పొత్తులపై నేడు టీడీపీ, కాంగ్రెస్ చర్చలు

Updated By ManamFri, 09/07/2018 - 23:42
Uttam kumar reddy
  • చంద్రబాబుతో ప్రాథమిక చర్చలు జరిపే అవకాశం

  • 12న ఆజాద్, బాబు భేటీ తర్వాత స్థానాల  ప్రకటన

uttamహైదరాబాద్: శాసనసభ రద్దుతో రాజకీయ పార్టీలు పొత్తుల ప్రక్రియను వేగవంతం చేశాయి. ముందస్తు  ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను  ఓడించాలనే లక్షంతో ఉన్న  కాంగ్రెస్ పార్టీ ఒకడుగు ముందుకు వేసింది.  పొత్తులపై చర్చించేందుకు  తెలుగుదేశం పార్టీని ఆహ్వానించింది. అందుకు టీడీపీ సరేనంది. కాంగ్రెస్ ఆహ్వానాన్ని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు  దృష్టికి తెచ్చారు. ఆందుకు చంద్రబాబు సరేనన్నారు. చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందుగా కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తులపై రాష్ట్ర నాయకత్వాలు ప్రాథమిక చర్చలు శనివారం మొదలుపెడుతున్నాయి.  టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఫోన్ చేసి పొత్తులపై మాట్లాడుకుందామనే విషయం  చెప్పారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షులు,ఎపీ సీఎం ఎన్ చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో పార్టీ నేతలతో ముందస్తు ఎన్నికలపై జరిగే సమావేశంలో పాల్గొంటారని ఉత్తమ్ దృష్టికి తెచ్చారు. ప్రస్తుత ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరిగే పోటీయని, టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కలిసి వచ్చే పార్టీలతో పొత్తులకు సిద్ధమని చెప్పారు. ముందుగా మనం మాట్లాడుకుందామని, ఆ తర్వాత  చంద్రబాబుతో మాట్లాడుదామని ఉత్తమ్ చెప్పారు.  ఉదయం గోల్కొండ హోటల్‌లో ఉత్తమ్,రమణ బృందాలు చర్చలు జరిపే అవకాశం ఉంది.  ఆ తర్వాత మధ్యాహ్నం  చంద్రబాబుతో కూడా  ఉత్తమ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ భేటీ జరుగుతోందనే విషయాన్ని రహస్యంగా ఉంచారు.  ఈ సందర్భంగా ఇరు పార్టీల బలాబలాలపై చర్చిస్తారు. ఒక అవగాహనకు వస్తారు. పొత్తులతో పాటు ప్రచార కార్యక్రమాలపై మాట్లాడుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ నెల 12 న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గులాం నబీ ఆజాద్ హైదరాబాద్ రానున్నారు. రాఫెల్ కుంభకోణంపై ఆయన మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత చంద్రబాబుతో కూడా తుది విడత చర్చలు జరుపుతారు. అదే రోజు పొత్తులపై  అధికారికంగా  ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా,  టీడీపీతో పొత్తుపై గులాం నబీ ఆజాద్ వారం నెల రోజుల క్రితమే చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడి నట్లు తెలిసింది. ఆజాద్ సూచనల మేరకే ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్ టీం కమిటీ సభ్యుడు కొప్పుల రాజు రంగంలోకి వచ్చారు. ఆయనతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క కూడా చంద్రబాబుతో మాట్లాడినట్లు తెలిసింది. 

English Title
TDP and Congress talks on alliances today
Related News