‘మొండి బాకీల్లో అందరి ప్రమేయం ఉంది’

Updated By ManamTue, 09/11/2018 - 22:22
raghuram-rajan

raghuram-rajanన్యూఢిల్లీ: మొండి బాకీలు పెరిగిపోవడానికి బ్యాంకర్లు అతి నమ్మకంతో వ్యవహరించడం, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంలో మందగతి, ఆర్థిక వృద్ధి మితంగా ఉండడం ప్రధాన కారణాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పార్లమెంటరీ ప్యానెల్‌కు సమర్పించిన ఒక నోట్‌లో పేర్కొన్నారు. ‘‘బొగ్గు గనుల కేటాయింపు సందేహాస్పదంగా ఉండడం, వాటిపై దర్యాప్తు జరిపేందుకు భయపడడం వంటి రకరకాల పాలనాపరమైన సమస్యలు ఢిల్లీలో యు.పి.ఏ, ఎన్.డి.ఏ ప్రభుత్వాలు రెండింటిలోను ప్రభుత్వ నిర్ణాయక క్రియను మందగతి పట్టించాయి’’ అని మురళీ మనోహర్ జోషీ నేతృత్వంలోని అంచనాల కమిటీకి సమర్పించిన పత్రంలో రాజన్ వ్యాఖ్యానించారు. 

అధిక లివరేజీతో సమస్య
నిలిచిపోయిన ప్రాజెక్టుల వ్యయాలు బాగా పెరిగిపోయాయి. ఫలితంగా, అవి రానురాను వడ్డీ కూడా చెల్లించలేని స్థితికి చేరుకున్నాయి. కొన్ని విద్యుదుత్పాదన కేంద్రాల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారతదేశంలో విద్యుచ్ఛక్తి కొరత ఉన్నప్పటికీ, అవి ఎటూ పాలుపోని స్థితిలో పడి ఉండడం, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే క్రమం ఈరోజు వరకు కూడా వేగం పుంజుకోలేదని సూచిస్తోంది. ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉన్న 2006-2008 కాలంలోనే పెద్ద సంఖ్యలో మొండి బాకీలు బయటపడ్డాయని ఆయన వెల్లడించారు. విద్యుదుత్పాదన కేంద్రాల వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులు ఇంతకుముందువి సకాలంలో, అనుకున్న బడ్జెట్ లోపలే పూర్తయ్యాయని కూడా ఆయన అన్నారు. ‘‘ఆ కాలంలోనే బ్యాంకులు తప్పిదాలు చేశాయి. అవి కంపెనీల పాత వృద్ధి, పనితీరును భవిష్యత్తుకు అన్వయించి చూసుకు న్నాయి. దాంతో ప్రమోటర్ ఈక్విటీ తక్కువగా ఉన్నా, ప్రాజెక్టులకు అధిక లివరేజి ఇచ్చేందుకు సుముఖత చూపాయి. కొన్ని సందర్భాల్లో అవి సొంతంగా జాగ్రత్తగా లెక్కలు వేసుకోకుండానే,  ప్రమోటర్లకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ సమర్పించిన ప్రాజెక్టు నివేదికలను ఆధా రం చేసుకుని రుణాలు ఇచ్చేందుకు సంతకాలు చేసిన మాట కూడా వాస్తవం’’ అని ఆయన అన్నారు. ‘‘అప్పట్లో బ్యాంకులు చేతికి చెక్కుబుక్కు ఇచ్చి అవసరమైన రుణ మొత్తాన్ని వేసుకోవాల్సిందిగా ఎలా కోరిందీ ఒక ప్రమోటర్ నాకు వివరించారు’’ అని రాజన్ చెప్పుకొ చ్చారు. నిర్హేతుక ఉత్సాహ, ఉద్వేగాలకు అదొక చారిత్రక ప్రతీక. ఆనాటి చక్రభ్రమణంలో అటువంటి దశలో మరి కొన్ని దేశాల్లో కూడా ఆ విధమైన ధోరణి చోటుచే సుకుందని ఆయన అన్నారు. ఊహించిన విధంగా వృద్ధి దురదృష్టవశాత్తు ఎల్లప్పుడూ చోటుచేసుకోదు. ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ముందు పటిష్టమైన ప్రపంచ ఆర్థిక వృద్ధి కొద్ది ఏళ్లు కనిపించింది.  ఆయితే, ఆ వృద్ధి తర్వాత సంక్షోభానికి ముందే మందమనం కూడా చోటుచేసుకుందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో మరింత మమేకమైన ఇండియాకు కూడా అది పాకిందని రాజన్ అన్నారు. 

లోపించిన శ్రద్ధాసక్తులు
దేశంలో డిమాండ్ మందగిస్తున్న కొద్దీ వివిధ ప్రాజెక్టులలో చూపిన పటిష్టమైన డిమాండ్ అవాస్తవి కమైనదిగా క్రమేపీ అవగతమైంది. ప్రమోటర్, బ్యాంకర్ ఇద్దరిలోనూ ఆసక్తి లోపించడం కూడా ఎన్.పి.ఏల పెరుగుదలకు కారణమని రాజన్ అన్నారు. ఎన్.పి.ఏల సమస్యలో దుష్కృత్యాలు, అవినీతి పాత్రను ప్రస్తావిస్తూ, ‘‘నిస్సందేహంగా, కొన్నింటిలో అదున్నమాట నిజమే. కానీ, బ్యాంకర్ల అత్యుత్సాహాన్ని, అసమర్థతను, అవినీ తిని వేరుగా చూపడం కష్టం’’ అని ఆయన అన్నారు. ‘‘బ్యాంకర్లు మితిమీరిన విశ్వాసంతో వ్యవహరించారనేది స్పష్టం. ఈ రుణాలలో కొన్నింటి విషయంలో వారు  నామమాత్రపు పరిశీలన మాత్రమే జరిపి ఉంటారు. చాలా మంది స్వతంత్ర విశ్లేషణ చేయలేదు. ఆ ప్రాథమి కమైన పనుల విషయంలో వారు ఎస్.బి.ఐ క్యాప్స్, ఐ.డి.బి.ఐలపై అతిగా ఆధారపడ్డారు. అటువంటి విశ్లేషణ ఔట్‌సోర్సింగ్ వ్యవస్థలో ఉన్న ఒక బలహీనత. అనుచిత ప్రభావానికి అది అవకాశాలు చాలా పెంచేస్తుంది’’ అని ఆయన ఆ నోట్‌లో పేర్కొన్నారు.

ఎన్.పి.ఏలకు అడ్డుకట్ట 
నిరర్థక ఆస్తుల సమస్య బ్యాంకింగ్ రంగంలో పునరావృత్తం కాకుండా నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలనను మెరుగుపరచడం ఒకటిగా ఆయన తెలిపారు. ప్రాజెక్టు మూల్యాంకనం, పరిశీలన ప్రక్రియను కూడా చక్కదిద్దుకోవాలన్నారు. రికవరీ ప్రక్రియను పటిష్టపరచాలని కోరారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులను దూరం చేయాలన్నారు. రాజన్ ఎన్.పి.ఏల సంక్షోభాన్ని గుర్తించి, దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ప్రశంసించిన తర్వాత, అంచనాలపై పార్లమెంట్ కమిటీ తమకు విషయ నివేదన చేయవలసిందని రాజన్‌ను ఆహ్వానించింది. రఘురామ్ రాజన్ 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్ళపాటు ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు. ప్రస్తుతం షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు.

English Title
'There is a lot of dilemma involved'
Related News