ఫైనల్‌కు చేరిన యువ భారత్

Updated By ManamTue, 01/30/2018 - 18:21
under19cricketer
  • శుభ్‌మన్ గిల్ అజేయ సెంచరీ

  •  ఇషాన్ పోరెల్‌కు 4 వికెట్లు

  • సెమీఫైనల్లో పాకిస్థాన్ ఘోర పరాజయం

  •  శనివారం ఆస్ట్రేలియాతో తుదిపోరు

under19cricketerక్రైస్‌చర్చ్: ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను యువ భారత్ మరోసారి నిర్దాక్షిణ్యంగా చితగ్గొట్టింది. మంగళవారమిక్కడ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇండియా 203 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. దీంతో శనివారం జరగనున్న ఫైనల్లో ఇండియా, ఆస్ట్రేలియా జట్లు టైటిల్ కోసం తలపడతాయి. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ అజేయ సెంచరీ (102) చేశాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన యువ టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేయగా.. తర్వాత పాకిస్థాన్ 69 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్ పోరెల్ 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్‌కు అతి స్వల్ప స్కోరు. ఇండియా ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బౌలర్లు ముమ్మద్ ముసా (4/67), అర్షద్ ఇక్బాల్ (3/51) ఇండియా మిడిలార్డర్‌ను దెబ్బ తీశారు. అయితే గిల్ తన సెంచరీతో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. అండర్-19 వన్డేల్లో గిల్ 50కిపైగా పరుగులు చేయడం వరుసగా ఇది ఆరోసారి. సెమీఫైనల్లో గెలవాలంటే పాకిస్థాన్ జట్టు శక్తికిమించి పోరాడాల్సివుండింది. ఒకవేళ పాక్ గెలిచివుంటే ఇది అత్యుత్తమ లక్ష్య ఛేదన అయ్యేది. కానీ గెలుపు లక్ష్యం పాక్ జట్టుకు కొండలా నిలిచింది. 
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఓపెనర్లు కెప్టెన్ పృథ్వీ షా, మనోజ్ కల్రా మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. షాకు రెండుసార్లు లైఫ్ లభించింది. 24 పరుగుల వద్ద ఉన్నప్పుడు షహీన్ బౌలింగ్‌లో ఒకసారి. 29 పరుగుల వద్ద ఉన్నప్పుడు హసన్ ఖాన్ బౌలింగ్‌లో రెండోసారి జైద్ ఆలమ్ క్యాచ్‌లను చేజార్చాడు. కానీ అర్ధ సెంచరీకి దగ్గరగా వచ్చిన షా దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. తర్వాత శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు దిగాడు. కానీ మూడు ఓవర్ల తర్వాత ముసా బౌలింగ్‌లో మనోజ్ అవుటయ్యాడు. దీంతో 94 పరుగుల వద్ద ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. గిల్ ఎండ్‌లో చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు. దీంతో పాక్ బౌలర్లు మరో ఎండ్‌పై దృష్టి పెట్టారు. అర్షద్ ఇక్బాల్ ఇండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హార్విక్ దేశాయ్, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మలను తక్కువ పరుగులకే పెవిలియన్ పంపాడు. ఇండియా ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకున్నాడు. ఒకవేపు పాక్ బౌలర్లను చిత్తగ్గొడుతూనే దేశాయ్‌తో కలిసి 54 పరుగులు, అనుకుల్ రాయ్‌తో కలిసి 67 పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ముసా బౌలింగ్‌లో రాయ్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయినప్పటికీ నాటకీయ పరిణామాల మధ్య శుభ్‌మన్ సెంచరీ పూర్తి చేశాడు. 99 పరుగుల వద్ద శుభ్‌మన్ ఇచ్చిన క్యాచ్‌ను హస్సన్ చేజార్చడంతో మూడంకెల స్కోరును చేసుకున్నాడు. తీరా చూస్తే అది నో బాల్ అయింది. ఫ్రీ హిట్‌లో మరో రన్ వచ్చింది. ఇండియా ఇన్నింగ్స్ చివర్లో పాకిస్థాన్ క్రికెటర్లు మరింత ఒత్తిడికి లోనయ్యారు. పేలవమైన ఫీల్డింగ్‌తో అందరూ చిరాకు పడ్డారు. పాక్ క్రికెటర్ల మిస్‌ఫీల్డింగ్, నో బాల్స్‌తో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. 
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ క్రికెటర్లను భారత పేస్ బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. శివం మవి ఒక ఎండ్‌లో వరుసగా మూడు మెయిడెన్ ఓవర్లు వేసి ఒత్తిడి పెంచాడు. మరో ఎండ్‌లో ఇషాన్ పోరెల్ వికెట్లు పడగొట్టాడు. జైద్ ఆలమ్, ఇమ్రాన్ షా, అలీ జర్యాబ్‌లను వరుస ఓవర్లలో పెవిలియన్ పంపాడు. దీంతో పాకిస్థాన్ జట్టు 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో తీవ్ర నిరాశకు గురైంది. తర్వాత పోరెల్ నాలుగో వికెట్‌గా అహ్మద్ ఆలమ్‌ను అవుట్ చేశాడు. తర్వాత స్పిన్నర్ల వంతు వచ్చింది. శివ సింగ్ బౌలింగ్‌లో మహ్మద్ తాహ వెనుదిరిగాడు. శివ రెండు వికెట్లు తీశాడు. తర్వాత రొహైల్ నజీర్‌ను రియాన్ పరాగ్ పెవిలియన్ పంపాడు. తర్వాత హస్సన్, అఫ్రీది కూడా జట్టును ఆదుకోలేకపోయారు. మొత్తంగా పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో సాద్ ఖాన్, మూసా కలిసి తొమ్మిదో వికెట్ 20 పరుగులు చేయడం అత్యుత్తమ భాగస్వామ్యంగా నిలిచింది. శివ బౌలింగ్‌లో మూసా లాంగాఫ్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. అర్షద్ ఇక్బాల్ అవుట్ కావడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ ఫైనల్‌కు చేరుకుంది. 


