వాలెంటైన్స్ డే స్పెష‌ల్‌.. పాట‌ల్లో ప్రేమ‌

Updated By ManamWed, 02/14/2018 - 06:00
toliprema

song

ప్రేమ‌.. రెండు మ‌న‌సుల మ‌ధ్య వార‌ధి
ప్రేమ‌.. గుండె ప‌లికే కొత్త భాష‌
ప్రేమ‌.. నిర్వ‌చ‌నాల‌కు అంద‌ని అనుభూతి
ప్రేమ‌.. అక్ష‌రాలు రెండు, ల‌క్ష‌ణాలు మెండు
ప్రేమ‌.. ఆద్యంతాలు లేని అమ‌రానందం

ఇలా.. ప్రేమంటే ఏమిటంటే ప‌క్కాగా చెప్ప‌మంటే చెప్ప‌లేంగానీ.. ఒక్క‌టి మాత్రం చెప్పొచ్చు.. ప్రేమంటే మాట‌ల‌కంద‌ని భావం. అనుభూతి చెందితేగానీ అనుభ‌వంలోకి రాని విష‌యం. కోట్ల జీవ‌ రాశి ఉన్న ఈ భూమిపై ప్రేమ అనే ఉద్వేగానికి లోనుకాని జీవి లేదు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. క‌థాంశం ఏదైనా అందులో ప్రేమ అనే అంశం లేక‌పోతే అది హృద‌యం లేని దేహ‌మే. ఇక  ప్రేమ పాట లేక‌పోతే ఆడియో ఆల్బ‌మ్‌లో ఎన్ని పాట‌లు ఉన్నా లేన‌ట్టే. అందుకే మ‌న‌సు క‌వి నుంచి ఈ త‌రం ర‌చ‌యిత‌ల వ‌ర‌కు ప్రేమ పాట రాయ‌మంటే ఎవ‌రికైనా ఓ విందు భోజ‌న‌మే. త‌ము రాసే ప్ర‌తి పాట‌లోనూ కొత్త కొత్త నిర్వ‌చ‌నాలు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. తాజా తాజా ప‌దాలు సృష్టించి.. ప్రేమ‌కు పాటాభిషేకం, ప‌ట్టాభిషేకం చేసేస్తుంటారు. తెలుగు సినిమా పుట్టిన‌ప్ప‌టి నుంచి ప్రేమ‌పై వేల‌ల్లో పాట‌లు వ‌చ్చి ఉంటాయి. నేడు ప్రేమికుల రోజు. ఈ సంద‌ర్భంగా.. నాలుగైదు ద‌శాబ్దాల క్రితం వ‌చ్చిన సినిమాల నుంచి తాజా చిత్రాల వ‌ర‌కు కొన్ని అంద‌మైన ప్రేమ వాక్యాలు (పాటల ప‌ల్ల‌వులు లేదా చ‌ర‌ణాల్లో వ‌చ్చే వాక్యాలు) గుర్తు చేసుకునే చిరు ప్ర‌య‌త్నం ఇది.

 

 • ప్రేమ ప‌రిచ‌య‌మే దైవ ద‌ర్శ‌న‌మే.. ప్రేమ స్వ‌ర‌ముల‌లో దైవ స్మ‌ర‌ణ‌ములే.. (24)

 

 • ప్రేమ‌ను చెప్పిన క్ష‌ణ‌మే.. దేవుని క‌న్న క్ష‌ణ‌మే (బాయ్స్‌)

 

 • ఏ బంధ‌మూ లేని తొలి సంబంధ‌మే ప్రేమా (ప్రేమ‌)

 

 • మ‌న‌సాయే మంత్రాల‌యం..(శీను)

 

 • గ‌గ‌నానికి ఉద‌యం ఒక‌టే.. కెర‌టాల‌కి సంద్రం ఒక‌టే.. జ‌గ‌మంతంటా ప్ర‌ణ‌యం ఒక‌టే ఒక‌టే (తొలిప్రేమ-1998)

 

 • నిన్నిలా నిన్నిలా చూసానే.. క‌ళ్ళ‌ల్లో క‌ళ్ళ‌ల్లో దాచానే.. రెప్ప‌లే వేయ‌నంతగా క‌నుల పండ‌గే.. ఈ వ‌ర్షానికి స్ప‌ర్శ ఉంటే నీ మ‌న‌సే తాకేనుగా.. (తొలిప్రేమ - 2018)

 

 • నా హృద‌యం నీదే - నా స‌మ‌యం నీదే (గాయ‌త్రి)

 

 •  ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం.. ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం..ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం (ఆర్య)

 

 •  నాతో నడిచే నా నీడా నీతో నడిపావే.. నాలో నిలిచే నా ప్రాణం నువ్వై నిలిచావే..  (ఆరు)

 

 •  నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ.. వెన్నెల పేరే వినిపించని నడిరేయి కరిగించనీ  (అంతం)

 

 •  స్పందన నేనై ఉంటా నీ హృదయంలోనా... చల్లని లాలన నేనై ఉంటా నీ అలసట లోనా  (అశోక్)

 

 •  నీ నీడలో నేనున్నా చూడమంటున్నదీ.. ఈ హాయి పేరేమైనా కొత్తగా ఉన్నదీ (ఔనన్నా కాదన్నా)

 

 • గుండె ఆగిపోనీ, గొంతు ఆరిపోనీ, కాలమాగిపోనీ, నేల చీలిపోనీ, ప్రేమ పోదనీ చెప్పనా (ఔనన్నా కాదన్నా)

 

 • నా ప్రేమ గీతానికి నీవేలే తొలి అక్షరం, నా ప్రేమ పుట్టింటికి నీవేలే దీపాంకురం  (బొంబాయి ప్రియుడు)

 

 • హృద‌య‌మ‌నే కోవెల త‌లుపులు తెరిచే తాళం..ప్రేమా ప్రేమా (పెళ్లి సంద‌డి)

 

 • నీలాల ఆకాశం నా నీలం ఏదంటే.. నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే (బొమ్మరిల్లు)

 

 • నీ గుప్పెడు హృదయంలోన ఉప్పెనలా నే దాగున్నా.. ఆ చప్పుడు వినబడుతున్నా చెవులు మూగవే (చక్కిలిగింత)

 

 • నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం.. నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం (చక్రం)

 

 •  నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే, నే ఎన్నెన్నో యుద్ధాలు చేస్తానులే, నీ చిరునవ్వుకి నేను గెలుపొంది వస్తాను (ఛలో)

 

 • గుడిలో దేవి లేకుంటే, ఒడి గట్టేను ఈ దీపం (చంటి)

 

 • పసిడిమువ్వ లల్లి కాలి గొలుసు కడతా..రెండు మువ్వలూడి పడితే కంటి పాప లెడతా..నిను ద్వీపమల్లె కాపుకాచి కడలల్లె మారుతా (చెప్పవే చిరుగాలి)

 

 • భువిలోన గాలి కరువైన వేళ, నా ప్రాణాన్ని నీ ఊపిరిగా మార్చేయనా.. నీలాల నింగి తెలవారకుంటే, నా జీవాన్ని నీకో దివ్వెగా అందించనా  (చెప్పవే చిరుగాలి)

 

 • ఊపిరే నీవుగా, ప్రాణమే నీదిగా, పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా (క్రిమినల్)

 

 • చీకటి దాచిన వేకువని మనసుకి తెలియని వేడుకని.. నువ్వొచ్చాకే చూస్తున్నాకద నీ ప్రేమలో  (దేవుడు చేసిన మనుషులు)

 

 • నీలో లీనమై నేనే నీవనిపించే (డాడీ)

 

 • జన్మకైనా ప్రేమే నమ్మికైనది..ఎన్ని జన్మలైనా ప్రేమ మాయరాదనీ (దేవదాసు)

 

 • స్నానానికి వేణ్ణీలౌతా.. అది కాచే మంట అవుతా (ప్రేమిస్తే)

 

 • ఊహలన్ని వాస్తవాలై నీలా మారేనా మారేనా.. ఊపిరేదో రూపమైతే అది నీవే మైనా (డాన్)

 

 • కాలాలు ఆగిపోనీ ఓ నా ప్రేమా, ఈ క్షణమే తీరిపోనీ నా ఈ జన్మ (డాన్)

 

 • ప్రాణమున్నదీ నీ కోసం, ప్రేమ ఉన్నదీ....మన కోసం (డాన్)

 

