‌టించిన తొలి చిత్రం 'విక్ర‌మ్‌'.. మే 23న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద విజేత‌గా నిలిచింది. క‌ట్ చేస్తే.. 32 ఏళ్ళ క్రితం మొద‌లైన ఈ వేస‌వి ప్ర‌యాణాన్ని ఏవో అతి త‌క్కువ సంద‌ర్భాల్లో మిన‌హాయిస్తే.. ప్ర‌తి ఏడాది కూడా నాగ్‌ కొన‌సాగిస్తూనే ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా త‌న మొద‌టి సినిమా విడుద‌లైన మే నెల‌లోనే  'గీతాంజ‌లి, అన్న‌మ‌య్య‌, మ‌నం' వంటి మైలురాళ్ళు కూడా నాగ్ ఖాతాలో ఉండ‌డం విశేషం. వీటితో పాటు.. 'చిన‌బాబు, వార‌సుడు, సంతోషం' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలు కూడా ఈ నెల‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రాల జాబితాలో చేరేందుకు మ‌రో సినిమా రాబోతోంది. అదే 'ఆఫీస‌ర్‌'. నాగ్‌తో 'శివ' వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీని తెర‌కెక్కించిన సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ముంబ‌యి నేప‌థ్యంలో సాగే ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను మే 25న విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రి.. క‌లిసొచ్చిన నెల‌లో మ‌రోసారి వ‌స్తున్న నాగ్‌కు ఈ చిత్రం మ‌రో మెమ‌ర‌బుల్  మూవీ అవుతుందేమో చూడాలి.

మ‌హేశ్ బాబు
mahesh babuమ‌హేశ్ బాబు కెరీర్‌ను మ‌లుపు తిప్పిన చిత్రాల‌లో 'పోకిరి'ది ప్ర‌త్యేక స్థానం. సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ చిత్రం త‌రువాతే మ‌హేశ్ సూప‌ర్ స్టార్ అయిపోయారు.  'పోకిరి'కి ముందు.. 'పోకిరి'కి త‌రువాత అన్నంత‌గా మ‌హేశ్ కెరీర్‌పై ప్ర‌భావం చూపించిన సినిమా ఇది. అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. వేస‌వి స‌మ‌యంలో సంద‌డి చేసింది. స‌రిగ్గా.. 'పోకిరి' విడుద‌లైన అదే ఏప్రిల్ నెల‌లో 12 ఏళ్ళ త‌రువాత త‌న తాజా చిత్రం 'భ‌ర‌త్ అనే నేను'తో అభిమానుల ముందుకు రానున్నారు మ‌హేశ్‌. 'శ్రీ‌మంతుడు' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ న‌టిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20న తెర‌పైకి రానుంది. మ‌రి 'పోకిరి' లాంటి సంచ‌ల‌న విజ‌యాన్ని ఈ చిత్రం కూడా మ‌హేశ్‌కు అందిస్తుందో లేదో చూడాలి.

అల్లు అర్జున్‌
bunnyనాగ్ లాగే అల్లు అర్జున్ కెరీర్ కూడా వేస‌విలోనే ప్రారంభ‌మైంది. ఆయ‌న తొలి చిత్రం 'గంగోత్రి'.. కెరీర్‌ను మ‌లుపు తిప్పిన 'ఆర్య' కూడా ఈ సీజ‌న్‌లోనే ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. వీటితో పాటు 'బ‌న్ని, ప‌రుగు, రేసు గుర్రం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, స‌రైనోడు' కూడా వేస‌విలోనే సంద‌డి చేశాయి. ఇప్పుడు ఇదే సీజ‌న్‌లో త‌న కొత్త చిత్రం 'నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా'తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు బ‌న్ని. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా మే 4న విడుద‌ల కానుంది. మే మొద‌టి వారంలో బ‌న్ని సినిమా విడుద‌లైతే.. విజ‌యం ఖాయ‌మ‌ని 'ఆర్య‌', 'పరుగు' చిత్రాలు నిరూపించాయి. మ‌రి 'నా పేరు సూర్య' విష‌యంలోనూ అది పున‌రావృతం అవుతుందేమో చూడాలి.  ఆర్మీ ఆఫీస‌ర్ పాత్ర కోసం బ‌న్ని త‌న‌ను తీర్చిదిద్దుకున్న తీరుకి అభిమానులు ఇప్ప‌టికే ఫిదా అయిపోయారు. 

నితిన్‌
nithinయువ క‌థానాయ‌కుడు నితిన్ 25 చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నారు.  విడుద‌ల‌కి సిద్ధ‌మైన 'ఛ‌ల్ మోహ‌న్ రంగ‌'తో ఈ అంకాన్ని పూర్తి చేస్తున్నారాయ‌న‌. త‌న అభిమాన క‌థానాయ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ సినిమా  ఏప్రిల్ 5న తెర‌పైకి రానుంది. విశేష‌మేమిటంటే.. ఏప్రిల్ నెల‌లో ఇదివ‌ర‌కు వ‌చ్చిన నితిన్ చిత్రాలు ('దిల్‌', 'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే') మంచి విజ‌యం సాధించాయి. మ‌రి.. ఆ ఫీట్ కొత్త చిత్రం కూడా రిపీట్ చేస్తుందేమో చూడాలి.

English Title
star heroes targets lucky months
Related News