తాంత్రిక సాహితీ మాంత్రికుడు

Updated By ManamMon, 06/18/2018 - 00:16
IMAGE

imageసర్ జాన్ ఉడ్‌రాఫ్ 1865 డిసెంబర్ 15న ఇంగ్లండులో జన్మించాడు. తండ్రి జేమ్స్ టిండాల్ ఉడ్‌రాఫ్. న్యాయశాస్త్ర కోవిదుడు. కేంబ్రిడ్జిలో జాన్ న్యాయశాస్త్ర పట్టా పొంది 1890లో ఇండియాకు వచ్చి కలకత్తా హైకోర్టులో అడ్వకేట్‌గా చేరారు. 1904లో హైకోర్టు న్యాయమూర్తిగాను, 1915లో ప్రధాన న్యాయమూర్తిగాను నియమితులైనారు. బ్రిటిష్ ప్రభు త్వం 1915లో వీరికి ‘సర్’ బిరుదమునిచ్చి సత్కరించింది. వీరు తీరిక దొరికిన ప్రతి నిముషం సంస్కృతభాష చదువుకోడానికి ఉపయో గించేవారు. తంత్రశాస్త్రాన్ని ఆపోశనం పట్టిన మహనీయుడు. 1922 వరకు భారత దేశంలోనే ఉన్నారు. వీరు హిందూ మతాన్ని అమితంగా ప్రేమించేవారు. శాక్తేయమును గురించి, మంత్రం గురించి సుదీర్ఘమైన పరిశోదనలు చేశారు. అంతేకాక స్వయంగా సంస్కృతంలో పాండిత్యం సంపాదించి హిందూశాస్త్రాలను పఠించి, తంత్రశాస్త్రాన్ని గురించి, ఉపనిషత్తులను గురించి, కుండలినీ శక్తి గురించి, 27 గ్రంథాలను ఆంగ్లంలో రాశారు. 
సర్ జాన్ భారత దేశాన్ని ప్రేమించినట్లు - ప్రేమించిన ఇతరులను మేము చూడలేదు. ‘భారత సేవయే భగవాన్ సేవ అన్నవారి మాటలలో ఎంతో గొప్పతనముంది’- అని ‘ఉత్సవ’ పత్రిక రాసినది. సర్ సి.పి.రామస్వామి అయ్యర్ వీరి గురించి తమ అభిప్రాయాన్ని ఇలా వ్యక్తంచేశారు. ‘మనం మన శాస్త్రాల ప్రాముఖ్యాన్ని మరచి విదేశీయు లుగా మారుతుంటే, ఒక పాశ్చాత్యుడు మన నాగరికతను, శాస్త్రాలను మనకు జ్ఞాపకమునకు తెచ్చినాడు’ అని ‘మీ హృదయాలను ప్రపంచ మంత విస్తృతం చేసుకోండి. అపుడు మహాశక్తి మీ వెనుక ఉంటుంది. ఇతరుల కోసం చేసే అతి స్వల్ప కార్యం కూడా మీలోని శక్తిని మేల్కొ ల్పుతుంది. ఇతరుల కోసం ఏ కొద్దిపాటి మంచిపని చేసినా మీలో సింహానికున్నంత శక్తి మీరు భరించలేనం శక్తి-ఉద్భవిస్తుంది. ఇది మీరు శక్తిమంతులయ్యే మార్గం. అని ప్రవచించిన స్వామి వివేకానంద తర్వాత హిందూ మతానికి దేశీయులలో గాని, విదేశీయులలోగాని ఇంకొ కరు చేయలేదు’- అని ‘ప్రబుద్ధ భారతి’ అనే పత్రిక రాసింది.

