టీచర్లకు.. ఇతర పనులే ఎక్కువ!

Updated By ManamFri, 09/21/2018 - 22:44
teachers
  • బోధనలో గడిపేది కొంత సమయమే

  • 220 రోజుల్లో 42 రోజులే క్లాసులో పాఠాలు

  • మిగతా రోజుల్లో ఎన్నికలు, సర్వేల విధుల్లో..

Teachersన్యూఢిల్లీ: ఉపాధ్యాయులు.. విద్యార్థులకు పాఠాలు బోధించడమే ప్రధాన విధి! కానీ.. అందుకు విరుద్ధంగా వారు ఇతర కార్యక్రమాల్లోనే ఎక్కువగా పని చేస్తున్నారని తాజా నివేదికలో వెల్లడైంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఏడాదిలో 220 రోజుల్లో టీచర్లు విద్యాబోధన చేయాల్సి ఉంది. కానీ.. వారు 42 రోజులే పాఠాలు చెబుతున్నారని తేలింది. అంటే.. 19 శాతం మాత్రమే వారు విద్యాబుద్ధలు చెప్పడంలో గడుపుతున్నారని, మిగతా సమయం ఎన్నికలు, సర్వేలు, పల్స్‌పోలియో, మధ్యాహ్న భోజన రిజిష్టర్ల నిర్వహణ.. ఇలా ఇతరత్రా కార్యకలాపాల్లో మునిగితేలుతున్నారని తేలింది. ‘ఉపాధ్యాయులు.. బోధన కార్యక్రమాలు.. విద్యా వ్యవస్థపై ప్రభావం’ అన్న పేరుతో రూపొందించిన నివేదికలో ఈ అంశాలు ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం.. 2015-16లో టీచర్లు కేవలం 42 రోజులపాటే విద్యాబోధనవ ఇధుల్లో గడిపారు. 2009నాటి  ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం.. ఒక విద్యా సంవత్సరంలో 1-5 తరగతులకు 200 పనిదినాలు, 6-8 తరగతులకు 220 పని దినాలు ఉండాలి. ఆ మేరకు టీచర్లకు విద్యా బోధన చేయాలన్నమాట. వారానికి సగటున 45 గంటలు పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. కానీ.. ఇందుకు భిన్నంగా ఈ పనిదినాల్లో దాదాపు 81 శాతం.. అంటే సుమారు 180 రోజులు వారు ఇతర విధులు అంటే మండలస్థాయి అధికారి విధులను నిర్వహించాల్సి వస్తోంది. ఈ 81 శాతంలో 31 శాతం బోధనేతర కార్యక్రమాల్లో, 6.5 శాతం శాఖాపరమైన కార్యక్రమాల్లో వారు తలమునకలు కావాల్సి వస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 14.67 లక్షల  పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 10.7 లక్షలు ప్రభుత్వ, 3.49 లక్షలు ప్రైవేటు స్కూళ్లు. ప్రభుత్వ పాఠశాలల్లో 11 కోట్ల మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల్లో 7.43 కోట్ల మంది  విద్యను అభ్యసిస్తున్నారు.

Tags
English Title
Teachers ... More Than Other Works!
Related News