‘ఏకరీతి చట్టం’ ఏల?

Updated By ManamWed, 09/05/2018 - 02:05
editorial

image‘ఏకరీతి పౌర స్మృతి’ ఈ దశలో అవసరం లేదని భారత లా కమిషన్ కుటుం బ చట్టాల సంస్కరణలపై రూపొందించిన ‘సంప్రదింపుల పత్రం’ (కన్సల్టేషన్ పేపర్) సూచించింది. స్త్రీపురుష అసమానత్వం సంప్రదాయంగా కొనసాగు తున్న సమాజంలో మనకు ఏకరీతి న్యాయబద్ధమైన స్మృతి కావాలి కానీ ఏక రీతి పౌర స్మృతివాదాన్ని లా కమిషన్ పత్రం తిరస్కరించింది. అందుకు ప్రత్యా మ్నాయంగా ప్రతి మతానికి చెందిన కుటుంబ చట్టాల్లో స్త్రీ, పురుష సమా నత్వాన్ని సాధించేందుకు కృషిచేసే పౌర చట్ట సంస్థను ఏర్పాటు చేయాలని ఆ పత్రం సూచించింది. మతాలన్నిటి వ్యక్తిగత చట్టాలకు చెందిన పెళ్ళి, విడా కులు, వారసత్వం, దత్తత వంటి చట్టబద్ధమైన అంశాల్లోని వివక్షాపూరిత నియమ నిబంధనలను తొలగించేందుకు, జెండర్ వివక్ష తదితర పక్షపాతా లను తొలగించి వాటి స్థానంలో నిర్దిష్ట విశ్వజనీన నియమాలను వ్యక్తిగత చట్టాల్లో తీసుకొచ్చేందుకు సవరణలు చేపట్టేందుకు కృషి చేయాలని ఆ పత్రం వెల్లడించింది. అంటే ఆయా వ్యక్తిగత పౌరచట్టాల్లో మొదటగా అంతర్గతంగా ఉన్న వివక్షలను తొలగించి విశ్వజనీన ప్రజాస్వామిక, సమానత్వ నియమ నిబంధనలతో సంస్కరించడమే ‘ఏకరీతి పౌరస్మృతి’ వైపు ముందుకు అడుగు వేసినట్లవుతుందని లా కమిషన్ పత్రం అంతరార్థం. 

