ఆ తానులో ముక్కలే

Updated By ManamSun, 04/15/2018 - 02:55
modi

imageఇదంతా చూస్తుంటే గుజరాత్ తరహా పాలన దేశమంతా అందిస్తానన్న మోదీ మాటలు గుర్తుకురాక తప్పవు. నిజానికి అప్పట్లో ఎన్నికలకు ముందు దేశమంతా ఒకరకమైన మాయ కళ్లముందు కప్పేసింది. గుజరాత్‌లో కూడా బయటకు వచ్చిన విషయాలు మాత్రమే అందరికీ తెలిశాయి తప్ప అక్కడ కూడా రైతులకు కష్టాలున్నాయని, వాళ్లు కూడా ఇబ్బందులు పడుతుంటారని ఎవరికీ అర్థం కాలేదు. దాంతో.. మోదీ అన్న వ్యక్తి ప్రధానమంత్రి అయితే చాలు.. దేశమంతా డబుల్ డిజిట్ గ్రోత్‌రేటు ఉంటుందని భ్రమపడ్డారు. గుజరాత్‌లో ఆయనేం చేశారు, ఏం చేయలేదన్నది పక్కన పెడితే.. గత నాలుగేళ్లలో దేశం ఏం అభివృద్ధి సాధించింది, నల్లధనం ఏ మేరకు వెనక్కి తిరిగొచ్చింది, అవినీతి ఎంత తగ్గింది, ధరలు ఏమాత్రం అదుపులోకి వచ్చాయి, సామాన్యుల జీవితం ఎంత బాగుపడిందని చూసుకుంటే.. ఏ ఒక్కదానికీ సమాధానం రాదు. అంతేకాదు.. ఎక్కడ చూసినా నిష్క్రియాపరత్వం కూడా తీవ్రస్థాయిలో ఉంటోంది.

నాలుగేళ్ల పాటు అధికారంలో ఉన్నా.. తమ మీద ఒక్క మరక కూడా పడలేదని, తమవాళ్లంతా పులు కడిగిన ముత్యాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ‘56 అంగుళాల ఛాతీ’ విరుచుకుంటూ చెప్పేవారు. కాంగ్రెస్ హయాంలో వెలుగులోకి వచ్చిన స్కాంలను ప్రస్తావిస్తూ తమ సర్కారులో అవినీతి అన్నదే లేదని ప్రగల్భాలు పలికేవారు. రామరాజ్యాన్ని మళ్లీ తాను మాత్రమే అందిస్తున్నట్లు ఆయన మాటల్లో గోచ రించేది. కానీ... వరుసగా గత కొంతకాలంగా జరుగుతున్న ఘటనలను చూస్తుంటే బీజేపీ సర్కారు, అందులోని మంత్రులు అందరూ ఆ తానులోని ముక్కలే అనిపిస్తోంది. విజయ్ మాల్యా మొదలు నీరవ్ మోదీ వరకు అనేకమంది ఆర్థిక నేరస్తులు ఎంచక్కా దేశం వదిలి పారిపోయేందుకు అవకాశం కల్పించడం, బ్యాంకుల ఆర్థిక క్రమశిక్షణ పక్కకు మళ్లినా పట్టించుకోకపోవడం, పెద్దనోట్ల రద్దు లాంటి చర్యలతో చివరకు పోస్టాఫీసులు, బ్యాంకులలో కూడా పరోక్షంగా అవినీతిని ప్రోత్సహించడం.. ఇవన్నీ సామాన్యుల కళ్ల ముందు కట్టినట్లు కనిపించాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ప్రవేశపెట్టడాన్ని అతిపెద్ద సంస్కరణలుగా బోర విరుచు కుని చెబుతున్నా, నిజానికి వాటివల్ల లాభపడింది ప్రభుత్వం, వ్యాపారులు.. నష్టపోతున్నది సామాన్య ప్రజలు మాత్రమే. జీఎస్టీ భారం మొత్తం ప్రజల మీద గుదిబండలా పడింది. మొబైల్ బిల్లుల నుంచి ఇన్సూరెన్సు ప్రీమియంల వరకు.. ప్రతిదీ జీఎస్టీ పేరుతో విపరీతంగా పెరిగిపోయాయి. ఆ డబ్బంతటినీ సామాన్యుడే చెల్లించాల్సి వస్తోంది. వ్యాపారు లను పన్ను పరిధిలోకి తెస్తున్నామని ప్రభుత్వం చంకలు గుద్దుకున్నా దానివల్ల ఎవరికీ తెలియకుండానే వారి కుటుంబ బడ్జెట్ 20 నుంచి 30 శాతం మేర పెరిగింది. మరోవైపు జీతాలు మాత్రం మహా అయితే 5 శాతం పెరగడం కూడా గగనంగా మారింది. పెద్దనోట్ల రద్దు సమయంలో కూడా ఇబ్బందులు పడింది సామాన్యులే. శేఖర్‌రెడ్డి లాంటి పెద్ద మనుషులు కోట్లకు కోట్లు వెనకేసుకుంటే, గాలి జనార్దనరెడ్డి లాంటి వాళ్లు ఆ సమయంలో కూడా తన కూతురికి ఆకాశ మంత పందిరి, భూదేవంత పీటవేసి నభూతో.. అన్నట్లుగా పెళ్లి చేయగలిగారు. సామాన్యుడు మాత్రం కనీసం తమ వాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నా, చనిపోయిన తర్వాత అంత్య క్రియలు చేయాలన్నా చేతిలో డబ్బులు ఆడక నానా అగచాట్లు పడ్డారు. ఇదంతా మోదీసర్కారు పుణ్యమేనని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ ఈ విషయం చాలా బాగా అర్థమయ్యింది. మళ్లీ ఎన్నికలు ఎప్పుడొస్తాయా ... వాళ్లకు ఎలా బుద్ధిచెప్పాలా అని కాసుకు కూర్చున్నారు.
 