స్కోరు బోర్డు
ఇండియా అండర్-19 ఇన్నింగ్స్: పృథ్వీ షా రనౌట్ 41, మనోజ్ కల్రా (సి) రొహైల్ నజీర్ (బి) ముసా 47, శుభ్‌మన్ గిల్ నాటౌట్ 102, దేశాయ్ (సి) సాద్ ఖాన్ (బి) అర్షద్ ఇక్బాల్ 20, పరాగ్ (సి) రొహైల్ (బి) అర్షద్ 2, అభిషేక్ శర్మ (సి) రొహైల్ (బి) అర్షద్ 5, రాయ్ (సి) రొహైల్ (బి) ముసా 33, నగర్‌కోటి (బి) అఫ్రీది 1, శివం మవి (సి) అండ్ (బి) ముసా 10, శివ సింగ్ ఎల్‌బిడబ్ల్యూ (బి) ముసా 1, పోరెల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం 50 ఓవర్లలో 272/9; వికెట్ల పతనం: 1-89, 2-94, 3-148, 4-156, 5-166, 6-233, 7-242, 8-265, 9-267; బౌలింగ్: అర్షద్ ఇక్బాల్: 10-0-51-3, మహ్మద్ ముసా: 10-0-67-4, షహీన్ షా అఫ్రీది: 10-0-62-1, హసన్ ఖాన్: 10-0-46-0, మమ్మద్ తాహ: 7-0-35-0, అలి జర్యాబ్ ఆసిఫ్: 3-0-11-0.
పాకిస్థాన్ అండర్-19 ఇన్సింగ్స్: ఇమ్రాన్ షా (సి) పృథ్వీ షా (బి) పోరెల్ 2, జైద్ ఆలమ్ (సి) శివం మవి (బి) పోరెల్ 7, రొహైల్ నజీర్ (సి) శుభ్‌మన్ (బి) పరాగ్ 18, అలీ జర్యాబ్ ఆసిఫ్ (సి) పృథ్వీ షా (బి) పోరెల్ 1, అమ్మద్ ఆలమ్ (సి) శివం మవి (బి) పోరెల్ 4, మొహ్మద్ తాహ (సి) నగర్‌కోటి (బి) శివ సింగ్ 4, సాద్ ఖాన్ (స్టంప్డ్) దేశాయ్ (బి) రాయ్ 15, హసన్ ఖాన్ (సి) శుభ్‌మన్ (బి) పరాగ్ 1, షహీన్ షా అఫ్రీది (సి) అండ్ (బి) శివ సింగ్ 0, ముహ్మద్ ముసా నాటౌట్ 11, అర్షద్ ఇక్బాల్ (సి) పోరెల్ (బి) అభిషేక్ శర్మ 1, ఎక్స్‌ట్రాలు: 5, వికెట్ల పతనం: 1-10, 2-13, 3-20, 4-25, 5-37, 6-41, 7-45, 8-48, 9-68, 10-69; బౌలింగ్: శివం మవి: 4-3-6-0, పోరెల్: 6-2-17-4, నగర్‌కోటి: 5-1-7-0,  శివ సింగ్: 8-0-20-2, పరాగ్: 4-1-6-2, రాయ్: 2-0-11-1, అభిషేక్ శర్మ: 0.3-0-0-1.

English Title
U-19 World Cup Semi Final, India Beat Pakistan by 203 Runs, Highlights: As It Happened
Related News