తొలి ఏకాదశి

Updated By ManamTue, 07/17/2018 - 00:33
bhakti (8017)

imageయోగమాయకు ప్రతిరూపమైన ఏకాదశి తిథిలో సైతం పరమాత్మ రక్షణ శక్తి దాగివుందని చెబుతారు. అందుకే ఏకాదశీ వ్రతంతో నియమనిష్ఠలు పాటిస్తారు. ఏకాదశి రోజు మొత్తం ఉపవాస దీక్షను పాటిస్తారు. నాటి రాత్రి విష్ణు సహస్రనామ పారాయణలతో జాగరణ చేస్తారు. మరునాడు అంటే ద్వాదశిరోజున ద్వాదశి తిథి పూర్తికాకముందే బ్రాహ్మణులకు, అన్నార్ధులకు భోజనం పెట్టి తరువాత దీక్షాపరులు భుజించి వ్రతాన్ని ముగిస్తారు. ఇది స్థూలంగా ఏకాదశీ వ్రతాన్ని పాటించే విధానం.  

భౌతిక చింతనను వదిలి మనసులో కొలువైన పరమాత్మను పారమార్ధిక దృష్టితో ఆరాధించే అద్భుత అవకాశం తొలి ఏకాదశి ఉపవాసంతో లభిస్తుంది. ఉపవాసం ‘నిరాహారో భవేదేకః ప్రత్యామ్నాయ విధానం గతః’ అన్నరీతిలో కడుపునిండా భోజనానికి బదులుగా సాత్విక ఆహారం తీసుకుని కూడా వ్రతాన్ని చేయవచ్చు. దీనినే ఏకాదశీ ఏకభుక్త వ్రతమని అంటారు.  సత్వగుణ ప్రధానుడైన పరమాత్మ సాన్నిధ్యాన్ని కోరుకునేవారంతా ఏకాదశీ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ సందర్భంగా విష్ణు స్మరణ, దర్శనం ప్రధానమైనవి. తొలిఏకాదశి సందర్భంగా విష్ణ్వాలయాల్లో శయనోత్సవం నయనమనోహరంగా నిర్వహిస్తారు.

పాలకడలిలో శేషతల్పంపై పవళించే శేషశాయిని
త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం
విబుద్ధే త్వయి బుద్ధ్యేత తత్సర్వం సచరాచరమ్ 


ఓ జగన్నాథా! నీవు నిద్రించు. జగమంతా నిద్రిస్తుంది. నీవు మేల్కొంటే జగమంతా మేలుకొంటుంది అని ప్రార్ధిస్తూ శయనైకాదశి ఉత్సవం జరుపుతారు.సోమవారం తొలి ఏకాదశి. దీనినే శయనైకాదశి అని కూడా అంటారు. స్థితికారకుడైన శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే సందర్భం శయనైకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకూ శ్రీహరి యోగనిద్రలో ఉంటాడు. ఈ నాలుగునెలలపాటూ తన స్థితికారకత్వ, జగత్ పోషకత్వ బాధ్యతలను సోదరి అయిన పార్వతీదేవికి అప్పగిస్తాడంటారు. అందుకే ఈ నాలుగు నెలల్లోనూ శక్తి ఆరాధనలు విశేషంగా చేస్తారు. 

Tags
English Title
tholiyekadasi
Related News