నైటీ వేసుకొని బయటకొస్తే ఖబడ్దార్...

Updated By ManamFri, 11/09/2018 - 16:00
Thokalapalle village elders ban nights in daytime
Thokalapalle village elders ban nights in daytime

‘నైటీ’ ఆ పేరులోనే ఉంది... నైట్ వేర్ అని. ఇవి మహిళలకు సౌకర్యంగా ఉండటమే అధిక ఆదరణ పొందుతున్నాయి. అయితే కాలక్రమేణా... రాత్రి పూట ధరించే ఈ నైటీలు ...పగలు, రాత్రి తేడా లేకుండా వేసుకుంటున్నారు. అయితే గతంలో నైటీ వేసుకునే వాళ్లు ...తమ ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యేవారు. 

మరి ఇప్పుడూ.. వాటితోనే మహిళలు రోడ్డు మీదకు వచ్చేయడం, సమీప దుకాణాలకు రావడం, పిల్లలను స్కూల్ బస్సుల వద్దకూ దించడం... ఇలా ఒకటేంటీ... అన్నిటికీ నైటీతోనే ...బయటకు వచ్చేయడం కామన్ అయిపోయింది. ఇక మహిళకు నైటీ సౌకర్యంగా ఉన్నప్పటికీ.. చూసేవాళ్లకు మాత్రం ఇబ్బందిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే మహిళలు నైటీలు వేసుకునే విషయంలో ఆంక్షలు పెట్టడంపై కొందరు సమర్థిస్తుంటే... మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నైటీలు ధరించడం నేరమా?, ఘోరమా? ఇదేమీ విడ్డూరం అని ప్రశ్నిస్తున్నారు.

కొన్ని దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో ముఖాలకు స్కార్ఫ్‌లు ధరించడం నేరం. అలాగే మన దేశంలోకి వస్తే గతంలో కొన్ని ముస్లిం సంఘాలు... ఆడవాళ్లు జీన్స్ ధరించకూడదని ఫత్వాలు కూడా జారీ చేశారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో  పగటి వేళల్లో ‘నైటీ’ ధరించరాదని ఆంక్షలు విధించడమే కాదు. కులపెద్దలు విధించిన ఆ నిబంధన అతిక్రమిస్తే జరిమానా కూడా కట్టాల్సిందే. ‘నైటీ’పై ఆంక్షలు ఎందుకో తెలుసుకుందామా?.

డే టైమ్‌లో ‘నైటీ’ ధరిస్తే...
వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలో మహిళలు పగటిపూట నైటీలు ధరించి ఇళ్ల నుంచి బయటకు వస్తే ఫైన్ కట్టాల్సిందే. ఒకవేళ పొరపాటున నైటీలతో బయటకు వస్తే... వంద, రెండొందలు కాదూ...ఏకంగా రూ.2000 జరిమానా చెల్లించుకోవాల్సిందే. అంతేకాదండోయ్... ఒకవేళ డే టైమ్‌లో నైటీలు వేసుకున్న వారిని చూపిస్తే...వారికి రూ.1000 బహుమతిగా కూడా ఇస్తారట. 

అంతేకాదు ఈ నిర్ణయాన్ని ఎవరైనా ధిక్కరిస్తే ...గ్రామ బహిష్కరణకు సైతం వెనకాడేది లేదని కుల పెద్దలు హెచ్చరికలు చేశారు. ఇందుకోసం గ్రామంలో దండోరానే కాకుండా, మైక్ ద్వారా ప్రచారం కూడా చేయించారు. గత ఆరు నెలలుగా ఈ పద్ధతి ఇక్కడ కొనసాగుతోంది. ఎట్టకేలకు ఈ విషయం కాస్త...అధికారుల చెవిన పడటంతో రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ...గ్రామంలో విచారణ చేపట్టారు. 

అయితే కుల పెద్ద మాత్రం ...తమ నిర్ణయం సరైనదేనని, ఇతర మహిళలు ఇబ్బంది పడుతున్నారనే...తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్థించుకున్నారు.   కుల పెద్దలు తీర్మానానికి  అందరూ కట్టుబడి ఉండాలనే జరిమానా అని హెచ్చరించామే కానీ, ఇప్పటివరకూ ఎవరికీ ఫైన్ వేయలేదన్నారు. ఇక గ్రామ బహిష్కరణ అనేది కూడా తాము ఎక్కడా అనలేదని తెలిపారు.

English Title
Thokalapalle village elders ban nights in daytime
Related News