మేధావుల మద్దతు కోరుకుంటున్న తెరాస

Updated By ManamTue, 09/11/2018 - 01:20
trs
  • దళారీ, అవినీతి, కమీషన్ల కల్చర్‌కు చరమగీతం..

  • లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలు అందిస్తున్నాం

  • ఎంతో చేశాం, ఇంకెంతో చేయాలనుకుంటున్నాం

  • అందుకే ముందస్తు ప్రజాతీర్పు కోరుతున్నాం

  • తెరాస సీనియర్ల మనోగతం

trsహైదరాబాద్: కాంగ్రెస్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడం కోసం ముందస్తు ఎన్నికలకు తెరలేపిన తెరాస నాయకత్వం తెలంగాణలోని బుద్ది జీవుల మద్దతు కోరుకుంటోంది. ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధిని, అమలు జరిపిన సంక్షేమాన్ని గుర్తించాలని కోరుతోంది. నీళు, నిధులు, నియామకాల ఎజెండాతో ముందుకు సాగుతున్న తెరాస ప్రభుత్వం ఆశించిన మేరకు ప్రగతిని సాధించిందని చెప్పుకుంటోంది.  ప్రభుత్వంపై కాంగ్రెస్ అసత్య ప్రచారం అట్టడుగు వర్గాలకు చేరక ముందే ప్రజల మద్దతు కోరడం ద్వారా అడ్డుకట్టవేయడం తెరాస వ్యూహంగా చెప్పుకుంటున్నారు.

దళారీ, అవినీతి, కమీషన్ల కల్చర్‌కు చరమగీతం
తెరాస పాలన దళారీ వ్యవస్ధకు చరమగీతం పాడింది. కమీషన్ల వ్యవస్ధకు తావు లేకుండా చేసింది. ప్రభుత్వ రంగంలో దాదాపు 80 వేల ఉద్యోగాలు ఇప్పించ గలిగింది. ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించింది. సాగునీటి రంగంలో విప్లవాత్మకమైన కార్యాచరణ అమలు జరుపుతుంది. నిరంతర విద్యుత్‌తో వ్యవసాయ, పారిశ్రామి రంగానికి అండగా నిలిచింది. రైతు బంధు పథకంతో రైతులకు నేరుగా నగదు అందచేసింది. రైతు బీమా పథకంతో భరోసా  కల్పించే ప్రయత్నం చేస్తుంది. మిషన్ భగీరథతో ఇంటింటికి రక్షిత మంచినీరు అందించబోతుంది. ఇప్పటికే తెలంగాణలోని  గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో జరిగిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది.  ఉద్యోగులు, ఉపాధ్యాయలు, నిరుద్యోగుల విషయంలో నిర్మాణాత్మకంగా చర్యలు చేపట్టింది.  ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడం, ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ఆకర్శించి ఉత్పాదన, ఉద్యోగావకాశాలను మెరుగు పర్చడం జరిగింది,   గత 30 సంవత్సరాల్లో చేయలేని పనులను నాలుగున్నర ఏళ్ల కాలంలో చేసి చూపించింది. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఇలాంటి ఆగడాలు మరింత ముదరక ముందే బుద్దిమంతులైన ప్రజల తీర్పు కోరాలని భావించాము అని తెరాస సీనియర్ నేత ఒకరు తెలియచేశారు. 

