విశాఖలో సబ్‌మెరైన్ మ్యూజియం

Updated By ManamSat, 08/25/2018 - 06:31
babu
  • నగరానికి ప్రత్యేక ఆకర్షణ కావాలి

  • వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందించండి

  • పర్యాటక ప్రాంతాల అభివృద్ధి: చంద్రబాబు

  • ప్రత్యేక తపాలా బిళ్లలు ఆవిష్కరించిన సీఎం

babuఅమరావతి: పారిస్‌కు ఈఫిల్ టవర్‌లా, ఆగ్రాకు తాజ్‌మహల్‌లా, విశాఖకు సబ్‌మైరెన్ మ్యూజియం ప్రత్యేక ఆకర్షణ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. శుక్రవారం తన కార్యాలయంలో టూరిజం ప్రమోషన్ బోర్డ్ సమావేశంలో పాల్గొన్నారు. విశాఖపట్నంలో సబ్‌మైరెన్ మ్యూజియం ఏర్పాటుపై ముఖ్యమంత్రి చర్చించారు. మాస్టర్ ప్లాన్ వెంటనే రూపొందించాలని ఆదేశించారు. అటు వినోదం ఇటు విజ్ఞానాభివృద్ధికి ఈ మ్యూజియం దోహదపడాలన్నారు. ఈ మ్యూజియం ద్వారా ప్రజల్లో ఆసక్తి పెంపుతో పాటు దేశభక్తి పెరుగుతుందని.. ప్రపంచ నౌకాబలం, భారత నౌకాబలం పరిణామక్రమం ఆసక్తికరం ఉంటుందన్నారు. అండర్ గ్రౌండ్ పార్కింగ్, మ్యూజియం భవనాల నిర్మాణంలో ఆధునికత ఉట్టిపడాలని సూచించారు. అదే విధంగా ఆతిథ్యం పర్యాటకానికి అతిముఖ్యమని సూచించారు. అతిథుల అభిమానం పొందడంలోనే పర్యాటకాభివృద్ధి సాధ్యమన్నారు. పర్యాటకుల సందర్శనపైనే మన శాఖ ఆధారపడి ఉందనేది గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా చింతపల్లి వద్ద స్కూబా డైవింగ్, విశాఖ, విజయనగరం జిల్లాలలో స్కై స్కూల్ యాక్టివిటీస్ ప్రోత్సహించాలన్నారు. కళింగపట్నం పర్యాటకాభివృద్ది చేయాలన్నారు. ప్రకాశం బ్యారేజి ఎగువన వైకుంఠపురం ఎత్తిపోతల పథకం, దిగువన చోడవరం ఎత్తిపోతల పథకం పూర్తయితే రాజధాని ప్రాంతంలో కృష్ణానది వాటర్ ఫ్రంట్ ఆసాంతం అద్భుతంగా ఉంటుందన్నారు. అదే తరహాలో ఉత్తరాంధ్రలో పురుషోత్తపట్నం ప్రాజెక్టు నుంచి 50 కి.మీ. వాటర్ ఫ్రంట్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నారు. కనిష్ఠ పెట్టుబడి, గరిష్ఠ భాగస్వామ్యం లక్ష్యంగా టూరిజం అభివృద్ధికి కషి చేయాలన్నారు. ‘‘అంతర్జాతీయ పర్యాటకులు ఆంధ్రప్రదేశ్ సందర్శనకు ఆసక్తి చూపేలా చర్యలు తీసుకోవాలి. పర్యాటకుల భద్రత, రక్షణ పకడ్బందీగా ఉండాలి. అక్కడక్కడ పర్యాటకులపై దాడులు, దొంగతనాల వంటి కథనాలు మీడియాలో చూస్తున్నాం. అటువంటి నేరాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలి. డ్రోన్ల ద్వారా ఆయా ప్రాంతాలలో నిఘా ముమ్మరం చేయాలి. కోటప్ప కొండ వద్ద పర్యాటకం బాగా అభివృద్ధి చేశారు, అలాగే యారాడ కొండలను కూడా మరింత సుందరంగా తీర్చిదిద్దాలి’’ అని చంద్రబాబు సూచించారు. విజన్ ఇస్తున్నా, పాలసీ ఇస్తున్నా, అయినా మందకొడిగా ఉండటం సరికాదని సీఎం హెచ్చరించారు. టూరిజం యాక్టివిటీస్ వేగవంతం చేయాలన్నారు. ఏపీ పర్యాటకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేశారు. రాష్ట్రంలో 12 పర్యాటక స్థలాలపై రూపొందించిన తపాలా బిళ్లలను విడుదల చేశారు. ఏపి పర్యాటకంలో తపాలా శాఖ భాగస్వామ్యం కావడం సంతోషంగా పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న ఏపీ పర్యాటకం నెం 1 స్థానానికి చేరాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి అఖిల ప్రియ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, హిమాంశు శుక్లా, పట్టణాభివద్ధి శాఖ కార్యదర్శి కరికాల వలవన్, సీఎంవో కార్యదర్శులు గిరిజా శంకర్, రాజమౌళి, జస్వంత్ కుమార్, విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

English Title
Submarine Museum in Visakhapatnam
Related News