మహోన్నత లక్ష్యానికి తూట్లు..

Updated By ManamSat, 07/28/2018 - 01:18
ts farmers
  • రైతులందరినీ కలవని ఏఈఓలు..రైతు బంధు బీమా పట్ల నిర్లక్ష్యం..

  • పత్రాల కోసం రైతుల ఎదురుచూపులు.. వలసపోయిన వారి సంగతి అంతే..

  • ఇప్పటికే హెచ్చరించిన సీఎం కేసీఆర్

imageహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా రైతు జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. మహోన్నత లక్ష్యంతో ప్రారంభించిన పథకం కాస్త.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోతోంది. రైతు ఏ కారణంతో మరణించినా.. రూ.5లక్షల బీమా కల్పిస్తూ ప్రపంచంలోనే తొలిసారిగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతు బంధు పథకాన్ని విజయవంతం చేసిన మాదిరిగానే రైతు బంధు బీమాను విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం పిలుపునిచ్చారు. ఆగస్టు ఒకటో తేదీ నాటికి బీమా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు బంధు పథకం అమలు స్ఫూర్తితో రైతు బంధు బీమా అదే స్థాయిలో కొనసాగుతుందని రైతులందరూ ఆశించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా సర్వే ప్రక్రియ నడుస్తోంది.

రాష్ట్రంలో రైతు బీమా సర్వే పరిస్థితి ఇదీ..
రాష్ట్రంలో 18 ఏండ్ల వయస్సు నుంచి 60 ఏండ్ల వయస్సు కలిగిన రైతులందరికీ రైతు బీమాను చేయించాలని సీఎం భావించారు. అందుకు తగిన విధంగా ఎల్‌ఐసీతో ఇప్పటికే ఒప్పందం కుదిరింది. రైతు బీమాలో చేరిన రైతు మరణిస్తే.. నామినీగా ఉన్న వారికి పది రోజుల్లో రూ.5లక్షలు అందనున్నాయి. ఆగస్టు 15 నుంచి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రైతు బంధు పథకం వివరాల  ప్రకారం రాష్ట్రంలో 57 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈనెల 25 వరకు 38.05 లక్షల మంది రైతులను వ్యవసాయ విస్తరణ అధికారులు కలిశారు. అయితే వీరిలో దాదాపు 28 లక్షల మంది రైతులు రైతు జీవిత బీమాకు అర్హులుగా తేలగా, 9 లక్షల పైచిలుకు రైతులు వయస్సు కారణంగా అనర్హులయ్యారు. రైతు బీమా సర్వే పూర్తయ్యేసరికి 15 లక్షల మంది రైతులు అనర్హులుగా తేలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నా రు.

ఇంటింటికీ వెళ్లని ఏఈఓలు
ఏఈఓలు రైతుల ఇంటింటికీ తిరిగి రైతు బంధు బీమా వివరా లను సేకరించాలని, బీమా ఆవశ్యకత వంటి వివరాలను రైతులకు వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్‌నూ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులందరినీ వ్యవ సాయ అధికారులు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించాల్సి ఉంది. కానీ వ్యవసాయా ధికారులు ఎక్కడా రైతు ఇంటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్న దాఖాలాల్లేవు. చాలాచోట్ల గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్దో.. ప్రధాన కూడలిలోనో.. కూర్చోని.. అక్కడికి వచ్చిన రైతుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. అంతుకు ముందు రోజు రైతులందరూ నిర్ధేశిత ప్రాంతానికి రావాలని డప్పు చాటింపు వేయిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో రైతు కుటుంబాలన్నీ నిమగ్నమై ఉన్నాయి. దీంతో రైతులు రైతు బీమా కోసం పని మానుకుని ఏఈఓలు చెప్పిన ప్రదేశానికి వెళ్లడం లేదు. కొన్నిచోట్ల గ్రామాల్లోని యువకులకు బీమా పత్రాలను అప్పగించి.. రైతుల నుంచి వివరాలు తీసుకుని నింపాలని పురమా యిస్తున్నాయి. ఈ క్రమంలో రైతులకు రైతు జీవిత బీమా అనేది తెలియడం లేదు. దీంతో ఇటీవల సీఎం కేసీఆర్ సైతం సర్వే జరుగుతున్న తీరుపట్ల అధికారులపై మండిపడ్డారు. అయినా నేటికీ అధికారుల తీరులో మార్పు రావడం లేదు. ఇదిలావుంటే.. ఇతర ప్రాంతాలకు వలసెళ్లిన రైతులు, వేరే ప్రాంతాలకు వెళ్లిన రైతులకు రైతు బీమా గురించి సమాచారం ఇచ్చేవారు కరువయ్యారు. దీంతో వారు రైతు జీవిత బీమాకు దూరంగానే ఉన్నారు.

కొంపముంచుతున్న పుట్టిన తేదీ..
వయస్సు కారణంగా బీమాకు అనర్హులైన రైతులకు అసలు తమకు బీమా ఎందుకు అందడం లేదో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. దీనికితోడు ఆధార్‌కార్డు నమోదు సమయంలో సరైన పుట్టినరోజు తెలియక ఇవ్వలేదు. ఆ సమయంలో నమోదు చేసుకున్న సిబ్బంది తమకు ఇష్టం వచ్చిన, గతంలో రేషన్ కార్డు, ఓటరు కార్డులో ఉన్న నామమాత్రపు పుట్టినతేదీనే నమోదు చేశారు. దీంతో చాలామంది రైతులు నిర్ణీత వయస్సు ఉన్నప్పటికీ.. కేవలం ఆధార్‌కార్డులో వయస్సు తప్పుగా పడడంతో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రైతు జీవిత బీమాకు అనర్హులుగా మారారు.
 

image

 

Tags
English Title
To the supreme goal..
Related News