వేసవి డిమాండ్.. విమానయానం మరింత చౌక

Updated By ManamSun, 04/15/2018 - 22:17
flight

imageన్యూఢిల్లీ: ఈ వేసవిలో విమాన ప్రయాణాలు చేయాలనుకునేవారికి శుభవార్త. దేశీ విమాన ప్రయాణాల్లో టిక్కెట్ ధరలు 4 నుంచి 9 శాతం వరకు తగ్గుతున్నాయి. యాత్ర, క్లియర్‌ట్రిప్, ఇగ్జిగో వంటి ట్రావెల్ వెబ్‌సైట్లలో విమాన టిక్కెట్ల డిమాండ్ 20 శాతం వరకు పెరగడంతో కిందటేడాదితో పోలిస్తే ధరలు తక్కువగానే ఉన్నాయి. యాత్ర.కామ్‌లో విమాన టిక్కెట్ల ధరలు కిందటేడాదితో పోలిస్తే 5 శాతం వరకు తగ్గాయి. అయితే ఢిల్లీ-ముంబై సెక్టార్‌లో మాత్రం 12 శాతం పెరిగాయి.
ఇక ట్రావెల్ పోర్టల్ ఇగ్జిగో కిందటేడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య వివరాలను బట్టి చూస్తే.. ఈ ఏడాది సగటున దేశీ విమానయాన టిక్కెట్ ధరలు 9 శాతం తగ్గాయి. ఇక అంతర్జాతీయ ధరలు సగటున 19 శాతం తగ్గాయి. ఎయిర్‌లైన్స్ సంస్థలు విమానాల సంఖ్యను పెంచడం, కంపెనీల మధ్య పోటీ కూడా ధరల తగ్గుదలకు కారణమని యాత్ర.కామ్ సీఓఓ శరత్ ధాల్ వెల్లడించారు. దీనికి తోడు ఆయిల్ ధరలు తగ్గుతుండటం, ఉత్పాదక ఖర్చులు తక్కువగా ఉండటంతో విమాన టిక్కెట్ల ధరలు తగ్గుతున్నాయని చెప్పారు.
గడిచిన రెండేళ్లలో విమాన టిక్కెట్ల ధరలు పెరగలేదని ధాల్ స్పష్టం చేశారు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎయిర్‌లైన్స్ సంస్థలు డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయన్నారు. స్పైస్ జెట్, గోఎయిర్, ఎయిర్ ఏసియా ఇండియా సంస్థలు రూ.1,600 అంతకంటే తక్కువ ధరకే విమాన టిక్కెట్లు అందిస్తున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్, నాగ్‌పూర్, చెన్నై, గౌహతి, ఇంపాల్, పుణే, భువనేశ్వర్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లే విమానాల్లో తక్కువ ధరకే టిక్కెట్లను అందిస్తున్నాయి.
ఈ ఏడాది మే నెలలో విమాన టిక్కెట్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ట్రావెల్ ఆపరేటర్ గూమో బిజినెస్ హెడ్ జయం తి దాస్ గుప్తా వెల్లడించారు. ముందస్తుగా విమాన టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి అదనంగా 20 శాతం డిస్కౌంట్ కూడా అందజేస్తు న్నామని చెప్పారు. ఈ ఏడాది ప్రయాణికుల నుంచి డిమాండ్ 20శాతం పెరుగుతుందని, దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు డిస్కౌంట్లు కూడా ప్రకటిస్తాయని జయంతి తెలిపారు.

English Title
summer demand..low price
Related News