మూడోసారి ముష్కర దాడి

Updated By ManamTue, 02/13/2018 - 22:26
jammu
  • భగ్నం చేసిన భద్రతా సిబ్బంది

  • ఉగ్రవాదులు పరార్.. గాలింపు

  • ‘రెండో దాడి’లో ఇద్దరు హతం

  • సుంజవాలో ఆపరేషన్‌కు తెర

  • జమ్ములో భారీ సెర్చ్ ఆపరేషన్

jammu-camp-danoaజమ్ము/శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో మంగళవారం కూడా మరో ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. తక్షణం భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి ఎదురు దాడి చేయడంతో ముష్కరులు పరారయ్యారు. వరుసగా నాలుగు రోజుల వ్యవధిలో సైనిక శిబిరాలపై మూడో దాడి జరగడం గమనార్హం.  శనివారం సుంజవా ఆర్మీ క్యాంపు.. సోమవారం శ్రీనగర్ సీఆర్పీఎఫ్ క్యాంపులపై దాడికి దిగిన ఉగ్రవాదులు మంగళవారం జమ్ము-అఖ్‌నూర్ రహదారిలోని డోమన సైనిక శిబిరంపై తెగబడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో రెండు మోటార్ సైకిళ్లపై భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు ఆర్మీ క్యాంపును సమీపించారు. అక్కడ పహారా ఉన్న సెంట్రీ పోస్ట్‌పై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పలకు దిగాయి. దీంతో ముష్కరులు అక్కడి నుంచి పారిపోయారు. వారిని పట్టుకునేందుకు సైనికులు రంగంలోకి దిగారు. మరోవైపు సైనిక శిబిరాలపై వరుస దాడులతో ఆర్మీ అప్రమత్తమైంది. జమ్ము కశ్మీర్‌లో హై అలర్ట్ విధించింది. జమ్ము మొత్తం భారీ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఇదిలా ఉండగా సోమవారం శ్రీనగర్‌లోని కరణ్ నగర్ ప్రాంతంలో గల సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడికి యత్నించి సమీపంలోని భవనంలో నక్కిన ఇద్దరు ముష్కరులను సైనికులు హతమార్చారు. ఈ ఘటనలో ఓ జవాను మరణించగా మరొకరికి గాయాలయ్యాయి. కాగా, మరణించిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందిన వారన్నది ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

సుంజవాలో మరో జవాను మృతదేహం
జమ్ములోని సుంజవా క్యాంపుపై జరిగిన ఉగ్రదాడిలో మరో జవాను అమరుడయ్యాడు. ఈ దాడిలో ఇప్పటికే ఐదుగురు సైనికులు సహా ఓ పౌరుడు మరణించగా.. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. శనివారం సైనిక శిబిరం వద్దనున్న క్వార్టర్స్‌పై దాడిచేసిన జైషే ఉగ్రవాదుల ఏరివేత సోమవారం ఉదయానికే ముగిసినప్పటికీ ఎవరైనా మిగిలి ఉన్నారేమోన్న అనుమానంతో సైనికులు లోపలంతా జల్లెడ పట్టారు. క్వార్టర్స్‌లో నక్కిన ముష్కరులను ఎదుర్కొనే క్రమంలో లోపల మరో జవాను ప్రాణాలు కోల్పయినట్లు ఈ సెర్చ్ ఆపరేషన్‌లో గుర్తించారు. క్యాంపు, క్వార్టర్స్‌లో అణువణువూ గాలించిన సైనికులు మంగళవారం ఆపరేషన్‌ను ముగించారు. ఈ దాడిలో మరణించిన సైనికుల సంఖ్య ఆరుకు చేరిందని లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. వీరిలో ఐదుగురు వీర జవాన్లు జమ్ము కశ్మీర్‌కు చెందిన వారు ఉన్నారన్నారు. శ్రీనగర్ విమానాశ్రయంలో వీరికి సీఎం మెహబూబా ముఫ్తీ అశ్రు నివాళి అర్పించారు. అనంతరం అన్ని మృతదేహాలను అంత్యక్రియల నిర్వహణ కోసం వారి స్వస్థలాకు పంపారు.
 

English Title
The third time the Mushthala attack
Related News