ప్ర‌గ‌తి నివేధ‌న స‌భ కాదు... ప్ర‌జా ఆవేధ‌న స‌భ 

Updated By ManamFri, 08/31/2018 - 18:57
Uttam Kumar reddy, TRS govt, KCR, Pragathi Nivedhana Sabha, Congress party
  • స‌భ నిర్వ‌హ‌ణ 300 కోట్లు ? అది అవినీతి  డ‌బ్బు కాదా.. ? 

  • అధికార దుర్వినియోగానికి ప‌రాకాష్ట‌.. 

  • వ్య‌తిరేక‌త‌ను క‌ప్పి పుచ్చుకోవ‌డానికే స‌భ‌

  • టీఆర్ఎస్‌పై విరుచుప‌డ్డ ఉత్త‌మ్‌

Uttam Kumar reddy, TRS govt, KCR, Pragathi Nivedhana Sabha, Congress partyహైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌లేద‌ని టీపీసీసీ అధ్య‌క్షులు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్ర‌జ‌ల‌నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌స్తున్న త‌రుణంలో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేందుకు భారీ స‌భ అంటు సీఎం కేసిఆర్ కుయుక్తులు ప‌న్నుతున్నార‌ని విమర్శించారు.  కేసిఆర్ ఎలాంటి ఎత్తుగ‌డ‌లు వేసినా జ‌నం రాబోయే ఎన్నిక‌ల‌లో టీఆర్‌ఎస్‌ను త‌రిమి కొడుతార‌ని ధ్వజమెత్తారు. శుక్ర‌వారం ఆయ‌న ప్రస్తుత రాజ‌కీయాల‌పైన ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కేసీఆర్ ప్ర‌గ‌తి నివేధిక స‌భ అంటు ప్ర‌చారం చేస్తున్నార‌ని, అస‌లు రాష్ట్రంలో ఏదైనా ప్ర‌గ‌తి జ‌రిగితే క‌దా అని ఎద్దేవా చేశారు. ఇది ప్ర‌గ‌తి నివేధ‌న స‌భ కాదు, ప్ర‌జ‌ల ఆవేధ‌న స‌భ అని పెడితే బాగుండేద‌ని, ధ‌నిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ‌ను అప్పుల పాలు చేసి, అవినీతితో రాష్ట్రాన్ని అధోగ‌తి పాలు చేసిన కేసిఆర్‌, త‌న కుటుంబం మాత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్ క‌ట్టుకొని ప్ర‌గ‌తి సాధించింద‌ని, ఇది కేసిఆర్ కుటుంబ ప్ర‌గ‌తిగా పెట్టుకుంటే బాగుండేద‌ని ఎద్దేవా చేశారు. 

 ల‌క్ష‌కోట్ల అవినీతి, రెండు లక్ష‌ల కోట్ల అప్పులు, 5 వేల మంది రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, నిరుద్యోగుల ఆక‌లిచావులు, మ‌హిళ‌ల‌కు అవ‌మానాలు, రాజ‌కీయ ఫిరాయింపులు, అభివృద్ది ప‌నులు పేరిట క‌మీష‌న్లు, 500 కోట్ల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌, ప్రైవేట్ విమానాల‌లో ప్ర‌యాణాలు, తెలంగాణ ద్రోహులకు అంద‌లం, తెలంగాన అమ‌రవీరుల‌కు అవ‌మానాలు ఇవేనా తెలంగాణ ప్ర‌గ‌తి అని ఆయ‌న ఎద్దేవా చేశారు. 2014 ఎన్నిక‌ల‌లో ప్ర‌జ‌లు ఏ హామీలు ఇచ్చిన ఒక్క హామీ అయినా అమ‌లు చేశారా.. ఈ విష‌యంలో కేసిఆర్ చ‌ర్చ‌ల‌కు వ‌స్తారా అని ఉత్త‌మ్ స‌వాల్ చేశారు. గ‌త ఎన్నిక‌ల‌లో అర్హులైన ద‌ళిత, గిరిజ‌న కుటుంబాల‌కు మూడు ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి ఇస్తామ‌ని హామి ఇచ్చారా లేదా, ఒక్క కుటుంబ‌మైనా మూడు ఎక‌రాల భూమి పొందిందా అని ప్ర‌శ్నించారు.

అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి డ‌బుల్ బెడ్ ఇళ్ళు ఇస్తామ‌న్నారు, ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలోనైనా ల‌క్ష్యం మేర‌కు ఇచ్చారా ?  నియోజ‌క‌వ‌ర్గానికి ల‌క్ష ఎక‌రాల‌లో సాగునీరు ఇస్తామ‌ని, 4 నెల‌ల‌లో ముస్లీంల‌కు, గిరిజ‌న‌ల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌న్నారు, కేజీ టు పిజి ఉచిత నిర్బంధ విద్య అన్నారు, ఇంటికో ఉద్యోగం, జిల్లాకో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప్ర‌తి, లాంటి అనేక హామీలు ఇచ్చిన కేసిఆర్ ఒక్క హామీనైనా నెర‌వేర్చారా అని ఆయ‌న విమ‌ర్శించారు. 

ఈ నాలుగేళ్ళ‌లో దాదాపు ఆరున్న‌ర ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ కేటాయింపులు జ‌రిగితే రైతుల‌కు ఏక‌కాలంలో రుణ మాఫీ చేయ‌లేద‌ని, క‌మీష‌న్ల పేరిట వేల‌ కోట్ల రూపాయ‌లు దోచుకున్నార‌ని, తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన యువ‌త‌ను నిర్ల‌క్ష్యం చేశార‌ని, అమ‌ర‌వీరుల‌కోసం అంత‌ర్జాతీయ స్థాయిలో స్మార‌క స్థూపం క‌డుతామ‌ని చెప్పి క‌నీసం వారికి స్థ‌లం కూడా కేటాయించ‌లేద‌ని, 1200 మంది అమ‌ర‌వీరుల‌ని చెప్పి 400 మందికి కూడా ప‌రిహారాలు ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో యువ‌కుల మీద లేని ప్రేమ‌ను చూపిస్తున్నార‌ని, ఇంత‌కాలం శంకుస్థాప‌న‌లు చేసిన కులాల భ‌వ‌నాల‌కు ఒక్క పైసా కూడా ఇవ్వ‌కుండా ఇప్పుడు మ‌ళ్ళీ ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాలు అంటు కొత్త ప‌ల్ల‌వి ఎత్తుకున్నార‌ని,  గ‌త నాలుగేళ్ళుగా వేసిన భ‌వ‌నాల‌కు ఎందుకు నిధులు ఇవ్వ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

ఇప్ప‌డు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్ప‌తు దాదాపు 300 కోట్ల రూపాయ‌ల‌తో ప్ర‌గ‌తి నివేధ‌న స‌భ అంటు తాను ఏదో చేసినట్టు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని ఇంత డ‌బ్బు టిఆర్ ఎస్‌కు ఎలా వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు. అవినీతికి పాల్ప‌డి ఉండ‌క‌పోత ఈ డ‌బ్బు లెక్క‌లు చెబుతారా అని ప్ర‌శ్నించారు. అధికార దుర్వినియోగం చేస్తున్నార‌ని, మంత్రులు, ఎం.ఎల్.ఎలు, పోలీసు ఉన్న‌తాధికారులు, ప్ర‌భుత్వ అధికారులు అన్ని ప‌నులు ప‌క్క‌న పెట్టి కొంగ‌ర క‌లాన్ స‌భ సేవ‌లోనే ఉండిపోతున్నార‌ని విమ‌ర్శించారు. మిష‌న్ భ‌గీర‌థ నీళ్ళు ఇవ్వ‌క‌పోతే ఎన్నిక‌ల‌లో ఓట్లు అడ‌గ‌న‌ని పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడిన కేసిఆర్ ఇప్ప‌డు ఎన్ని గ్రామాల‌లో మిష‌న్ భ‌గీర‌థ నీళ్ళు వ‌స్తున్నాయ‌ని ప్ర‌శ్నించారు. మిష‌న్ భగీర‌థ పైపుల‌లో ప్ర‌జ‌ల‌కు నీళ్ళు రావ‌డం లేద‌ని, కేటిఆర్ కు మాత్రం క‌మీష‌న్లు వ‌చ్చాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 

కేసిఆర్ ఎన్ని నివేధిక‌లు పెట్టినా ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌ని కాలేశ్వ‌రం ప్రాజెక్టు క‌మీష‌న్లు, మిష‌న్ భ‌గ‌ర‌థలో మింగిన లంచాలు, కాక‌తీయ క‌మీష‌న్లు ఎన్ని నిధులు గుమ్మిరించి స‌భ‌లు నిర్వ‌హించినా టిఆర్ ఎస్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని, కాంగ్రెస్ విజ‌యం ఖాయ‌మ‌ని, కాంగ్రెస్ విజ‌యాన్ని ఎవ‌రు ఆప‌లేర‌ని , ఎంత ముంద‌స్తు పెడితే అంత తొంద‌ర‌గా తెలంగాణ‌కు కేసిఆర్ పీడ విర‌గ‌డ అవుతుంద‌ని ఆయ‌న అన్నారు

English Title
Uttam Kumar reddy slams TRS govt
Related News