టీసీఎస్ షేర్లు అమ్మేసిన టాటా

Updated By ManamTue, 03/13/2018 - 18:02
Tata Sold TCS Shares
  • అప్పులు తీర్చుకునేందుకు, కొత్త పెట్టుబడుల కోసం నిర్ణయం

Tata Sold TCS Sharesబెంగళూరు/ముంబై: నెత్తి మీద బండలా మారిన అప్పులను తీర్చుకునేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లను టాటా సన్స్ అమ్మేసింది. గుదిబండలా మారిన అప్పులను తీర్చడం కోసం, ఆటో, స్టీల్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం రూ.8,127 కోట్ల సమీకరణే లక్ష్యంగా సోమవారం.. టీసీఎస్‌లోని 1.48 శాతం షేర్లను టాటా సన్స్ గ్రూప్ విక్రయించింది. ఎన్ఎస్ఈలో సోమవారం సాయంత్రం బ్లాక్ ట్రేడ్ ద్వారా ఆ షేర్లను అమ్మింది టాటా సన్స్. స్టాక్ ముగింపు ధర అయిన రూ.3,052.15పై 4.17 శాతం నుంచి 5.9 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చి మరీ ఆ షేర్లను టాటా సన్స్ అమ్మకానికి పెట్టింది. జపాన్ టెలికాం దిగ్గజమైన డొకొమోతో 2013లో విడిపోయిన తర్వాత.. సంస్థకు టాటా సన్స్ 127 కోట్ల డాలర్లను చెల్లించింది. ఇక, అంతేగాకుండా టాటా టెలీ సర్వీసెస్ వల్ల మూటగట్టుకున్న రూ.35 వేల కోట్ల అప్పులనూ తిరిగి చెల్లించేందుకు టాటా సన్స్ అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే టాటా టెలీ సర్వీసెస్‌ను ఎయిర్‌టెల్‌లో కలిపేసే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ఇక, దాంతో పాటు దివాళా తీసిన భూషణ్ స్టీల్, భూషణ్ స్టీల్ అండ్ పవర్‌లను చేజిక్కించుకోవాలనుకుంటున్న టాటా స్టీల్‌కు ఆర్థిక చేయూతనిచ్చేందుకూ టాటా సన్స్ ఒప్పందం చేసుకుంది. ఆ రెండు కంపెనీలను చేజిక్కించుకునేందుకు ఆ సంస్థల పేరిట ఉన్న రూ.60 వేల కోట్ల అప్పులను కట్టేందుకూ సిద్ధమైంది టాటా స్టీల్. తద్వారా ఆ కంపెనీలను హస్తగతం చేసుకోవడంలో భాగంగా అత్యధిక బిడ్ వేసిన కంపెనీగా టాటా స్టీల్ నిలిచింది.

టాటా మోటార్స్‌లోనూ...
ఉక్కు పరిశ్రమతో పాటు టాటా మోటార్స్‌లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది టాటా సన్స్. టాటా మోటార్స్ కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఆ సంస్థకు సహకారం అందించే దిశగా పెట్టుబడులకు రెడీ అయింది టాటా సన్స్. తద్వారా ఆ రంగంలో రెండంకెల వృద్ధి సాధించాలని టాటా మోటార్స్ తాపత్రయ పడుతోది. సంస్థలో అధిక వాటాలున్నప్పుడు వాటిని అమ్మి బాలెన్స్ షీట్‌ను సమతుల్యం చేసుకోవడమే మంచిదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, డిసెంబరు 2017 నాటికి టీసీఎస్‌లో టాటా సన్స్‌కు 73.57 శాతం వాటా ఉంది. 

English Title
Tata Sold TCS Shares
Related News