పర్యాటకం అంతంతే!

Updated By ManamSun, 04/15/2018 - 23:21
image
  • ఈవెంట్లకు స్పందన లేమి

  • ఆశించిన మేర రాని ఫలితాలు

  • వసతులు.. ప్యాకేజీల కొరత

  • వేడుకలకు బదులు వీటిపై దృష్టి

  • పర్యాటకులను పెంచే మార్గమిదే!

imageవిశాఖపట్నం: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం నిత్యం ఏదో ఒక సాంస్కృతిక, పర్యాటక వేడుకను నిర్వహిస్తున్నా.. నిరాశే ఎదురవుతోంది. ఆ వేడుకలతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. పర్యాటకులను ఆకర్షించి వారి సంఖ్యను పెంచడంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతోంది. ముఖ్యంగా విశాఖలో పర్యాటక శాఖ ప్రయోగాలు ఫలిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఏడాది 15 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసి నిర్వహించిన విశాఖ ఉత్సవ్, సౌండ్ ఆఫ్ శాండ్స్, అరకు బెలూన్ ఫెస్టివల్, యాటింగ్ ఫెస్టివల్ వంటివి పర్యాటక రంగానికి ఆదాయాన్ని పెంచే దిశగా ఉపయోగపడలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వేడుకలతో పర్యాటకుల సంఖ్య ఆశించినంతగా పెరగలేదని టూరిస్టు ఆపరేటర్లు పేర్కొంటున్నారు. సింహాచలం దేవస్థానం, అరకు, బొర్రా గుహలు, లంబసింగి, ఆర్‌కే బీచ్, సబ్‌మెరైన్ మ్యూజియం, రుషికొండ వంటి ఎన్నో పర్యాటక ఆకర్షణ కేంద్రాలున్న విశాఖకు ఉత్సవాల ప్రభావంతో భారీగా పర్యాటకులు వస్తారని ప్రభుత్వం ఆశించింది. కానీ సరైన ప్రణాళిక లేకుండా, పర్యాటకుల అవసరాలు, ఇష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈవెంట్లను నిర్వహించడం వల్లే సరైన ఫలితాలు రాలేదని కొందరు అధికారులు చెబుతున్నారు. మూడు కోట్ల రూపాయలతో నిర్వహించిన మూడు రోజుల అరకు బెలూన్ ఫెస్టివల్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఒక్కరోజే సవ్యంగా సాగింది. ఇక రెండు కోట్లతో బీచ్‌లో ఏర్పాటు చేసిన సౌండ్స్ ఆఫ్ శాండ్ తుఫానుకు కొట్టుకుపోయింది. ఇక  విదేశీ పడవలతో చేస్తామన్న యాటింగ్ ఫెస్టివల్‌కు వచ్చిన పర్యాటకులు కేవలం 84 మందే. దీని ఖర్చు మాత్రం మూడు కోట్లు. అయితే, ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థ తమకు నాలుగున్నర కోట్లు ఖర్చు అయిందంటూ బిల్లులు పెట్టడం గమనార్హం. అయితే యాటింగ్ ఫెస్టివల్‌కు కూడా వాతావరణ అనుకూలించక అస్తవ్యస్తంగా సాగిన విషయం తెలిసిందే. 

వసతుల లేమిపై దృష్టిపెట్టాలి
ఈ నేపథ్యంలో పర్యాటక వేడుకల నిర్వహణకు బదులుగా ఇప్పటికే ఉన్న పర్యాటక ప్రాంతాల్లో వస తుల లేమిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అరకు, బొర్రా గుహలు, లం బసింగి, ఆర్‌కే  బీచ్ వంటి చోట్ల పర్యాటకులకు వస తులు అంతంత మాత్రంగానే ఉన్నాయని చెబు తున్నారు. లంబసింగిలో రాత్రిపూట బసచేసే ఏర్పాట్లే లేవు. అరకు, బొర్రా తదితర ప్రాంతాల్లో మౌళిక సదు పాయాలను మెరుగుపర్చాల్సి ఉంది. వీటిని మెరు గుపరిస్తే పర్యాటకులు ఎక్కువ సమయంలో ఇక్కడ గడిపే అవకాశం ఉంటుందని, అలాగే పర్యాటకుల సం ఖ్య గణనీయంగా పెరుగుతుందని టూర్ ఆపరేటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక విశాఖలోని పర్యాటక ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చేవారి కోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా అంతంత మాత్రంగా నే ఉన్నాయి. 15  సంవత్సరాల క్రితం ప్రారంభించిన సిటీ టూర్, బొర్రా అరకు టూర్‌లు తప్ప పర్యాటక శాఖ ప్రత్యేకంగా ప్రారంభించిన కొత్త ప్యాకేజీలేమీ లేవని విమర్శలు వస్తున్నాయి. వీటిపై మరింత కసరత్తు జరగాలని పర్యాటకులు సూచిస్తున్నారు.

English Title
Tourism
Related News