అవినీతి, అక్రమార్జనకు తావులేని పాలన 
తెరాస పాలనలో  ప్రజా ప్రతినిధుల స్ధాయిలో అవినీతి, అక్రమార్జనకు తావు లేకుండా పోయింది. తెరాస  ప్రజా ప్రతినిధులు అధికారంలో ఉన్నంత కాలం ప్రజా సేవ చేయడం తప్ప సంపాదించుకుంది ఏమీ లేదు. కొందరి ఆస్తులు  తరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. మిమ్మల్నందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడంతో ఎమ్మెల్యేలు ఎంతో నిజాయితిగా ప్రజా సేవ చేస్తున్నారు. అందుకే తిరిగి ప్రభుత్వం  ఏర్పాటు చేయగలమనే ధీమాతో ఉన్నాము. మాకు కాంగ్రెస్ పార్టీ పోటీ కానేకాదు. విపక్షాలు తెరాసకు దరిదాపుల్లో కూడా లేవు అని సీనియర్లు అంటున్నారు.  తెరాస సీనియర్లు ఇష్టాగోష్టి చర్చల్లో రాజకీయ పరిణామాలపై ఆసక్తికరమైన చర్చలకు తెరలేపుతున్నారు. ప్రభుత్వం చేసిన ప్రకటనల అమలులో కొంత జాప్యం, అవాంతరాలు ఏర్పడినప్పటికీ  చిత్తశుద్దిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పాలకులు అధికారంలో ఉండగా తెలంగాణకు చేసిన అన్యాయాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు. ఆస్తులు కూడగట్టుకోవడం, కమీషన్ల కోసం కక్కుర్తి పడటం, దళారీ వ్యవస్ధను ప్రోత్సహించడం, అక్రమాలు, అవినీతిలో కూరుకుపోయింది తప్ప సాధించిందేమిటని ప్రశ్నిస్తున్నారు. తెరాస హయాంలో  సంక్షేమ పథకాలన్ని పారదర్శకంగా ఎమ్మెల్యేల జోక్యం లేకుండా అమలు కావడంతో కీర్తంతా ప్రభుత్వానికే దక్కిందన్నారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు అతీతంగా అర్హత గల వారందరిని ఎంపిక చేయడంతో స్దానికంగా ప్రజా ప్రతినిధులపై పెద్దగా విమర్శలు లేవంటున్నారు. లబ్ధిదారులను గుర్తించడం, ప్రభుత్వ నగదు ప్రయోజనాలను అర్హులకు చేరవేయడంలో మధ్యవర్తుల ప్రమేయం లేక పోవడంతో అవినీతికి తావు లేకుండా పోయిందన్నారు. ధళారులకు పని లేకుండా పోయిందంటున్నారు.   అవినీతి, అక్రమాలకు తావు లేకుండా అబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలను అందచేయ గలిగింది. కల్యాణలక్ష్మి, వృద్దాప్య, ఒంటరి మహిళ, వికలాంగుల పింఛన్లను అర్హులకు నేరుగా అందచేస్తున్నాము. హస్టల్ విద్యార్ధులకు సన్న బియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్నాం అని తెలిపారు. చేసిన పనులు చెప్పుకోవడంతోనే గెలుపు దిశగా ముందుకు సాగాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని పేర్కొంటున్నారు.

తెరాస పాలనను మళ్ళీ కోరుకుంటున్నారు 
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారీ వ్యవస్థ మళ్లీ పుట్టుకొస్తుంది. పైరవీకారుల హవా జోరందుకుంటుంది, కమీషన్లకు కక్కుర్తి పడే నాయకుల సంఖ్య పెరిగిపోతుంది. ఆవురావురుమంటున్న కాంగ్రెస్ నాయకులు దోచుకోవడం తప్ప మరేమి మిగలదు అని సీనియర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందనే వాదనతో పలువురు తెరాస సీనియర్లు అంగీకరిస్తునే తెరాస అధికారంలోకి రాకుండా అడ్డుకునే బలం మాత్రం ప్రతిపక్షాలకు లేదన్నారు. ముఖ్యమంత్రి ఎంతో భరోసాతో 105 మందితో అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు, అందరిని గెలిపించుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటున్నారు.  పోటీ చేసిన వారంతా గెలుస్తారని భావించలేము, అలాగని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కలలో కూడా అనుకోవడం లేదు. కాంగ్రెస్‌ను భరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు, తెలంగాణలో తెరాస పాలనను కోరుకుంటున్నారు అని అన్నారు.

Tags
English Title
TRS which wants to support the scholars
Related News