ఒక దేశంలోని పౌరులందరికీ ఏకరీతి చట్టం ఉండటం సహేతుకం. అయి తే భిన్నత్వం, బహుళత్వం, జెండర్ తదితర అస్తిత్వాల మధ్య అసమానతలు, వివక్షలతో కూడిన భారత దేశంలో ఏకరీతి పౌరస్మృతి మెజారిటీ అస్తిత్వ సమూహ ఆధిపత్యానికి ఆలవాలంగా ఉంటుంది. సామాజిక ప్రతిఫలనంగా ఉనికిలోకి వచ్చిన మన చట్టాల్లో స్త్రీ పురుషులిద్దరికీ సమాన న్యాయం జరుగు తోందా అన్నది పరిశీలించకుండా ఏకరీతి పౌరస్మృతిని అమలులోకి తీసుకొస్తే మతం అందులో భాగమైన కులమేదైనా స్త్రీలందరికీ అన్యాయం జరుగు తుంది. అదీకాక చట్టాలను సంస్కరించే విధంగా మన చర్యలు ఉండాలి గానీ, ఒకేసారి ఏకరీతి స్మృతిని అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తే మత ఛాందస వాదులు ఆ చర్చను, చర్యలను పక్కదారి పట్టించే అవకాశం లేకపోలేదు. మొదట అన్ని మతాల పర్సనల్ లాలను విశ్వజనీన కుటుంబ విలువలకు అనుగుణంగా విడతలు విడతలుగా సంస్కరించుకుంటూ పోవాలి. ‘ప్రస్తుతం అన్ని మతాలకు చెందిన పర్సనల్ లాలను సంస్కరించడం మన ప్రాథమిక ప్రాధాన్యతగా ఉండాలి-అది హిందువులది కావచ్చు, ముస్లింలది కావచ్చు, క్రైస్తవులది కావచ్చు’అని లా కమిషన్ సంప్రతింపుల పత్రం సూచన ఆహ్వానిం చదగినది. మొదట అన్ని మతాల పర్సనల్ లా ల్లోని వివాహ వయసును సవరించాలి. ఆ తర్వాత విడాకుల అంశాన్ని, వివాహ రిజిస్ట్రేషన్ విధానాలను, దత్తత, వారసత్వం తదితర అంశాలను సవరిస్తూ పోవడం వల్ల ఆ స్మృతుల్లోని నియమాల్లో సారూపత్యను సాధించడం సాధ్యమవుతుంది. ఉదాహరణకు 18 ఏళ్ళ యుక్త వయసన్నది ఓటు వచ్చిందనడానికి సంకేతం. ఈ వయసు ఇతర సామాజిక వ్యవహారాలకు, సంప్రదాయాలకు ప్రామాణికం ఎందుకు కా కూడదు? పురుషులకు 21 ఏళ్ల వయసు వచ్చేంత దాకా పెళ్ళి చేసుకోకూడద న్న నిబంధన, స్త్రీలు వారి కంటే చిన్నవాళ్లయి ఉండాలన్న వివక్షకు సంకేతంగా నిలుస్తుందని ఆ పత్రం సరిగా గుర్తించింది. చట్టంలో పెళ్లీడులను నిర్ణయించ డంలోని ఈ తారతమ్యత స్త్రీ పురుషుల వివక్షకు చట్టబద్ధత కల్పించడమే. యుక్తవయసును నేరర హితంగా మార్చడం, విడాకుల నిబంధనల్లోనూ లింగ వివక్షను తొలగించడం వంటి చర్యలపై దేశవ్యాప్తంగా చర్చలు జరిపి హేతు బద్ధమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో పౌర వివా హాల రిజిస్ట్రేషన్‌కు 30 రోజుల నోటీసు గడువును రద్దు చేయడం వల్ల కులాం తర, మతాంతర వివాహాలను చెడగొట్టే అవకాశాలను నివారించగలమని ఆ పత్రం సూచన సరైనదే. విడాకుల తర్వాత స్త్రీ పురుషులిద్దరికీ సమానంగా ఆస్తి పంపకం, నయం చేయగలిగి, నియంత్రించగలిగే వ్యాధుల కారణంగా విడా కులు తీసుకునే నిబంధనను తొలగించాలని కూడా కమిషన్ పత్రం చెప్పడం సమంజసమైనదే. 

