నేడు కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

Updated By ManamWed, 09/12/2018 - 00:00
Congress
  • సంగారెడ్డిలో వైునారిటీ ఘరణ

  • హాజరు కానున్న గులాంనబీ ఆజాద్

imageహైదరాబాద్ః కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు మొదలయ్యాయి. పార్టీలో చేరేందుకు పూర్వ కాంగ్రెస్ నేతలతో పాటు టీఆర్‌ఎస్ పార్టీ అసమ్మతినేతలు కూడా క్యూ కట్టారు. ప్రతిరోజు ఎవరో ఒకరు పార్టీలో చేరుతున్నారు. బుధవారం గాంధీభవన్ తో పాటు సంగారెడ్డిలో జరిగే మైనారిటీ గర్జన సభలో పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్ సమక్షంలో భారీ సంఖ్యలో చేరికలు ఉన్నాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి,అదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ నేత రమేష్ రాథోడ్, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వ్యాపారి అనిరుధ్ రెడ్డి, నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్  బాలూనాయక్, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, ఇబ్రహీంపట్నంకు చెందిన కంచర్ల చంద్రశేఖరరెడ్డి, తాండూరుకు చెందిన పైలెట్ రోహిత్ రెడ్డి  కాంగ్రెస్‌లో చేరిక ఖరారైంది. చేవెళ్లకు చెందిన మాజీ మంత్రి ఎస్‌కే రత్నం పార్టీలో చేరేందుకు సన్నద్ధం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కూడా మాట్లాడారు.

ఈ విషయం తెలిసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయన చేరికను వ్యతిరేకించారు. రత్నంను పార్టీలో చేర్చుకుంటే తనకు అభ్యంతరం లేదని,టికెట్ మాత్రం ఇవ్వొద్దని సూచించారు. తన సమక్షంలో చేరిన రిటైర్డ్ అదనపు ఎస్పీ ఎం యాదయ్యకు టికెట్ ఇవ్వాలని సబితా రెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం.  అదే విధంగా పటాన్‌చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కూడా పార్టీలో చేరేందుకు టీపీసీసీ సంప్రదింపుల కమిటీ  అంగీకరించింది.అయితే, ఆయన చేరికను మాజీ  ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ వ్యతిరేకించినందున ఆయన చేరిక కాస్తా ఆలస్యం కావచ్చు. దామోదరకు నచ్చజెప్పేందుకు ఉత్తమ్, సీఎల్పీ మాజీ నేత కె జానారెడ్డి ప్రయత్నిస్తున్నారు.

వారి ప్రయత్నాలు సఫలమైతే సంగారెడ్డి గర్జన సభలో నందీశ్వర్ గౌడ్ చేరుతారు. సంగారెడ్డిలో డీఎస్, భూపతి రెడ్డి ఇతర నేతలు చేరుతున్నారు. గాంధీభవన్‌లో జరిగే కార్యక్రమంలో అనిరుధ్ రెడ్డి చేరనున్నారు. ఇదిలా ఉండగా, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డిని ఒక కేసుకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడంతో సంగారెడ్డి మైనారిటీ గర్జన సభ వాయిదా పడుతుందని అనుకున్నారు.అయితే, జగ్గారెడ్డి సతీమణి నిర్మల సభను నిర్వహించడానికి ముందుకు రావడంతో సభ యధావిధిగా జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.

కొండా దంపతుల చేరిక వాయిదా...
తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఆమె భర్త,ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యక్రమం వాయిదా పడింది. ఇటీవల సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో కొండా సురేఖ నేరుగా రాష్ట్ర మంత్రి కె తారకరామారావుపై విమర్శలు గుప్పించారు. తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని సవాల్ చేశారు. టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ నెల 23 వరకు ఏదో ఒక విషయం చెప్పాలని టీఆర్‌ఎస్ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. తాము స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినా గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేశారు. కొండా దంపతుల చేరికకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, టీఆర్‌ఎస్ స్పందన చూసి తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తామని కాంగ్రెస్ నేతలకు చెప్పారు. 23 తర్వాత ఏ క్షణంలోనైనా వారు కాంగ్రెస్ లో చేరేఅవకాశం ఉంది.

ఆజాద్ పర్యటన వివరాలు...
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గులాం నబీఆజాద్ బుధవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్ క్రిష్ణ హోటల్ కు వెళతారు. అక్కడి నుంచి గాంధీభవన్‌లో జరిగే ముఖ్యనేతల సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత విలేఖరుల సమావేశంలో మాట్లాడుతారు. అనంతరం గాంధీభవన్‌లో ప్రాంగణంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో పార్టీలో చేరనున్న వివిధ పార్టీల  నేతలకు ఆహ్వానం పలుకుతారు.

English Title
Today's massive inclusions in Congress
Related News