ఇండియా నాగరిక దేశమా?
మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో విలియం ఆర్చర్ అనే ఆంగ్ల సాహితీవేత్త ‘ఇండియా అండ్ ది ఫ్యూచర్’ అనే గ్రంథంలో భారతీయులు అజ్ఞానులు, అనాగరికులు, ఆటవికులు అంటూ నిందిస్తూ రాశాడు. దానికి సమాధానంగా జాన్ ఉడ్‌రాఫ్ ‘ఇండియా నాగరిక మైన దేశమా’ అనే పుస్తకం రాసి ప్రచురించాడు. అందులో ‘హిందూ మతం, క్రైస్తవ మతాలకు చాలా పోలికలున్నాయి. అటువంటప్పుడు హిందూ మతాన్ని విమర్శించడానికి కారణం నాకు కనిపించదు. పాశ్చాత్యులు హిందూ మతాన్ని సరిగా అర్థం చేసుకోలేదనే నా భాధ. హిందూమతంలో హేతువాదం లేదంటారు. ఇది పొరపాటు. హేతు వాదమును హిందూ మతం చేపట్టినంతగా ఏ మతం చేపట్టలేదు.
హిందువుల మతం సత్యం మీద ఆధారపడి వుంది. వారికి సత్యమే దేవుడు. సత్యమే జయించేది. వారికి పరోపకారమే ధర్మం. బైబిలు నీ పొరుగువారిని ప్రేమించమని చెబుతుంది. కానీ ఎందుకు ప్రేమించాలో చెప్పదు. హేతువును చెప్పింది హిందూ మతమే. ఇందుకు హేతువు ‘తత్వమసి’ అని చెప్పింది. అదే నీవు అని అర్థం. దీని భావం ఇది. సమస్య ప్రపంచం ఈశ్వరుని స్వరూపం. నీ రూపంగా అన్నిటా నీవున్నావు. అన్నిటా ఈశ్వరుడున్నాడు. ఇతరులను ప్రేమించ డమంటే ఈశ్వరుని ప్రేమించుట. నిన్ను నీవు ప్రేమించుట’ అని హిందూ మతం హేతువని చెప్పింది.

ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడని బైబిలు చెబుతుంది. దేని నుంచి దేవుడు ఈ ప్రపంచాన్ని నిర్మించాడో హేతువు చెప్పదు. కనీసం దేవుడు తన నుండైనా ఈ విశ్వాన్ని సృషించాడనీ చెప్పదు. ఈ హేతువును షడ్దర్శనములు చెప్తున్నవి. స్వేచ్ఛాలోచన హిందూ మతంలో ఉన్నట్లు ఎందులోనూ లేదు. అక్కడ నాస్తిక మతములు కూడా వెలసినవి. అప్పుచేసి పప్పుకూడా తిని సుఖించు అని చెప్పే చార్వాక మతం వంటిది కూడా పుట్టింది’ 

మంత్ర శక్తి ఎడల ఏర్పడిన విశ్వాసముః
ఆంగ్లేయులు హేతువాద ప్రియులు. ఉడ్‌రాఫ్ వంశం హేతువా దానికి ఆటపట్టైన న్యాయశాస్త్రంలో పండింది. ఇటువంటి వీరు మూఢ నమ్మకాలని నెట్టి వేయబడిన మంత్రశాస్త్రంలో పరిశోధనలు చేయుటకు బలమైన కారణాలున్నాయి. మందులకు నయంకాని జబ్బులు మంత్ర ములకు నయమగుట వారు చూచారు. ఇది వారిలో బ్రహ్మాండమైన మార్పు తెచ్చింది. ఇంతవరకు వారు మంత్రమంటే ప్రార్థన వంటిది అనే అభిప్రాయంతో ఉన్నారు. మంత్రమంటే ఒక శక్తి అనీ ఇప్పుడు వారు నమ్మారు. ఇట్టి నమ్మకం కలుగుటకు వారు తన ‘సర్పెంట్ పవ ర్’ అనే గ్రంథంలో కొన్ని అనుభవాలను రాశారు. అవి ఇలా వున్నాయి.

‘ఒక మేజర్ దగ్గర ఒక సాధువు నిలచి వున్నాడు. సాధువు కాలి వద్ద ఒక తేలు ఉండడం మేజర్ చూశాడు. క దలకు నీ కాలి వద్ద తేలు వుందని చెప్పాడు. సాధువు వంగి, తేలుని చూచి, తన వేలును తేలు వైపు చూపాడు. తేలు గజగజ వణికి చచ్చిపోయింది. ఇది చూచి మేజర్ ఆశ్చర్యపోయాడు. ఇంకొక అనుభవం. కుశండికా హోమంలో ఒకరు నిప్పులేకుండానే మంత్రం జపిస్తూ పుల్లలకు నిప్పుపుట్టించారు. ఇలాం టి సంఘటనలు వారిలో మంత్రం యెడల నమ్మకం కలిగించినవి. 