‘భిన్నత్వం అనేది కేవలం వివక్ష చూపుతున్నట్లు అర్థంకాదు. అది పటిష్ట మైన ప్రజాస్వామ్యానికి ప్రతిక’ అన్న భావన ఆధారంగా లా కమిషన్ పత్రం రూపొందినట్లు కొందరి న్యాయనిపుణుల అభిప్రాయం. పిల్లల పట్ల ‘సర్వోచ్ఛ మైన విచక్షణ’, సంరక్షణ బాధ్యత, దత్తత వ్యవహారాల్లో స్త్రీ పురుషుల సమా నత్వం సాధించే చట్టసవరణలకు శ్రీకారం చుట్టాలని ఆ పత్రం సలహా ఇచ్చిం ది. లా కమిషన్ పత్రం ఏకరీతి పౌరస్మృతిని వెంటనే రూపొందించడం వల్ల సామాజిక వైషమ్యాలు పెచ్చరిల్లి పోతాయని, అందుకోసం వ్యక్తిగత పౌర చ ట్టాల్లో సహేతుకమైన, జెండర్ వివక్షలేని సంస్కరణలు జరగాలని, అందు కోసం పత్రంలో ప్రస్తావించిన అంశాలపై దేశవ్యాప్త సంప్రదింపులు, చర్చలు జరగాలని కోరింది. ఆధునిక విశ్వజనీన పౌర న్యాయసూత్రాలతో ఒక క్రమ పద్ధతిలో కుటుంబ చట్టాల్లో సవరణలు చేయాలని సూచించడం ప్రశంస నీయం. అయితే మత పెద్దలందరూ వ్యక్తిగత చట్టాలను సవరించేందుకు కూ డా సహకరించే స్థితిలో లేరన్నది విదితమే. అయితే ముమ్మారు తలాక్ పేరుతో విడాకులు తీసుకునే సంప్రదాయం, భరణం వంటి విషయంలో ముస్లిం పర్స నల్ లా స్త్రీల పట్ల వివక్ష చూపుతోందనే సాకుతో ‘ఏకరీతి పౌరస్మృతి’ని పరిష్కారంగా తీసుకురావాలని నరేంద్ర మోదీ ప్రయత్నాలు పైకి సరైనవిగానే కనిపిస్తాయి. అయితే ముస్లిం పర్సనల్ లానే కాదు, హిందూ పర్సనల్ లా లో నూ జెండర్ వివక్షతో కూడిన అనేక లొసుగులు ఉన్నాయి. తినే తిండి మీద, జీవనం మీద, కులాంతర, మతాంతర ప్రేమ వివాహాల పేరు మీద విద్వేష కాండ రగులుస్తున్న సంఘటనలు మోదీ ప్రభుత్వ హయాంలో ఒకవైపు పెరిగిపోతూ, మరొకవైపు ఏకరీతి పౌరస్మృతి కోసం డిమాండ్ చేయడం ఏం సూచిస్తుంది? మైనారిటీలను అణచివేసే క్రమంలో హిందూ ఓటు బ్యాంకును సంఘటితం చేసే చర్యలు కాకమరేమిటని ప్రజాస్వామిక వాదులు ప్రశ్నించ డంలో తప్పుపట్టాల్సిన పనిలేదు. ప్రజాస్వామ్యమంటే మైనారిటీపై మెజారిటీ పెత్తనం చేయడం కాదు. సత్యం మైనారిటీ స్థితి నుంచి ప్రారంభమై మెజారి టీ స్థాయికి చేరుకుంటుందన్న సహజక్రమాన్ని గుర్తించి మైనారిటీ అభిప్రా యాలకు, మైనారిటీల అస్తిత్వ పరిరక్షణ బాధ్యత వహించడమే ప్రజాస్వామ్య భావన అంతస్సారంగా పాలకులు గుర్తించేదెన్నడో? బాధితులైన ముస్లిం మహిళలు వేసిన వ్యాజ్యాలపై వెలువడిన తీర్పుల ఆధారంగా వ్యక్తిగత పౌర స్మృతులను చట్టసభలు సవరించడం సరైనది కాదు. అన్ని లోపాలనూ అధిగ మించే వివాహ చట్టాలు తయారుకావాలంటే, బాధితులైన స్త్రీ పాల్గొంటేనే జరు గుతుందని, వారి నేతృత్వంలోనే సవరణలు జరగాలని కొందరి వాదనలు నిజం కాదు. పౌర చట్టాల నిర్మాణం బాధిత మహిలది మాత్రమే కాదు, మొత్తం సమాజంలోని స్త్రీ పురుషులిరువురూ ఈ అంశాలను మౌలికంగా మార్పులు చేసేందుకు ఒక తాత్విక దృక్పథంతో ఉద్యమించాల్సి ఉంటుంది. అనేక దేశాల్లో స్త్రీలు దేశాధినేతలుగా పనిచేసినంత మాత్రాన ఆ దేశాలలో స్త్రీలకు అనుకూలమైన, పురుషస్వామ్యం నిర్మూలించే చట్టాలు గానీ, సామాజిక వాతావరణంలో ఉనికిలోకి రాలేదు. సమాజంలోని వర్గ అసమానతలు, కుల, మత, ప్రాంత, జెండర్ తదితర అస్తిత్వ వైషమ్యాల మౌలిక పరిష్కారం కోసం జరిగే సమగ్ర సాంస్కృతిక ఉద్యమ నేపథ్యంలోనే ‘ఏకరీతి పౌరస్మృతి’కి సహేతుక బీజాలు పడతాయి. 

English Title
'Uniform law'
Related News