విజయ్ మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Updated By ManamMon, 06/18/2018 - 00:00
 Vijay Mallya
  • రూ. 9 వేల కోట్ల ఆస్తుల జప్తుకు వీలుకల్పిస్తున్న ఆర్డినెన్స్ అస్త్రం

vijayaన్యూఢిల్లీ: మద్యం వ్యాపారి విజయ్ మాల్యా మరిన్ని చిక్కుల్లో పడనున్నారు. గుప్త ధనాన్ని చెలామణీలోకి తీసుకురావడం, జాతీయీకరణ బ్యాంకుల కన్సార్టియంను రూ. 6,027 కోట్ల మేర మోసగించడానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) త్వరలోనే మాల్యాపైన, ఆయన కంపెనీలపైన తాజా చార్జిషీటు దాఖలు చేయనుంది. ఈ చార్జిషీటు (దీన్నే ప్రాసిక్యూషన్ ఫిర్యాదు అని కూడా అంటారు)తో  కేంద్ర దర్యాప్తు సంస్థ మాల్యాకు చెందిన రూ. 9,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను  ‘‘జప్తు’’ చేసేందుకు కోర్టు అనుమతి కోరే అవకాశం చిక్కుతుంది. కేంద్రం ఇటీవల జారీ చేసిన పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుల ఆర్డినెన్స్ కింద ఆ రకంగా అభ్యర్థించే వీలు ఉంది. మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. సుమారు రూ. 900 కోట్ల మేర ఐ.డి.బి.ఐ బ్యాంక్-కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లు పాల్పడినట్లు చెబుతున్న బ్యాంక్ రుణ మోస కేసులో మాల్యాపై ఇ.డి గత ఏడాది మొదటి చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇంతవరకు అది రూ. 9,890 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనపరచుకుంది. బ్యాంకుల కన్సార్టియం తరఫున భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్.బి.ఐ) నుంచి అందిన ఫిర్యాదు ననుసరించి రానున్న చార్జిషీటు రూపొందనుంది. మాల్యా యాజమాన్యంలోని సంస్థలు తమకు రూ. 6,027 కోట్ల మేర నష్టాన్ని వాటిల్లజేశాయని వాటి ఆరోపణ. అవి 2005-10 కాలంలో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేదని బ్యాంకులు పేర్కొన్నాయి. ఈ ఉదంతంలో సి.బి.ఐ దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్‌ను పరిగణనలోకి తీసుకుని ఇ.డి తన దర్యాప్తును కొనసాగించింది. ఇ.డి. దాని తాజా చార్జిషీటును గుప్త ధన చెలామణీ నిరోధక చట్టం కింద ముంబైలో ప్రత్యేక కోర్టులో దాఖలు చేయనుంది. ఎస్.బి.ఐ, దాని కన్సార్టి యం బ్యాంకులు 2005- 2010 మధ్య కాలంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు వివిధ రుణ సదుపాయాలు కల్పించాయని ఆరోపణలున్నాయి. కంపెనీ 2009-10లో రుణాలు తిరిగి చెల్లిం చడంలో విఫలమైంద ని సి.బి.ఐ ఎఫ్.ఐ.ఆర్ తెలిపింది.బ్యాంకుల కన్సార్టియం వద్ద ఎయిర్‌లైన్స్ తన ఖాతాను సరిగ్గా నిర్వహించలేదు. దాంతో ఆ రుణాలు నిరర్థక ఆస్తులుగా పరిణమించాయి. 

