ఆటగాళ్ల కన్నా అంపైర్లకే అధిక వేతనం

Updated By ManamFri, 06/01/2018 - 13:22
Umpires Earning More Than Players Do
  • ఫస్ట్ క్లాస్ సీనియర్ ఆటగాళ్ల కన్నా ఎక్కువ ఇస్తారా అని ప్రశ్నించిన నిరంజన్ షా

Umpires Earning More Than Players Doన్యూఢిల్లీ: క్రికెట్ ఆటగాళ్ల కన్నా అంపైర్లే ఎక్కువగా సంపాదిస్తున్నారట. అవును, స్వయానా బోర్డు మాజీ సెక్రటరీ నిరంజన్ షా ఆరోపణలివి. బీసీసీఐ నిర్వహించే టోర్నీల్లో పాల్గొనే దేశవాళీ క్రికెటర్ల కన్నా కూడా.. ఆ టోర్నీల్లో పాల్గొంటున్న అంపైర్లకే అధిక మ్యాచ్ ఫీజులు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై చర్చించేందుకు జూన్ 22న ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)ను ఏర్పాటు చేయాలని షా సభ్యుడైన సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, కేరళ, నేషనల్ క్రికెట్ క్లబ్ (ఎన్సీసీ) సహా ఇతర బోర్డుల సభ్యులు డిమాండ్ చేశారు. ఆటగాళ్ల కాంట్రాక్టులు, దేశవాళీ ఆటగాళ్ల పారితోషికం వంటి వ్యవహారాలపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. వారి డిమాండ్‌కు తలొగ్గిన బీసీసీఐ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఢిల్లీలో జూన్ 22న ఉదయం 10 గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు బీసీసీఐ ఇన్‌చార్జ్ సెక్రటరీ అమితాబ్ చౌదరి సర్క్యులర్ జారీ చేశారు.

అయితే, అందరూ కాకుండా బోర్డుల్లోని ఉన్నతాధికారులు మాత్రమే సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆ ఉత్తర్వు్ల్లో పేర్కొన్నారు. అంపైర్ల పారితోషికాన్ని రెట్టింపు చేస్తూ ఏప్రిల్ 12న సీఓఏ నిర్ణయించింది. ఆ నిర్ణయం ప్రకారం టీ20లు మినహా ఇతర మ్యాచుల్లో అంపైర్లకు ఒక్క రోజుకు రూ.40 వేలు ముట్టనుంది. అయితే, అది కూడా టాప్ 20లో ఉన్న అంపైర్లకు మాత్రమే. అదే టీ20ల విషయానికొస్తే రూ.20 వేలు అందుతాయి. కానీ, ఫస్ట్ క్లాస్ క్రికెటర్లకు మాత్రం రోజుకు రూ.35 వేల మేర మ్యాచ్ ఫీజు అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్ల కన్నా అంపైర్లకు అధిక మ్యాచ్ ఫీజు వస్తుండడంతో పలువురు ఆటగాళ్లు ఆక్షేపించారు. అంపైర్లకు పారితోషికం పెంపు తప్పుకాదని, అయితే ఆటగాళ్లను కూడా పట్టించుకోవాలని నిరంజన్ షా సూచించారు. ఆటగాళ్ల కన్నా కూడా అంపైర్ల మ్యాచ్ ఫీజులు ఎక్కువ ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. అందుకే సమావేశం నిర్వహించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. 

English Title
Umpires Earning More Than Players Do
Related News