రుణాలు తిరిగి చెల్లిస్తా: మాల్యా

Updated By ManamTue, 06/26/2018 - 15:54
Vijay Mallya

రుణం చెల్లించాలన్నదే నా అభిమతం
అప్పుడు.. ఇప్పుడూ.. అదే ప్రయత్నంలో ఉన్నా: మాల్యా

న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించానని.. ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నానని విజయ్ మాల్యా స్పష్టం చేశారు. అయితే, బ్యాంకులు మాత్రం తనను రుణాల ఎగవేతదారుగా పోస్టర్లకు ఎక్కించాయని ఆయన విమర్శించారు.

mallya

భారత్ లో ఉన్నపుడు కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించాలనే ప్రయత్నించినట్లు వివరించారు. అందుకోసం పట్టుదలగా ప్రయత్నించానని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడంతో బ్యాంకులు తనను ముద్దాయిగా నిలబెట్టాయని ఆరోపించారు. ఎప్పుడైతే లోన్ రికవరీ అంశంలో రాజకీయ శక్తులు జోక్యం చేసుకున్నాయో.. అప్పుడిక తనకు చేయడానికి ఏమీ మిగలలేదని మాల్యా తెలిపారు. 

వాస్తవానికి రుణాల వసూలు అంశం సివిల్ పరిధిలోకి వచ్చినా.. భారత ప్రభుత్వం మాత్రం ప్రజల ముందు తనను క్రిమినల్‌గా నిలబెట్టిందని మండిపడ్డారు. 2016లో ఇదే విషయానికి సంబంధించి ప్రధాని మోదీతో పాటు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి తాను లేఖ రాసానని మాల్యా తెలిపారు. అయితే, వారి నుంచి తనకు ఎలాంటి జవాబు రాలేదని పేర్కొన్నారు. తాజాగా ఆ లేఖలను మాల్యా మీడియాకు విడుదల చేశారు. లిక్కర్ బేరన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ మాల్యా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు 9 వేల కోట్ల రుణం తీసుకుని విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న మాల్యాను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలపై మాల్యా మంగళవారం  స్పందించారు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. న్యాయ పర్యవేక్షణలో తన ఆస్తులను విక్రయించడానికి కోర్టు అనుమతి ఇవ్వాలని ప్రస్తుతం మాల్యా కోరారు. విక్రయించిన ఆస్తుల ద్వారా తాను బ్యాంకులకు రుణాలు చెల్లించనున్నట్టు ఒప్పుకున్నారు. ఈమేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేస్తూ.. తాను గతంలో ప్రధాని మోదీకి రాసిన లేఖనూ బయటపెట్టారు.

English Title
Vijay Mallya releases letter written to PM Modi
Related News