వేదాంతకు ‘గ్రీన్’ సిగ్నల్

Vedanta Sterilite Plant
  • ప్లాంటును తెరవాలన్న గ్రీన్ ట్రైబ్యునల్

  • తమిళనాడు ప్రభుత్వ ఆదేశాల కొట్టివేత

  • మూడు వారాల్లో అనుమతులు ఇవ్వాలి

  • తమిళనాడు పీసీబీకి ఎన్‌జీటీ సూచన

  • రూ. కోటి ఖర్చుతో ఆ ప్రాంత సంక్షేమం

  • వేదాంత స్టెరిలైట్ ప్లాంటుకు ఆదేశం

చెన్నై: వేదాంత కాపర్ స్మెల్టర్ (స్టెరిలైట్) ప్లాంటును శాశ్వతంగా మూసేయాలని తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) తోసిపుచ్చింది. దాంతో ట్యుటికోరన్‌లో ఉన్న వేదాంత ప్లాంటు మళ్లీ తెరుచుకునేందుకు మార్గం సుగమమైంది. కాలుష్యం వెద జల్లుతోందన్న కారణంగా ఈ ప్లాంటును మూసేయాలని మే నెలలో భారీ స్థాయిలో ఆందోళనలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరపడంతో 13 మంది మరణించారు. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఆ ప్లాంటును మూసేయాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు మూడు వారాల్లోగా వేదాంత కాపర్ స్మెల్టర్‌ను తెరవడానికి అంగీకార పునరుద్ధరణ ఉత్తర్వులను కొత్తగా జారీచేయాలని తమిళనాడు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. దాంతోపాటు.. ఆ ప్రాంతంలో ఉన్నవారి సంక్షేమం కోసం మూడు సంవత్సరాల కాలంలో కోటి రూపాయలు ఖర్చు చేయాలని కంపెనీకి సూచించింది. ఈ మొత్తాన్ని నీటిసరఫరా, ఆసుపత్రి, వైద్యసేవలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై ఖర్చుపెట్టొచ్చని ఎన్‌జీటీ విచారణ సందర్భంగా స్మెల్టర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ అప్పీలును తాము విచారణకు స్వీకరిస్తున్నామని, మూసివేత ఉత్తర్వులను పక్కన పెడుతున్నామని, ప్రమాదకరమైన పదార్థాలను హ్యాండిల్ చేయడానికి అధికారం, ఫ్యాక్టరీ నడపడానికి అనుమతి పునరుద్ధరణకు సంబంధించి తాజా ఉత్తర్వులను మూడు వారాల్లోగా ఇవ్వాల్సిందిగా తమిళనాడు పీసీబీకి సూచిస్తున్నామని ఎన్‌జీటీ తన తాజా ఆదేశాలలో తెలిపింది. స్మెల్టర్ ప్లాంటును మూసేయడానికి ముందు తమిళనాడు అధికారులు నియమ నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారని ఎన్‌జీటీ నియమించిన నిపుణుల కమిటీ గత నెలలో తెలిపింది. అయితే, ప్లాంటును తిరిగి తెరిపించడానికి ప్రస్తుతం అధికారంలో ఉన్న తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఎన్‌జీటీ తీర్పుపై తాము సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తామని తమిళనాడు పర్యావరణ శాఖ మంత్రి కేసీ కరుప్పన్నన్ తెలిపారు. తమ విధానం ఈ విషయంలో స్పష్టంగా ఉందని.. ప్లాంటును తిరిగి తెరిచే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఈ సంవత్సరం మే నెలలో ప్లాంటును మూసేసినపుడే దానికి విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. చట్టప్రకారం పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడితే ప్లాంటుకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కూడా ఎన్‌జీటీ తన ఉత్తర్వులలో పేర్కొంది. ఎన్‌జీటీ తీర్పు స్థానికులకు తీవ్ర ముప్పని పర్యావరణవేత్తలు అంటున్నారు. స్టెరిలైట్ ప్లాంటు భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తోందని, దానివల్ల ఈ ప్రాంతాల ప్రజలు తీవ్రమైన వ్యాధులకు గురవుతారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు