హ్యాట్రిక్‌కు వేళాయే.. (స్పెష‌ల్ ఆర్టిక‌ల్‌)

Updated By ManamMon, 04/02/2018 - 19:53
article

articleతెలుగు ప‌రిశ్ర‌మ‌లోకి ప్ర‌తీ సంవ‌త్సరం చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో కొత్త ద‌ర్శ‌కులు అడుగు పెడుతూ ఉంటారు. అయితే వారిలో కొంద‌రు మాత్ర‌మే మొద‌టి అడుగులో విజ‌యం సొంతం చేసుకుంటారు. అలా విజ‌యం సాధించిన ద‌ర్శ‌కుల‌లో.. అతి కొద్దిమంది మాత్ర‌మే ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగ‌మించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ న‌మోదు చేసుకుంటారు. అలా రెండు వ‌రుస విజ‌యాల‌తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్లుగా పేరుతెచ్చుకున్న ఓ న‌లుగురు యువ ద‌ర్శ‌కులు ఈ ఏడాదిలో హ్యాట్రిక్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. వారి వైపు కాస్త‌ దృష్టిసారిస్తే..

మేర్ల‌పాక గాంధీ

merlapaka gandhiర‌చ‌యిత మేర్ల‌పాక ముర‌ళి త‌న‌యుడిగా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన మేర్ల‌పాక గాంధీ.. 'వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌'(2013)తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగు వేశారు. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సొంతం చేసుకున్న ఈ యువ నిర్దేశ‌కుడు.. రెండో ప్రాజెక్ట్ విష‌యంలో ఆచితూచి అడుగులు వేశారు. అలా.. 'ఎక్స్‌ప్రెస్ రాజా'(2016)తో రెండోసారి ప్రేక్ష‌కుల ముందుకువ‌చ్చిన గాంధీకి మ‌రో హిట్ ద‌క్కింది. ప్ర‌స్తుతం ఈ యంగ్ డైరెక్ట‌ర్‌.. వ‌రుస విజ‌యాల‌తో దూకుడు మీదున్న నానితో త‌న మూడో సినిమా చేస్తున్నారు. 'కృష్ణార్జున యుద్ధం' పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా.. ఈ నెల‌ 12న విడుద‌ల కానుంది. తొలి రెండు ప్ర‌య‌త్నాల‌లో విజ‌యం సాధించిన మేర్ల‌పాక గాంధీకి మూడో ప్ర‌య‌త్నం ఎంత‌వ‌ర‌కు క‌లిసొస్తుందో చూడాలి.

క‌ల్యాణ్ కృష్ణ‌

kalyan krishnaనాగార్జున లాంటి అగ్ర క‌థానాయ‌కుడితో తొలి సినిమా చేసే అవ‌కాశం ద‌క్కించుకోవ‌డ‌మే కాకుండా.. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం అందుకున్నారు యువ ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ‌. 'సోగ్గాడే చిన్ని నాయనా'(2016)తో ఈ ఫీట్ సాధించిన క‌ల్యాణ్‌.. రెండో ప్ర‌య‌త్నంలో కూడా స‌క్సెస్ అయ్యారు. నాగ్ త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌తో ఆయ‌న రూపొందించిన ఆ చిత్ర‌మే 'రారండోయ్ వేడుక చూద్దాం'. గత ఏడాది వేస‌వికి విడుద‌లైన ఈ సినిమాతో ద్వితీయ విఘ్నాన్ని అధిగ‌మించారీ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం త‌న మూడో చిత్రాన్ని ర‌వితేజ‌తో 'నేల టిక్కెట్టు'గా తెర‌కెక్కిస్తున్నారు క‌ల్యాణ్‌. ఈ చిత్రం మే 24న తెర‌పైకి రానుంది. మొద‌టి రెండు సినిమాల‌తో విజ‌యాల‌ను సొంతం చేసుకున్న క‌ల్యాణ్‌.. తాజా చిత్రంతో హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.

చందు మొండేటి

chandu mondeti'కార్తికేయ' (2014) వంటి వైవిధ్య‌మైన చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన చందు మొండేటి.. తొలి ప్ర‌య‌త్నంలోనే ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించారు. అలాగే విజ‌యాన్ని కైవ‌సం చేసుకున్నారు. ఆ త‌రువాత మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన 'ప్రేమ‌మ్' (2016) చిత్రాన్ని త‌నదైన శైలిలో రీమేక్ చేసి.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు స‌క్సెస్‌ను మూట‌గ‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం ఈ యంగ్ డైరెక్ట‌ర్‌.. త‌న రెండో చిత్ర క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌తోనే మూడో సినిమా చేస్తున్నారు. ఆ సినిమానే 'స‌వ్య‌సాచి'. రెండు చేతుల‌ను కూడా స‌మ‌ర్థ‌వంతంగా వాడుకోగ‌ల అర్జునుడిలాంటి ఓ యువ‌కుడి క‌థ‌తో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు చందు. జూన్ 15న సెల్యులాయిడ్‌పైకి రానున్న ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టే దిశ‌గా అడుగులు వేస్తున్నారు చందు.

విరించి వ‌ర్మ‌

virinchiబావా మ‌ర‌ద‌ళ్ళ ప్ర‌ణ‌య క‌థ‌తో 'ఉయ్యాలా జంపాలా'(2013)ని తెర‌కెక్కించి.. తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ‌. ఆ త‌రువాత నానితో 'మ‌జ్ను' (2016) రూపొందించి.. వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. ప్ర‌స్తుతం క‌ల్యాణ్ రామ్‌తో త‌న మూడో చిత్రాన్ని చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు ఈ యంగ్ డైరెక్ట‌ర్‌. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ ఫిల్మ్‌.. ఈ ఏడాది చివ‌ర‌లో తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఇటీవ‌ల కాలంలో రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌, బోయ‌పాటి శ్రీ‌ను, మారుతి, కొర‌టాల శివ‌, అనిల్ రావిపూడి.. ఇలా అతికొద్ది మంది ద‌ర్శ‌కులు మాత్ర‌మే హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకుని వార్త‌ల్లో నిలిచారు. మ‌రి.. ఈ ద‌ర్శ‌కులు కూడా ఆ జాబితాలోకి చేరుతారో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.                                          -మ‌ల్లిక్ పైడి

English Title
time for hattrick hits (special article)
Related News