మంత్ర శాస్త్రంః
పాశ్చాత్యులు మంత్రశాస్త్రాన్ని అపార్థం చేసుకున్నంతగా ఏ శాస్త్రా న్నీ అపార్థం చేసుకోలేదు. మంత్రశాస్త్రం ఒక మహత్తరమైన శాస్త్రీయ మైన శాస్త్రం. దీనిలో ఎంతో శక్తి జ్ఞానములున్నవని తెలిపిన పాశ్చా త్యుడు సర్ జాన్ ఉడ్‌రాఫ్. మంత్రం ప్రార్థన కాదు. అది ఒక శబ్ద శక్తి. భౌతిక శక్తి వంటిదే. అదొక సూక్ష్మశక్తి. భారతీయులు ఈ శక్తిని తెలుసు కున్నారు. శబ్దం ఉత్పత్తి గురించి భారతీయులు ఎన్నో పరిశోధనలు చేశారు. ఇందులో ఎంతో సత్యమున్నది. మంత్రశాస్త్రంలో ఉన్న సత్యా న్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం వారు 27 గ్రంథాలను రచించారు. అందులో ఇవి కొన్ని..
1. సర్పెంట్ పవర్ - కుండలినీ శక్తి - షట్చక్ర నిరూపణం; 2. గ్రేట్‌నెస్ ఆఫ్ శివా- శివ హహ్నిస్తోత్రం- ఆంగ్ల తర్జుమా; 3. గార్లెండ్ ఆఫ్ లెటర్స్-వర్ణమాల, మంత్ర శాస్త్రం;. 4 ద వరల్డ్ ఆఫ్ పవర్ - శక్తి రూపంలో ప్రపంచం; 5. హైమ్స్ టు కాళి- కాళీ స్త్రోత్రములు; 6. తంత్ర ఆఫ్ గ్రేట్ లిబరేషన్ - మహా నిర్వాణ తంత్రశాస్త్రం. 

1922 ఏప్రిల్ 22న ఆయన భారత దేశం వదిలిపెట్టి వెళ్లిపోతూ అన్న మాటలివి. ‘ఈ దేశంలో నేను ఎంతో తెలుసుకున్నాను. అనుభ వించాను. నేను చూస్తున్న ఈ పవిత్ర భూమిని చూడడం ఇది ఆఖరి చూపై ఉండవచ్చు. మంత్రించబడ్డ ఇంద్రజాలం వలె ఉన్నదీ పవిత్ర భూమి. బరువైన హృదయంతో ఈ స్థలం వద్ద సెలవు తీసుకుం టున్నాను.’ భారత భూమిని అంతగా ప్రేమించిన ధన్యజీవివారు. 1936 జనవరి 18న ఇంగ్లండులో సర్ జాన్ ఉండ్‌రాఫ్ స్వర్గస్తులైనారు. అపుడు ‘హిందూ’ పత్రిక ఇలా రాసింది. ‘సర్ జాన్ ఉడ్ రాఫ్ తన భార్యతో కలసి తాంత్రిక సాహిత్యంలో ఉన్న మహత్తర సత్యాలను ప్రచా రం చేయుట, ఆ శాస్త్రం మీద వున్న అజ్ఞాన మేఘాలను తొలగించుట తన జీవిత లక్ష్యంగా పెట్టుకొన్నాడు. భారత దేశాన్ని తన ఔన్నత్య స్థాయికి మేల్కొల్పిన గౌరవ ప్రతిష్ఠలు గల స్థానాన్ని సర్ జాన్ ఆక్రమించారు’.
 - డాక్టర్ పైడిమర్రి మాణిక్ ప్రభు శర్మ 

English Title
Tantric literary magician
Related News