ఐక్య సంఘర్షణ

Updated By ManamSat, 09/08/2018 - 01:12
editorial

ఐక్య సంఘర్షణ అసంఘటిత మానవ మహా సమూహాలుగా, ‘గ్రామ జీవిత సంకుచి తత్వం’లో కొట్టుమిట్టాడుతూ, నిరాశ నిస్పృహల మధ్య ఆత్మహత్యలను జీవన సంక్షోభానికి పరిష్కారంగా ఎంచుకుని రాలిపోతున్న రైతాంగం నేడు ఉద్యమ బాట పట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. అంతకంటే మించి కార్మిక, కర్షక, మేధావుల, ప్రజాస్వామికవాదుల ఐక్యత సాధించడం అంత కంటే మించిన చారిత్రక పరిణామం. లక్షన్నర మందికి పైగా శ్రామికులు, కర్షకులు, వ్యవసాయ శ్రామికులు బుధవారం నాడు దేశ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరపడం చరిత్రాత్మకం. ప్రపంచీకరణ పరా కాష్ఠకు చేరుకున్నప్పటి నుంచి కార్మిక, కర్షక ఐక్యసంఘటనతో కూడిన నాయకత్వంలో సమాజంలోని వివిధ ప్రజాస్వామిక సెక్షన్లు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసన ప్రదర్శన చేయడం ఆశా వహం.

న్యూఢిల్లీలో రాంలీలా మైదాన్ నుంచి పార్లమెంట్ వీధి, జంతర్ మంతర్ వరకు కిసాన్-మజ్దూర్ సంఘర్ష్ సంస్థ నాయకత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. చిన్న రైతులకు రుణమాఫీ వర్తింపచేయాలని, పంటలకు కనీస మద్దతు ధరను హేతబద్ధమైన రీతిలో నిర్ణయించాలని, కార్మిక చట్టాలను సమర్థంగా అమలు చేయాలని, కనీస వేతనం రూ.18 వేలుగా నిర్ణయించాలని, మరింత ఉపాధి కల్పన, కోటి మంది అంగన్ వాడీ, ఆశావర్కర్లను శ్రామిక శక్తిగా గుర్తించాలని, సామాజిక భద్రత, ఆహార భద్రత కల్పించాలని, కార్మిక వ్యతిరేక చట్ట సవరణలను ఉపసంహ రించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో కార్మిక, కర్షక, ప్రజాస్వామిక వాదులు గర్జించారు.

image


కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, నిరంకుశ ధోరణు లపై అసంఖ్యాక ప్రజానీకంలో వెల్లువెత్తిన ఆగ్రహానికి నిదర్శనమిది. వామపక్ష పార్టీ నాయకత్వంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్‌తో పాటు అసోం, ఢిల్లీ చుట్టపక్కల రాష్ట్రాల ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొనడం విశేషం. వ్యవసాయ రుణాలను ఒక్కసారిగా పూర్తిగా మాఫీ చేయాలని, అటవీ భూములను గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు నష్టపరిహారం పెంచాలని, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని, బుల్లెట్ ట్రైన్ కోసం, నదుల అనుసంధానం కోసం ప్రభుత్వం అభివద్ధి పేరిట భూములను కొల్లగొడుతుండడం వంటి పది ప్రధాన డిమాండ్లపై ఈ ఏడాది మార్చి 6న దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో సుమారు 40 వేల మంది రైతుల అఖిల భారత్ కిసాన్ సభ (ఏఐకేఎస్) సారథ్యంలో నాసిక్ నుంచి ముంబయి దాకా 180 కిలోమీటర్ల పొడవున నిరసన లాంగ్‌మార్చ్ నిర్వహించడం చరిత్రాత్మకం. ఆ తర్వాత మార్చిలో 15 తేదిన ఉత్తర ప్రదేశ్‌లో లక్నో వరకు మరో విడత రైతాంగం లాంగ్‌మార్చ్ చేసింది.

గత ఏడాది జూన్‌లో మధ్యప్రదేశ్‌లోని మందాసార్‌లో ప్రారంభమైన రైతాంగ నిరసన ధోరణి గత నవంబర్‌లో న్యూఢిల్లీ జంతరమంతర్ వద్ద తమిళ నాడుకు చెందిన కరువు ప్రాంత రైతులు విలక్షణ నిరసనలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రైతుల ఆత్మహత్యలకు అడ్డాలుగా ఉన్న గ్రామసీమలు క్రమంగా రైతాంగ ఆగ్రహ కేంద్రాలుగా మారాయి. వ్యవసాయ ఖర్చుకు రెండు రెట్లు అధికంగా ఆదాయం కల్పించే విధంగా రైతుల్ని ఆదుకొంటా మని, సంపూర్ణ రుణమాఫీ చేస్తామన్న ఎన్నికల్లో హామీతో గద్దెకెక్కిన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ, రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కానీ వ్యవసాయ రంగ సంక్షోభ శాశ్వత పరిష్కారం వైపుగా విధానాలను రూపొందించడంలేదు. రైతులేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడంలేదు. వ్యవసాయ రుణాల మాఫీ, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, కనీస ఆదాయ హామీ పథకం, ఎరువుల ధరల తగ్గింపు, నిత్యావసరాలను ఫార్వార్డ్ ట్రేడింగ్ పేరుతో సాగి స్తున్న కార్పొరేట్ కుట్ర అయిన స్టాక్ మార్కెట్ జూదాన్ని నిషేధించాలని.. తదితర న్యాయమైన డిమాండ్లతో వారు ఉద్యమిస్తున్నారు. మండిపోతున్న పెట్రో, నిత్యావసర ధరలు, డాలర్‌తో రూపాయి మారకం తగ్గుతుండడం, పెద్దనోట్ల రద్దు వైఫల్యం, నిరుద్యోగం విజృంభించడం తదితర ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అసంతృప్తి పెంపొందిన నేపథ్యంలో ఈ ర్యాలీలు జరగడం కేంద్రానికి గట్టి హెచ్చరిక.

స్వాతంత్య్రానంతరం ఆహార కొరత ఎదుర్కొంటున్న కాలంలో వ్యవ సాయరంగాన్ని అధికంగా ప్రోత్సహిస్తున్న హరిత విప్లవం పేరుతో మార్కెట్ అనకొండలకు ఆ రంగాన్ని బలిచేయడం ద్వారా రైతాంగాన్ని ఆత్మహత్యల బాట పట్టేట్టు చేసిన ప్రభుత్వాలే ఇప్పుడు అంతకన్నా అధికా దాయం లభిస్తున్న సేవలు, వస్తూత్పత్తి రంగాలకు మాత్రమే నేడు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేయ డంతో ఆ రంగం నేడు సంక్షోభ ఊబిలో పూర్తిగా కూరుకుపోయింది. వ్యవ సాయ రంగంలోని గుత్తవ్యాపారులు, దళారుల వ్యవస్థను నిర్మూలించి, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు సక్రమంగా అమలు చేయగలితే రైతులు కష్టాల నుంచి గట్టెక్కడమే కాకుండా దేశ ఆర్థిక పరిపుష్ఠికి వారు పునాదిగా నిలుస్తారు. రైతులు, కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఐక్య సంఘర్షణకు దిగడం స్ఫూర్తిదాయకం.

English Title
Unity conflicts
Related News