అత్యాచార ఘటనలతో అట్టుడుకుతున్న దేశం
ఇవన్నీ చాలవన్నట్లు ఇటీవలి కాలంలో వరుసపెట్టి దేశంలో చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి. జమ్ము కశ్మీర్ లోని కథువా ప్రాంతంలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. ఆమెను హతమార్చి పారేసిన ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచే సింది. ఒకవైపు దేశం యావత్తు అయ్యో.. ఆసిఫా అంటూ గుండెలవిసేలా రోదిస్తుంటే, జమ్ము క శ్మీర్ ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఇద్దరు బీజేపీ మంత్రులు మాత్రం.. నిందితులకు వత్తాసు పలికి వాళ్లను కాపాడాలంటూ బయల్దేరారు. అయితే అక్కడున్నది మెహబూబా ముఫ్తీ లాంటి గట్టి ముఖ్యమంత్రి కావడంతో.. ఆ ఇద్దరికీ ఉద్వాసన తప్పలేదు. ఆసిఫా హత్యాచారం విషయంలో దేశమంతా ఒక్క టిగా నిలిచింది. బీజేపీ సర్కారు అసమర్ధ నిర్వాకాన్ని నిలువునా ఎండగట్టింది. చివరకు కేంద్రంలోని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకే సింగ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ లాంటి వాళ్లు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను ఉరి తీయాలన్నారు. ఇది ఒక వేకప్ కాల్ అని, ఇప్పుడు కూడా స్పందించకపోతే మానవత్వం చచ్చిపోయినట్లేనని ఆమె చెప్పారు. ఆసిఫా.. నీకు న్యాయం చేయలేకపోయాం తల్లీ అంటూ వీకే సింగ్ బాధ పడ్డారు. పట్టుమని పదేళ్లు కూడా లేని చిన్నారిపై రోజుల తరబడి అత్యాచారం చేసి ఆమెను హతమార్చిన ఘటనపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందించారు. ఢిల్లీ వీధుల్లోకి వచ్చి కొవ్వొత్తుల ప్రదర్శనలు చేశారు. గతంలో నిర్భయ ఘటన జరిగినప్పుడు కలుగులోకి ఎలక దూరినట్లుగా ఉన్నట్టుండి మాయమైపోయి తీవ్ర విమర్శలపాలైన రాహుల్ గాంధీ.. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత కాస్తంత బాధ్యతాయుతంగా వ్యవహరించారు. తన సోదరి ప్రియాంక తో కలిసి తాను కూడా రోడ్డు మీదకు వచ్చారు. గుజ్జర్ ఆదివాసీ సముదాయానికి చెందిన ఆసిఫా తమ కుటుంబ వృత్తిలో భాగంగా.. మేత కోసం అడవికి వెళ్లిన గు ర్రాలను ఇంటికి తోలుకొచ్చేందుకు అడవిలోకి వెళ్లి.. ఇక తిరిగి రాలేదు. దాదాపు పది రోజుల తర్వాత ఆమె శవం అడవుల్లో కనిపించినట్లు పిడుగులాంటి వార్త తల్లిదండ్రులకు చేరింది. చివరకు పోలీసులు కూడా నిందితుల్లో ఉండటం ఈ కేసులో అత్యంత ఘోరమైన విషయం. తన కూతుళ్లిద్దరూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో బావ మరిది కూతురైన చిన్నారి ఆసిఫాను దత్తత తీసుకుని పెంచుకుంటున్న పుజ్వాలా కుటుం బానికి కళ్లెదుటే ప్రత్యక్ష నరకం కనిపించింది.
 
కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత ఎక్కడిది?
ఇక మరోవైపు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో కూడా దాదాపు ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అత్యాచారం చేశారు. ఈ ఘటనలో తమకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు పోరాడితే.. ఆమె తండ్రిని ఏకంగా లాకప్ డెత్ చేసి పారేశారు. పరిస్థితి చెయ్యి దాటిపోతోందని గ్రహించిన యూపీ ముఖ్యమంత్రి ఈ కేసును సీబీఐకి అప్పగించి, ఎమ్మెల్యేను అరెస్టు చేయించే వరకు వెళ్లింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశం వల్లే ఆయన కూ డా స్పందించాల్సి వచ్చింది తప్ప.. తనంతట తానుగా కేసు ను సీబీఐకి అప్పగించాలన్న ఆలోచన యోగికి రాలేదు. అవినీతి, స్కాంల ఆరోపణలు రావడం సహజం. అవి నిజాలో కావో ఎవరికీ తెలియదు. దేశం మొత్తాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రం కేటాయింపు కేసును సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. సుదీర్ఘ కాలం విచారణ జరిపిన తర్వాత అసలు అక్కడ స్కాం జరిగినట్లుగా నిరూపించడంలో సీబీఐ ఘోరంగా విఫలమైందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఒకరకంగా చూస్తే.. అక్కడేమీ జరగనట్లే కదా! మరి పదే పదే కాంగ్రెస్ హయాం అంతా స్కాములమయమని, తాము మాత్రమే స్వచ్ఛమైన నాయకులమని బోర విరుచుకుని చెప్పడమెం దుకు? పోనీ.. ఒకవేళ కోర్టులో నిరూపితం కాకపోయినా మహా అయితే అప్పుడు ఒకరిద్దరు వ్యక్తులు కొన్ని వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని అనుకోవచ్చు. కానీ మరిప్పుడో? బ్యాంకులలో వేల కోట్ల అవినీతి, అక్రమాలు బయటపడు తున్నాయి. నిన్న మొన్నటివరకు అద్భుతాలు సృష్టించారని అంతా ఆకాశానికి ఎత్తేసిన చందాకొచ్చర్, శిఖా శర్మ లాంటి వాళ్లను కూడా ఇప్పుడు కూరలో కర్వేపాకుల్లా తీసి పక్కన పెట్టేస్తున్న పరిస్థితి. మరోవైపు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్న అత్యాచారాలు.
 
