హరీశ్, కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయరు?

Updated By ManamTue, 09/11/2018 - 12:56
uttam kumar reddy-jaggareddy
  • జగ్గారెడ్డి అరెస్ట్‌ను ఖండించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్

  • డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు..

jaggareddy-uttam kumar reddy

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అరెస్ట్‌ను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. జగ్గారెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఉత్తమ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు మంగళవారం ఉదయం కుందన్‌బాగ్‌లో డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ...‘నకిలీ పాస్ పోర్ట్‌ల కేసులో ఉన్న కేసీఆర్ , హరీష్‌లను ఎందుకు అరెస్ట్ చేయరు?. ఇప్పటికీ హరీశ్ భార్య, పిల్లల పేరుతో అమెరికాలో ఉన్నది వాస్తవం. వాళ్లను అక్రమంగా తీసుకువెళ్లింది హరీశ్‌రావే. 

చెన్నై, అమెరికా ఎంబసీలో రికార్డులు పరిశీలిస్తే తరలించిన వారి వివరాలు ఉంటాయి. మరి హరీశ్, కేసీఆర్‌లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని డీజీపీని ప్రశ్నించాం. జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్‌ను కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంటుంది. పోలీసులు కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలి’ అని హితవు పలికారు.

అర్థం పర్థం లేని ఆరోపణలతో జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయనకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం, గులాం నబీ ఆజాద్ హాజరు అయ్యే బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు రాబోతున్నారన్న సమాచారంతో టీఆర్ఎస్ భయపడే ఈ అరెస్ట్ చేయింది. జగ్గారెడ్డిపై అక్రమ యాక్ట్లులు ప్రయోగించారు. బోగస్ రికార్డుల ఆధారంగా పోలీసులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ యంత్రాంగం సర్కార్ చేతిలో కీలుబొమ్మగా మారింది.  

ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగపరుస్తున్నరనడానికి ఇదే నిదర్శనం.14సంవత్సరాల క్రితం ఇచ్చిన రికమెండేషన్ లెటర్ ఇచ్చారని ఇప్పుడు అరెస్ట్‌కు పూనుకోవడం, నేరంగా పరిగణించడం, బ్లాక్ మెయిల్ చేయడమే. పోలీసుల అదుపులో ఉన్న జగ్గారెడ్డి ప్రాణాలకు ముప్పు ఉంది. ఆయనను వెంటనే న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలి. 

ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కేసీఆర్ పోలీసులను ప్రభావితం చేస్తూ కాంగ్రెస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నరు. కావున తక్షణమే ఆయనను ఆపద్దర్మ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

English Title
Uttam Kumar Reddy met DGP Over Jagga Reddy Arrest
Related News