తెలుగు సాహిత్యంలో నేటి కవిత్వం

Updated By ManamMon, 04/16/2018 - 01:02
image

imageతెలుగు సాహిత్యంలో కవిత్వానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో కవులు వారి పదునైన కవిత్వంతో ప్రజలను చైతన్య పరిచారు. మరికొంత మంది కవులు భావకవిత్వాన్ని మన హృదయాలలో నాటి వెళ్లారు. ఇప్పటికీ ఆ కవిత్వమే కన్నుల ముందు కదులుతోంది. ఇలా ఆనాటి కవులు ఒక్కొక్కరు ఒకతీరులో కవిత్వం రాసి ప్రజలను మెప్పించారు. కానీ... నేడు సాహిత్యంలోని కవిత్వంలో మాత్రమే ఎందుకు? నాణ్యత రానురాను దిగజారిపోతోంది.

అసలు పలానా వారు కవి అని గుర్తించడం ఎలా? పది వాక్యాలు ఫేస్‌బుక్, వాట్స్‌అప్‌లో రాసేస్తే కవి అయిపోతారా! ఇష్టం వచ్చిన అంశంపై ఇష్టం వచ్చినట్టు రాసేసి అందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు. కనీస విషయ పరిజ్ఞానం లేకుండా రాసే కవిత్వం తెలుగు సాహిత్యాన్ని దిగజారుస్తున్నది. కవులు ఒక సంఘటనను పూర్తి అవగాహన చేసుకొని, ఆ సం ఘటన తాలూకు సమాచారం తెలుసుకొని సుదీర్ఘంగా ఆలోచించి వ్యక్తిగత అభిప్రాయాలు కాకుండా ప్రజలందరికీ మంచి కలిగించే విషయా లను కవిత్వకరించి రాయాలి. మరి నేడు ఇలా రాస్తున్న కవులు ఎంతమంది? ఏదో పత్రిక కోసమో.. లేదా పేరు కోసమో కవిత్వం అని చెత్త రాసేసి ప్రజల నెత్తిన వేసే వారందరూ కవులు ఎలా అవుతారు? నిజానికి కవిత్వం రాయడానికి ఎలాంటి చదువు అవసరం లేదు. మన అను భవాలే మొదట మనల్ని కవిత్వం వైపు నడిపిస్తాయి. ఆ తర్వాత మనం చదివే పుస్తకాలను బట్టి మనం ఎలాంటి కవి అవుతామో తెలుస్తుంది. మొదట ఆ పుస్తకాల ప్రభావం మన పై ఉంటుంది. కానీ మనం అందులో నుండి బయటపడి మన కంటూ శైలి ఏర్పాటు చేసుకోగలగాలి అప్పుడే సాహిత్యంలో కొనసాగగలం. 

మీ కవిత్వం శ్రీశ్రీ లాగ ఉంది, లేదా వేరే ఏ కవితో పోల్చిన కూడా మీ మార్కు కోల్పోతున్నారనే అర్థం. కావున వారిలా ఉంది వీరిలా ఉంది అని ఎవరైనా చెప్ప్తున్నా రంటే! మీరు కవిత్వంలో మీ శైలి ఇంకా ఏర్పాటు చేసుకోలేదనే అర్థం. వెంటనే అందులో నుండి బయటపడి మీకంటూ సొంత గొంతు వెతకండి. మన పూర్వకవులు దాదాపు అన్ని విష యాలపై కవిత్వం రాసే ఉన్నారు వాటినే మనం ఇప్పటి గాను గునంగా కొత్త అభివ్యక్తికరణతో రాయాలి. ఇంకా చాలా మంది మెటాఫర్ కవిత్వం రాస్తున్నారు. ఇలాంటి కవిత్వం ఎప్పటికి సాధారణమైన ప్రజలకు చేరువ కాదు. దీనివల్ల సదరు కవులకు అవార్డ్స్, రివర్డ్స్ వస్తాయేమో కానీ ప్రజాకవి ఎప్పటికి కాలేరు. నేను గమనించినంత వరకు సాధారణమైన పదాలతో అమోఘమైన కవిత్వం రాస్తున్న డా. ఎన్ గోపి కవిత్వం ప్రజలకు చేరువవుతుంది. ఆయన రాసిన బొంత, రొట్టె కవితలు చూడండి తీసుకున్న కవితా వస్తువులు కొత్తవి. అలతి పదాలతో రాసిన కవిత్వం అమోఘమనే చెప్పాలి. లోతైన ఎవరికీ అర్థం కానీ ప్రతీకలతో కవిత్వం రాసేవారు కవిత్వాన్ని సాధారణమైన ప్రజలకి దూరం చేస్తున్నా రనే చెప్పుకోవాలి. ఇకపొతే కవి ఒక విషయంపై కవిత రాయాలంటే! కవి ఆలోచనలు కనీసం వందసార్లు చనిపోయి మళ్ళీ బతకాలి అప్పుడే గాఢమైన కవిత్వం వస్తుంది. 

కవిత్వ పుస్తకాలు ఎందుకు మార్కెటింగ్ జరగడం లేదు అంటే కవిత్వంలో కుకవుల సంఖ్య రోజురోజుకి పెరిగి పోతోం  ది. వేల కవిత్వ పుస్తకాలు వస్తున్నాయి. అందులో ఎవరు బాగా రాశారో సాధారణమైన రీడర్‌కి ఎలా తెలుస్తుంది? ఒక కవి కవితలు రాసి వాటిని సంకలన రూపంలో తీసుకువస్తే ఆ పుస్తకాన్నిసాహితీ సంస్థలు గుర్తించి ఎలాంటి కుల, మత, ప్రాంత, వివక్ష లేకుండా అవార్డు ఇస్తే అప్పుడు కొందరికైనా ఆ పుస్తకం విలువ తెలిసి కొంటారు. మరి నేడు సాహితీ సంస్థలు అలా చేస్తున్నాయా? వారి జిల్లా అనో వారి కులం అనో లేదా మరికొంతమంది డబ్బు తీసుకొని అవార్డ్స్ ఇస్తున్నారు. ఇలానే కొనసాగితే సరైన కవిత్వం రాసేవారు పరిస్థితి ఏమిటి? సీని యర్ కవులకు ఎలాంటి ఇబ్బంది లేదు.  సాహిత్యం పేరుతో కొందరు పురుషపుంగవులు మహిళా కవియిత్రులను మానసి కంగా నీచమైన మాటలతో వేధిస్తున్నారని తెలిసింది. ఓ కవ యిత్రి నీవు నోరు మెదపకుంటే నీకే కాదు నీ తోటి స్త్రీ జాతికి కూడా అన్యాయం చేస్తున్నావని అర్థం. మొత్తం మీద చెత్త కవి సమ్మేళనాలు బహిష్కరించండి. వీలైతే కాస్తా మంచి కవిత్వాన్ని అందించి సాహిత్యాన్ని మరో మెట్టుపైకి చేర్చండి కాని పాతాళంలో పడేయకండి. సొంత పేరు కోసం పాకులాడే చెత్త సాహితీ సంస్థలు నిర్వహించే సభలకు వెళ్లి మీ గౌరవాన్ని దిగజార్చుకోకండి. 
- విరాజిత (నిజాగ్ని),
9700747280

English Title
Today's poetry in Telugu literature
Related News