 • నూరేళ్ళ జీవితాన నీ తోడు అందకుంటే ఎంత నరకం ఎంతెంత నరకం (అఆఇఈ)

 

 • నిప్పులోన కాలదు, నీటిలోన నానదు..గాలిలాగ మారదు ప్రేమ సత్యమూ (గీతాంజలి)

 

 • ఎంత దూరాన నే ఉన్నా, నీతోనే నే లేనా..నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా (గోపి గోపిక గోదావరి)

 

 • నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ, నాలో పొంగిన గుండెల సవ్వడులే.. అవి చెరిగాయంటే, నేనమ్మేదెట్టాగా, నువ్వు లేకుంటే నేనంటూ ఉండనుగా (గులాబి)

 

 • ఏ వైపు చూస్తున్నా..నీ రూపే తోచింది, నువ్వు కాక వేరేది...కనిపించనంటోంది (గులాబి)

 

 • ప్రేమన్నది ఊపిరికాదా.. అందరిలో ఉండేదేగా, పరిచయమే లేదని అంటే వింతే కదా.. నువ్వున్నది నాలోనేగా, ఈ సంగతి విననేలేదా, మదిలోనే నువ్వు నిదరోతూ గమనించలేదా (హోలీ)

 

 • అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో.. ఏమని చెప్పాలి నీతో.. ఒక మాట అయినా తక్కువేమీ కాదే ప్రేమకు సాటేది లేదే (జయం)

 

 • తనువులో ప్రాణం ఏ చోటనున్నదో.. ప్రాణంలోన ప్రేమ ఏ చోటనున్నదో ఆలోచిస్తే అతిశయమే (జీన్స్)

 

 • ప్రేమయే లేని నగరం.. అది గాలియే లేని నరకం (జోడి)

 

 • జగాలు లేని సీమలో.. యుగాలు దాటే ప్రేమలు (కిల్లర్)

 

 • నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని.. నీ వీణకు నాదాన్ని కానా (కోకిలమ్మ)

 

 • నీ దివ్య సుందర రూపమే.. నా గుండె గుడిలో వెలిగే దీపం (కుమార రాజా)

 

 • నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా (ఈగ)

 

 • అవి బతికున్నప్పుడే తోడుంటాయమ్మా.. నీ చితిలో తోడై నేనొస్తానమ్మా(మగధీర)

 

 • చుట్టుపక్కల ఎవ్వరొద్దనే కొత్త కొత్త ఆశ రేపే తొలిప్రేమిదే (మళ్ళీ రావా)

 

 • గుండెలో నీ వల్లే సవ్వడే పెరిగెనే.. గుండె తడి నువ్వైయ్యావులే (మనం)

 

 • ఇప్పుడూ నిను చూపగలనని.. ఇదిగో నా నీడ నువ్వనీ (మనసంతా నువ్వే)

 

 • నను చూస్తూ నువ్వు పొగడాలని ఉన్నది...నా వెనకాలే తిరగాలని ఉన్నది (మనసుకు నచ్చింది)

 

 • దూరాన ఉన్నా నా తోడు నీవే.. నీ దగ్గరున్న నీ నీడ నాదే, నాదన్నదంతా నీవే నీవే (మంచి మనసులు - 1986)

 

 • కళ్ళను వదిలెల్లను అని కమ్మిన మెరుపేదో.. చెప్పవా కనురెప్పలకే మాటొస్తే (మన్మథుడు)

 

 • మనసు మూగది మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది (మరో చరిత్ర)

 

 • అలా నడిచి వస్తుంటే పువ్వుల వనం.. శిలై పోనీ మనిషుంటే మనిషే అనం (నువ్వు నాకు నచ్చావ్)

 

 • పదిలమైన నా హృదయంలో గుడిని నీకే కడతానే.. ఇంకెవ్వరికీ చోటివ్వననీ మాటే ఇస్తున్నానే (నా హృదయంలో నిదురించే చెలి)

 

 • నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను.. మరువలేను నిన్ను నేను.. గుర్తురానే నాకు నేను (నచ్చావులే)

 

 • ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకుంటినీ.. ఏ చిరుగాలి కదలాడినా నీ చరణాల శృతివింటినీ (నీరాజనం)

 

 • రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగా పోసి ఊహించా నీ జడ కోసం.. రోజూ ఉపవాసంగా హృదయం నైవేద్యంగా పూజించా నీ జత కోసం (నిన్నే ప్రేమిస్తా)

 

 • నీ రెండకు నీ వెంటే నీడై వచ్చి, మమతలతో నీ గుడిలో ప్రమిదలు చేస్తా.. ఊపిరితో నీ రూపం అభిషేకించి ఆశలతో నీ వలపుకు హారతులిస్తా  (నిన్నే ప్రేమిస్తా)

 

 • ఆ నవ్వుకు నేనే దాసోహం.. ఏ పువ్వుకు లేదే ఆ సుకుమారం , ఏ కలలో లేదే ఆ అందం.. తను కనిపిస్తేనే కళ్ళకు అర్థం (నేను ప్రేమిస్తున్నాను)

 

 • గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది.. చెలీ నీకై చూస్తూ ఉంటానని (నువ్వే కావాలి)

 

 • అలవాటే కదా నువ్వు కంటిపాపకి.. కలబాటేందుకు నిను చూడడానికి (మనసుకు నచ్చింది)

 

 • ఎగసే ఆ గువ్వలకన్నా, మెరిసే ఆ మబ్బులకన్నా, కలిసే మనసేలే నాకిష్టం (నువ్వు లేక నేను లేను)

 

 • నీ కళ్ళల్లో నన్నుండి పోనీ.. నీ గుండెలో రాగాన్ని కానీ  (నువ్వు నేను)

 

 • కాళిదాసు నేనై కవిత రాసుకోన.. కాలిగోటి అంచులపైన హృదయం ఉంచనా.. (నువ్వు వస్తావని)

 

 • ఒకనాటి తాజ్ మహ‌లైన నా ముందు పూరిల్లు.. ఇకపైన గొప్ప ప్రేమికుడే లోకంలో నిలిచే పేరే నాదేలే (ఆరెంజ్)

 

 • నా ప్రేమలోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైన ఇస్తావేకంగా(ఆరెంజ్)

 

 • ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో.. చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో (ఆర్య 2)

 

 • గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాశే.. అడుగంత దూరం నువ్వు దూరమైన నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే (ప్రేమమ్)

 

 • ధనమున్న లేకున్నా గుప్పెడంత ప్రేమ ఉంది గుండెలోన.. చావైనా బతుకైనా నిన్ను విడిచి ఉండలేను క్షణమైనా (ప్రేమించుకుందాం.. రా)

 

 • నీ ఆనతే లేకున్నచో విడలేను ఊపిరి కూడా (బందిపోటు)

 

 • అలనాటి యుద్ధాలే జరుగుతాయేమో.. నీలాంటి అందాన్ని తట్టుకోలేరేమో, శ్రీ రాముడే శ్రీ కృష్ణుడై మారెంతలా (సోలో)

 

 • నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే, చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే, చూపులు తేనె ధారలై అల్లుకు పోతుంటే, రూపం ఈడు భారాలై ముందర నిలుచుంటే (పరుగు)

 

 • అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుతిరిగి.. అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి (శతమానంభవతి)

 

 • నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా, జత నడిచే మనసు కథే హాయి రాగాల ఆమనిగా  (శతమానంభవతి)

 

 • మొన్న కనిపించావు మైమరచి పోయాను.. అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే (సూర్య సన్నాఫ్‌ కృష్ణన్)

 

 •  నువ్వు నిలిచినా చోటేదో వెల ఎంత పలికెనో.. నువ్వు నడిచిన బాటంత మంచల్లె అయ్యేనో  (సూర్య స‌న్నాఫ్‌ కృష్ణన్)

 

 • నడిచి వచ్చే మెరుపును చూసా.. నిన్ను తాకి నిలువునా మెరిసా (నిన్ను చూడాలని)

 

 • ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా  (నువ్వొస్తానంటే నేనొద్దంటానా)

 

 • ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే, ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే  ( నువ్వొస్తానంటే నేనొద్దంటానా)

 

 • సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే    (నువ్వొస్తానంటే నేనొద్దంటానా)                         

                                                                                                            - మ‌ల్లిక్ పైడి

English Title
valentine's day spl.. love in film
Related News