ఈసారి బాగా సిద్ధపడి వెళ్లాలి

Updated By ManamFri, 09/21/2018 - 23:22
Rahul Dravid
  • ఇంగ్లాండ్ పర్యటనపై రాహుల్ ద్రవిడ్

dravidన్యూఢిల్లీ: ఈసారి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేటప్పుడు బ్యాట్స్‌మెన్ బాగా సిద్ధపడి వెళ్లాలని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియాకు చివరి కెప్టెన్ ద్రవిడ్. ఇటీవల ముగిసిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీ సేన చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొందని ఆయన అన్నారు. ‘మొదట నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇంగ్లాండ్ వాతావరణం ఏమాత్రం బ్యాటింగ్‌కు అనుకూలం కాదు. ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారని అనుకుంటున్నాను. ఈ విషయంలో విరాట్ కోహ్లీని పక్కన పెడితే మిగతా బ్యాట్స్‌మెన్‌కు ఈ సిరీస్ అంత సులువైంది కాదు. నేను కూడా ఇంగ్లాండ్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడాను. అప్పుడు కూడా ఇలాంటి వాతావరణాన్నే ఎదుర్కొన్నాం. కఠినమైన వాతావరణంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడటమనేది ఇంకా కష్టం. అయినప్పటికీ ముందుకు సాగాలి. కానీ ఈసారి ఇంగ్లాండ్‌కు వెళ్లటప్పుడు బ్యాట్స్‌మెన్ బాగా సిద్ధపడాలి. అక్కడి వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. అయినప్పటికీ మన వాళ్లు దాన్ని ఎదుర్కోవాలి’ అని న్యూఢిల్లీ మణిపాల్ హాస్పిటల్ తొలి బ్రాంచ్‌ను ప్రారంభించడంలో భాగంగా ద్రవిడ్ చెప్పారు. 1986లో టీమిండియా తొలిసారి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. తర్వాత 2011లో వెళ్లినప్పుడు ద్రవిడ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 3 సెంచరీలు చేసినప్పటికీ టీమిండియా 0-4తో ఆతిథ్య జట్టు చేతిలో సిరీస్ కోల్పోయింది. ఇక యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్ గురించి మాట్లాడుతూ.. పాకిస్థాన్‌పై మాత్రమే కాకుండా అన్ని జట్లపై టీమిండియా దృష్టిపెట్టాలని అన్నారు. 

English Title
This time you need to prepare well
Related News