స్టీఫెన్ హాకింగ్ పర్సనల్ లైఫ్...

Updated By ManamWed, 03/14/2018 - 12:09
stephen hawking file photo
stephen hawking file photo

విశ్వాంతరాలపై పరిశోధన చేసి ఆ విశ్వాంతరాల హృదయాల్లోకే వెళ్లిపోయారు స్టీఫెన్ హాకింగ్. 21 ఏళ్ల నూనూగు మీసాల ప్రాయంలోనే అమయోట్రోపిక్ లేటరల్ స్క్లీరోసిస్ (ఏఎల్ఎస్) అనే నరాల సంబంధిత మహమ్మారి బారిన ఆయన పడ్డారు. రెండేళ్లే బతుకుతారని డాక్లర్లు చెప్పారు. అయినా ఆయన ఆనాడు మృత్యువును జయించారు. నడవడం కష్టం.. నోట మాట రావడం కష్టం.. రాయడం కష్టం.. ఏ పనీ చేయలేరు. రానురానూ ఆ పరిస్థితి మరింత విషమించింది. ఒక్కొక్క కండరం ఆయన పట్టువీడింది. పూర్తిగా కుర్చీకే పరిమితం చేసింది. ఓ రకంగా ఆయన బతికున్నా ఓ జీవచ్ఛవమే. అయితే, చైర్ సాయంతోనే, దానికి అమర్చిన స్పీచ్ జనరేటింగ్ డివైస్‌తోనే తాను చెప్పాలనుకున్నది చెప్పారు. ఆ చైర్లో ఉండే ఎన్నెన్నో పరిశోధనలు చేశారు. కృష్ణబిలాల్లో దాగున్న మర్మాన్ని విడమరచి చెప్పారు. మరణం దాకా అడుగడునా భౌతిక శాస్త్ర రంగంలోని ఎనలేని సేవలు అందించారు. ఆయన గురించి కొన్ని జీవిత విశేషాలు...

స్టీఫెన్ హాకింగ్ హఠాన్మరణం... క్లిక్ చేయండి

ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో 1942 జనవరి 8న జన్మించారు. 
తండ్రి ఫ్రాంక్ డాక్టర్. తల్లి ఇసోబెల్ హాకింగ్ తత్వవేత్త, ఆర్థికవేత్త. ఆయన తల్లిదండ్రులది ప్రేమ వివాహం.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లండన్‌పై బాంబు దాడి జరిగిన సమయంలోనే కట్టుదిట్టమైన భద్రత నడుమ హాకింగ్ జన్మించారు. హాకింగ్‌కు సోదరి, ఇద్దరు సోదరులున్నారు.
ఆయన ప్రాథమిక విద్యాభ్యాసమంతా ఆక్స్‌ఫర్డ్‌లోని సెయింట్ ఆల్బన్స్ హై స్కూల్‌లోనే సాగింది. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో గణిత శాస్త్రం చదవాలనుకున్నా అది కుదరలేదు.
గణిత శాస్త్రంలో సరైన ఉద్యోగాలు ఉండవని భావించిన హాకింగ్ తండ్రి.. మెడిసిన్ చదవాల్సిందిగా సూచించారు. అయినా కూడా గణిత శాస్త్రంపైనే మక్కువ చూపించారు హాకింగ్.
అయితే, ఆ సమయంలో ఆక్స్‌ఫర్డ్‌లో గణితం చదవడం సాధ్యపడలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భౌతిక,రసాయన శాస్త్రాల్లో రాణించాలనుకుని డిసైడ్ ఆ దిశగా అడుగులు వేశారు. అక్కడ మూడేళ్ల పాటు చదివిన ఆయన వెయ్యి గంటలు స్టడీ అవర్స్‌కే కేటాయించారట. 
ఆక్స్‌ఫర్డ్‌లో చదివేటప్పుడే కేంబ్రిడ్జ్‌లో పీహెచ్‌డీ కోసం ఓ పరీక్ష రాశారు. అయితే, అందులో ఆయనకు అత్తెసరు మార్కులే వచ్చాయి. కేంబ్రిడ్జ్‌లో చదవాలంటే ఆ పరీక్షలో కనీసం ఫస్ట్ క్లాస్ రావాలి. కానీ, హాకింగ్‌కు మాత్రం ఫస్ట్ క్లాస్‌కు సెకండ్ క్లాస్‌కు మధ్యలో వచ్చాయి. దీంతో ఆయనకు వైవా తప్పనిసరి అయింది. 
ఆ వైవాలో ఆయన తన హాస్యచతురతను ప్రదర్శించారు. ‘‘మీరు నాకు ఫస్ట్ క్లాస్ ఇస్తే కేంబ్రిడ్జ్‌కు వెళతా. లేదంటే ఇక్కడే ఆక్స్‌ఫర్డ్‌లో ఉండిపోతా. కాబట్టి మీరు నాకు ఫస్ట్ క్లాస్ వేస్తారనే అనుకుంటున్నా’’ అంటూ వైవా అధ్యాపకులతో చమత్కారాన్ని చూపించారు. ఆ తర్వాత ఆయనకు ఫస్ట్ క్లాస్ వచ్చిందనుకోండి అది వేరే విషయం.
కేంబ్రిడ్జ్‌లో 1966 నుంచి 75 వరకు కాస్మాలజీలో పీహెచ్‌డీ చేశారు. కృష్ణ బిలాలు, గరుత్వాకర్షణ, బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతాలపై అనేకానేక పరిశోధనలు చేశారు. సారూప్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 
తన పరిశోధనలతో అనేకానేక అవార్డులు గెలుచుకున్నారు. 
కేంబ్రిడ్జిలో చదువుతున్న సమయంలో తన సోదరి స్నేహితురాలైన జేన్ వైల్డ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లిదాకా వెళ్లింది. నరాల వ్యాధి రాకముందే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత 1963లోనే ఆయనకు ఆ వ్యాధి సోకినా 1965 జూలై 14న వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారికి రాబర్ట్, లూసీ, తిమోతీ (ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె) జన్మించారు. 
1977లో ఓ చర్చిలో జొనాథన్ హెల్యర్ జోన్స్ అనే అవయవ రీప్లేస్‌మెంట్ స్పెషలిస్ట్‌ను హాకింగ్ భార్య జేన్ కలిశారు. అతడు ఆమె కుటుంబానికి దగ్గరవ్వడం, జేన్‌తో ఆ పరిచయం మరింత ముదిరి చాన్నాళ్ల పాటు అది అలాగే కొనసాగింది. అయితే, ఆమెకు హాకింగ్ ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. 
ఆ తర్వాత హాకింగ్‌కు చికిత్సనందించే వారి సంఖ్య మరింత పెరిగింది. హాకింగ్ ఇంటికి నర్సులు, డాక్టర్ల వెల్లువ పెరిగింది. అయితే, హాకింగ్‌కు సేవ చేస్తున్న ఎలైన్ మేసన్ అనే నర్సుతో ప్రేమ చిగురించింది. తనపై చూపిస్తున్న ఎనలేని ప్రేమ వల్ల ఆమెతోనే ఉండాలని నిర్ణయించుకున్న హాకింగ్ మొదటి భార్య జేన్‌కు ఉన్న విషయం చెప్పాడు. 1990లో ఆమెను ఇంటి వద్దే వదిలేసిన ఆయన.. 1995లో విడాకులు ఇచ్చేశారు. అదే ఏడాది సెప్టెంబరులో మేసన్‌ను పెళ్లి చేసుకున్నారు. 

English Title
Stephen Hawking personal life
Related News