గుజరాత్ నమూనా హుళక్కే!
ఇదంతా చూస్తుంటే గుజరాత్ తరహా పాలన దేశమంతా అందిస్తానన్న మోదీ మాటలు గుర్తుకురాక తప్పవు. నిజానికి అప్పట్లో ఎన్నికలకు ముందు దేశమంతా ఒకరకమైన మాయ కళ్లముందు కప్పేసింది. గుజరాత్‌లో కూడా బయటకు వచ్చిన విషయాలు మాత్రమే అందరికీ తెలిశాయి తప్ప అక్కడ కూడా రైతులకు కష్టాలున్నాయని, వాళ్లు కూడా ఇబ్బందులు పడుతుంటారని ఎవరికీ అర్థం కాలేదు. దాంతో.. మోదీ అన్న వ్యక్తి ప్రధానమంత్రి అయితే చాలు.. దేశమంతా డబుల్ డిజిట్ గ్రోత్‌రేటు ఉంటుందని భ్రమపడ్డారు. గుజరాత్‌లో ఆయనేం చేశారు, ఏం చేయలేదన్నది పక్కన పెడితే.. గత నాలుగేళ్లలో దేశం ఏం అభివృద్ధి సాధించింది, నల్లధనం ఏ మేరకు వెనక్కి తిరిగొచ్చింది, అవినీతి ఎంత తగ్గింది, ధరలు ఏమాత్రం అదుపులోకి వచ్చాయి, సామాన్యుల జీవితం ఎంత బాగుపడిందని చూసుకుంటే.. ఏ ఒక్కదానికీ సమాధానం రాదు. అంతేకాదు.. ఎక్కడచూసినా నిష్క్రియాపరత్వం కూడా తీవ్రస్థాయిలో ఉంటోంది. పనులు ఏమాత్రం ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టులేవీ పూర్తి కావడం లేదు. ఎప్పుడో పనులు మొదలుపెట్టినవి తప్ప, ఈమధ్య కాలంలో మొద లుపెట్టి పూర్తి చేసినవి ఒక్కటీ కనపడటం లేదు.
 
మీడియా వైఖరిపై ‘సుప్రీం’ అసంతృప్తి
ఒకవైపు పరిస్థితులన్నీ ఇలా అస్తవ్యస్తంగా ఉంటే.. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మీడియా కూడా బాధ్యత మరిచి ప్రవర్తిస్తోంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పదేపదే చెప్పాల్సి వస్తోంది. సాధారణంగా అత్యాచార కేసులలో బాధితుల వివరాలను ఏమాత్రం బయటపెట్టరు. కానీ, కథువా ఘటన విషయంలో మాత్రం బాధితురాలి పేరు, తండ్రి ఊరు, పేరు సహా చివరకు ఆమె ఫొటోను కూడా పత్రికలలో నిర్లజ్జగా ప్రచురించేశారు. అసలే ఒక చిన్నారి దారుణాతి దారుణమైన హింసకు గురై ప్రాణాలు కోల్పోయిందని అంతా బాధపడుతుంటే, ఆమెను చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆ ఫొటో ప్రచురించకుండా కథనాలు ఇవ్వలేరా? ఇలాంటి విషయాల్లో పాత్రికేయ కురు వృద్ధులు, గురువులు చెప్పిన పాఠాలను ఎందుకు మర్చిపో తున్నారు... లేదా కావాలనే గాలికి వదిలేస్తున్నారన్న విషయాన్ని ఒక్కసారి గుండెలమీద చెయ్యి వేసుకుని ఆలోచించాలి. పాత్రికేయం అంటే కత్తిమీద సాము లాంటిది. ఏమాత్రం అడుగు తడబడినా పీకలు తెగిపోతాయి. ఆ విషయాన్ని గుర్తెరిగి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అలా ఉండకపోవడం వల్లే ఆసిఫా విషయంలో పత్రికలు వ్యహరించిన తీరుపై సుప్రీం కోర్టు సైతం అక్షింతలు వేయాల్సి వచ్చింది. ఆమె ఫొటోను ప్రచురించిన పత్రికలు, చూపించిన టీవీలకు నోటీసులు ఇవ్వా ల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఇదే విషయంలో బాధ్యతా రహితంగా వ్యవహరించిన ప్రాంతీయ భాషా పత్రికలకు కూడా సదరు నోటీసులు అందుతాయో.. లేవో చూడాలి మరి! 

అవినీతి, స్కాంల ఆరోపణలు రావడం సహజం. అవి నిజాలో కావో ఎవరికీ తెలియదు. దేశం మొత్తాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రం కేటాయింపు కేసును సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. సుదీర్ఘ కాలం విచారణ జరిపిన తర్వాత అసలు అక్కడ స్కాం జరిగినట్లుగా నిరూపించడంలో సీబీఐ ఘోరంగా విఫలమైందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఒకరకంగా చూస్తే.. అక్కడేమీ జరగనట్లే కదా! మరి పదే పదే కాంగ్రెస్ హయాం అంతా స్కాములమయమని, తాము మాత్రమే స్వచ్ఛమైన నాయకులమని బోర విరుచుకుని చెప్పడమెందుకు?

English Title
That's it
Related News