దాంతో బ్యాంకుల కన్సార్టియం రుణ సదుపాయాలు వెనక్కి తీసుకుంది. యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యు.బి.హెచ్.ఎల్) కార్పొరేట్ గ్యారంటీని, మాల్యా వ్యక్తిగత గ్యారంటీని కూడా అవి ఎత్తివేశాయి. రుణ దాతలను మోసగించేందుకు  గ్రూప్ కంపెనీలు, ప్రమోటర్, అజ్ఞాత వ్యక్తుల మధ్య కుట్ర జరిగిందని సి.బి.ఐ పేర్కొంది. ఈ నిధుల కైంకర్యానికి అనేక డొల్ల, డమ్మీ కంపెనీలను ఉపయోగించుకున్నట్లు తేలిందని ఇ.డి. అధికారులు చెప్పారు. రానున్న చార్జిషీటులో ఆ వివరాలను ఇ.డి పొందుపరచనుంది. పరారీలో ఉన్న నిందితులకు సంబంధించి ఒక కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధికారత పొందిన ఈ సంస్థ ఈ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు (చార్జిషీటు)ను పరిగణనలోకి తీసుకుని విజయ్ మాల్యాను ‘‘పరారీలో’’ ఉన్న నిందితునిగా అధికారికంగా ప్రకటించవలసిందిగా కోరే అవకాశం ఉంది. మాల్యాను లండన్ నుంచి రప్పించి ఈ ఆరోపణలకు సంబంధించి ఇక్కడి న్యాయ వ్యవస్థలో విచారణను ఎదుర్కొనేట్లు చేయడానికి భారతదేశం ప్రయత్నాలు సాగిస్తోంది. మాల్యాను అప్పగించాలని బ్రిటన్‌ను ఇండియా కోరుతోంది. అయితే, ఈ ఆరోపణలను మాల్యా లండన్ కోర్టులో సవాల్  చేశారు. పెద్ద మొత్తాలలో బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులన్నింటినీ ఒకచోట చేర్చి, కొత్త చట్టం కింద ఎగవేతదార్లను నోటిఫై చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఇటీవల ప్రయత్నాలు మొదలుపెట్టింది. గుప్త ధన చెలామణీ నిరోధక చట్టం కింద ప్రస్తుతం ఉన్న న్యాయ ప్రక్రియ ప్రకారం, ఒక కేసులో విచారణ ముగిసిన తర్వాత మాత్రమే, ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేయగలుగుతుంది. కానీ, విచారణ పూర్తవడానికి సాధారణంగా అనేక ఏళ్ళు పడుతుంది. ‘‘క్రిమినల్ ప్రొసీడింగులు మొదలవుతాయని ఊహించి, లేదా ప్రొసీడింగులు పెండింగ్‌లో ఉన్నప్పుడు, భారతీయ కోర్టుల విచారణ పరిధి నుంచి తప్పించుకునేందుకు ఆర్థిక నేరస్తులు దేశం విడిచి పారిపోతున్న సంఘటనల దృష్ట్యా’’ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుల బిల్లు 2018ని మార్చి 12న లోక్ సభలో ప్రవేశపెట్టారు. కానీ, వివిధ అంశాలపై ప్రతిష్టంభన వల్ల పార్లమెంట్ ఈ బిల్లును చేపట్టలేకపోయింది. పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడడంతో ఆర్డినెన్స్‌ను ప్రతిపాదించారు. ఫుగిటీవ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆర్డినెన్సుకు కేంద్ర మంత్రివర్గం ఏప్రిల్ 21 ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ జారీకి రాష్ట్రపతి ఆ మరుసటి రోజునే ఆమోద ముద్ర వేశారు. 

 గుప్త ధన నిరోధక చట్టం (2002) కింద ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేందుకు, ఒక వ్యక్తిని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తునిగా ప్రకటించేందుకు, సదరు వ్యక్తి ఆస్తులను తక్షణం స్వాధీనపరచుకునే విధంగా ఆదేశాలు జారీ చేసేందుకు ఈ ఆర్డినెన్స్ వీలు కల్పిస్తోంది. షెడ్యూల్డు నేరానికి సంబంధించి అరెస్టు వారంట్ జారీ అయిన వ్యక్తి, క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను తప్పించుకునేందుకు ఇండియా నుంచి ఉడాయించిన వ్యక్తి, లేదా విదేశాల్లో ఉంటూ, క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కొనేందుకు ఇండియాకు తిరిగి వచ్చేందుకు తిరస్కరిస్తున్న వ్యక్తి ఫుగిటీవ్ ఎకనామిక్ అఫెండర్ అవుతాడు’’ అని ప్రభుత్వం పేర్కొంది. రూ. 100 కోట్లకు మించిన మోసాలు, చెక్కులు చెల్లకపోవడం లేదా రుణాల ఎగవేత కేసులు ఈ ఆర్డినెన్స్ పరిధిలోకి వస్తాయి. అయితే, సదరు వ్యక్తులకు రాజ్యాంగపరంగా ఉండవలసిన హక్కులకు ఈ ఆర్డినెన్సు భంగం కలగనీయలేదు. వారు న్యాయవాది ద్వారా వాదనలు వినిపించుకోవచ్చు. జవాబు దాఖలు చేసేందుకు తగిన సమయం కూడా ఇస్తారు. అయితే, వారు ఇండియాలో ఉన్నా, విదేశంలో ఉన్నా కూడా సమన్లు జారీ చేయవచ్చు. అలాగే, నిందితులు కూడా ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకోవచ్చు. 

English Title
Vijay Mallya Trapping around
Related News