వెంకన్నకు క్షీరాధివాసం

Updated By ManamThu, 08/16/2018 - 01:26
tirupathi
  • వైభవంగా క్షీరాధివాస తిరుమంజన సేవ

  • ప్రాణప్రతిష్ఠకు ఏడు అధివాసాలు.. వాటిలో మొదటిదే క్షీరాధివాస సేవ

  • నేడు వెంకన్నకు మహా సంప్రోక్షణం.. ఎమ్మెల్యే సుగుణమ్మకు అవమానం

tirupathiతిరుపతి: కలియుగ వైకుంఠం తిరుమలలో జరుగుతున్న బాలాలయ అష్టదిగ్బంధన మహా సంప్రోక్షణంలో భాగంగా నాలుగో రోజు బుధవారం శ్రీవారి మూలమూర్తికి క్షీరాధివాస తిరుమంజన సేవా కార్యక్రమం నిర్వహించారు. మూల మూర్తితో పాటు ఇతర పరివార దేవతలకు క్షీరాధివాస తిరుమంజన క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేపట్టే సమయంలో విశ్వంలో ని శక్తిని ఆవాహన చేసేందుకు అధివాసం నిర్వహిస్తారు. ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహాలు అనంతమైన శక్తిని పొందుతాయి. ఇలాంటి విగ్రహ రూపంలో ఉన్న దేవతలను దర్శించడం ద్వారా కోరిన కోరికలు తీరడంతో పాటు మానసిక శాంతి చేకూరుతుంది. శాస్త్రాల ప్రకారం ఆలయాల ప్రాణప్రతిష్ఠ సమయంలో ఏడు అధివాసాలను నిర్వహిస్తారు. వీటిలో క్షీరాధివాసం, జలాధివాసం, ఫలాదివాసం, ఛాయాదివాసం, ధాన్యాధి వాసం, పుష్పాధివాసం, శయనాధివాసం ఉంటాయి. శ్రీవారి మూల మూర్తిని పవిత్రమైన పాలతో అభిషేకం చేయడమే క్షీరాధివాసం అంటారు.  ‘‘క్షీరసాగర  తరంగ శిఖర సార తరకిత చారుమూర్తే’’ అంటూ ముకుంద మాల  స్తోత్రంలో కులశేఖరాళ్వారు క్షీరాధివాసం వైశిష్ట్యాన్ని తెలియజేశారు. శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం గోపురాల కలశాలను అద్దంలో చూపి, వాటి  ప్రతిబింబాలకు అభిషేకం నిర్వహించారు. 

నేడు మహా సంప్రోక్షణం 
శ్రీ వేకంటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం ఉదయం 10.16 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుందని జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. బుధవారం ఉదయం పవిత్రజలం, పాలు, పంచగవ్యాలతో కూడిన 14 కలశాలతో శ్రీవారి మూల మూర్తికి, ఇతర పరివార దేవతలకు క్షీరాధివాసం, తిరుమంజనం, మధ్యాహ్నం మహాశాంతి, పూర్ణాహుతి, మహాశాంతి తిరుమంజనం కార్యక్రమాలు జరిగాయన్నారు. 

స్థానిక ఎమ్మెల్యేకు అనుమతి నిరాకరణ
తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు బుధవారం ఆలయంలోకి అనుమతి లభించలేదు. ఆమె ఆలస్యంగా వెళ్లడంతో, ఆమెను అనుమతించలేదని సమాచారం. దీంతో ఆమె నిరసన వ్యక్తం చేశారు. 
 

English Title
Vennkanna is mammary
Related News