పంట పొలాల నిండా నీరు

Updated By ManamThu, 08/23/2018 - 00:50
farmer
  • నష్టాలతో తల్లడిల్లుతున్న అన్నదాత

  • వాననీటిలో కుళ్లినపోయిన మిరపనారు.. బూజు పట్టిన పెసర.. ఇతర పంటలు

  • మూడు లక్షల ఎకరాల్లో పంట నష్టం.. బీమా లేదు.. కర్షకులకు భరోసా లేదు

farmerహైదరాబాద్: వరుణుడి ప్రకోపానికి అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. అప్పులే పెట్టుబడిగా కష్టించి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంటలను వరద తుడిచిపెట్టడంతో కర్షకులకు కన్నీరే మిగిలింది. ఏపుగా పెరిగిన మొక్కలతో నిండిన పచ్చని చేలు.. నేడు చెరువులను తలపిస్తున్నాయి. వరదల ధాటికి ఇసుక కుప్పలు, మట్టి దిబ్బల్లో కూరుకుపోయిన పంటలను చూసి రైతులు విలవిలలాడుతున్నారు. పట్టెడన్నం పెట్టే రైతును వర్షాలు, వరద రూపంలో కాటేస్తున్నాయి. కాగా, పంట నష్టం విషయంలో ఆదుకొని ఆపన్నహస్తం అందించాల్సిన అధికారులు నిర్లక్ష్యపు వ్యవహారాలతో కర్షకుల కష్టాలను రెట్టింపు చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఖరీఫ్ సీజన్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 18 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లుపడ్డాయి. వర్షాలు కురియడంతో సీజన్ ప్రారంభంలో నాట్లు వేసిన పొలాల్లో ప్రస్తుతం కలుపుతీత పనులు చేస్తున్నారు.

రాష్ట్రంలో పంటల దుస్థితి ఇదీ..
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 3 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ లెక్కలు కేవలం వ్యవసాయ శాఖ అంచనా మేరకు మాత్రమే. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మరో లక్షకు పెరిగే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో సకాలంలో వర్షాలు లేక పంటల సాగును కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా మొదలుపెట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో ముందస్తుగా కురిసిన వర్షాలకే సాగు చేశారు. ఇందులో ప్రధానంగా పత్తి, సోయాబీన్, జొన్న, పెసర పంటలున్నాయి. ఈ పంటలే ఇటీవలి వర్షాలకు అధికంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా సాగు చేసే.. మిర్చి పంట రైతులకు ఈసారి ఎదురుదెబ్బ తగిలినట్టే. ఇప్పటికే మిర్చి సాగు కోసం సిద్ధం చేసి పెట్టుకున్న మిరప నారు.. వారం రోజులకు పైగా నీటిలో మునిగిపోవడంతో.. అదంతా కుళ్లిపోయింది. మళ్లీ నారు సిద్ధం చేసుకుని.. పంటలు సాగు చేసేందుకు నెల రోజులకు పైగా సమయం పట్టనుంది. ఈ దశలో ఈ యేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి పంట సాగుపై నీలినీడలు కమ్ముకోనున్నాయి.

వర్షానికి చేదెక్కనున్న పెసర గింజలు..
అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1.23 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. పత్తి, పెసర పంటలు నీటిలో మునిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా పెసరపంట రైతులు కోలుకోలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 1.76 లక్షల ఎకరాల్లో పెసర పంటను సాగు చేశారు. మరో వారం రోజుల్లో పంటను సేకరిస్తారు. ఇంతలోనే భారీ వర్షాల రూపంలో నష్టాలు వారిని వెంటాడాయి. పెసర పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాల కారణంలో చేలల్లో నీరు నిలిచిపోయింది. ఫలితంగా పెసరకాయ బూజు పట్టింది. చేలల్లో నుంచి మరో రెండు మూడు రోజులు నీరంతా బయటికి పోకపోతే.. ఏం మిగలని పరిస్థితి. దీనికితోడు పెసర చేలు గుబురుగా ఉండడంతో.. ఎండ సరిగా తగలకపోవడంతో పెసర గింజలు నల్లగా మారి చేదెక్కుతాయి. దీంతో ఒకవేళ పంటను సేకరించినా.. ఏమాత్రం ఫలితం ఉండదు. పెసరకాయలోని గింజలు తడిసి ముద్దవ్వడంతో మొలకెత్తే పరిస్థితి ఉంది. రెండుమూడు రోజులు వర్షాల పరిస్థితి ఇలాగే ఉంటే.. పెసళ్లను గూడాలు చేసుకునేందుకు కూడా పనికి రాకుండాపోతాయి.

ఎడతెరిపిలేని వర్షాలు..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలను పొట్టన పెట్టుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చెరువులు, వాగులు ఉగ్రరూపం దాల్చి సమీపంలోని పంటలను నాశనం చేశాయి. ఇక నదీ పరివాహక ప్రాంతాలతో పాటు పరిసర పంట పొలాలు నామరూపాల్లేకుండా పోయాయి. రహదారుల పక్కన ఉన్న చిన్న కల్వర్టులు, సింగిల్ పైపు కల్వర్టులు సైతం సమీప పంట పొలాలకు తీవ్ర నష్టాన్ని కలగజేశాయి. ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో సోయాబీన్, జొన్న, పత్తి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. రాష్ట్రంలోని కొన్ని మెట్ట ప్రాంతాల్లో పంటల పరిస్థితి కాస్తంత మెరుగ్గానే ఉంది. కానీ అధికారులు పంటల నష్టాన్ని సరిగా అంచనా వేయలేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. మరో రెండుమూడు రోజులు ఇలాగే ముసురు బెడితే.. పత్తి, సోయాబీన్, జొన్న వంటి పంటలు ఎందుకు పనికిరావు.

బీమా లేదు.. కర్షకులకు భరోసా లేదు
ఏటా పంట రుణాల్లో నుంచి బలవంతంగా బీమా ప్రీమియం తీసుకుంటున్న అధికారులు, పంట నష్టపోయిన సమయంలో మాత్రం అన్నదాతలకు ఏనాడూ పరిహారం అందించలేదు. పంటల బీమా భ్రమలా మారిందని, వర్షాభావం, వరుస వర్షాలతో పంటలు నాశనమైనా పైసా పరిహారం ఇవ్వరని రైతులు వాపోతున్నారు. ఇదిలావుంటే.. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 25 శాతం పంట రుణాలను నేటి వరకు పంపిణీ చేయలేదు. చాలామంది రైతులు పంట రుణాల సమయంలో బీమా ప్రీమియాన్ని ఏలాగూ మినహాయించుకుంటారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరలేదు. ఇటు రాష్ట్రంలో బ్యాంకులు సకాలంలో రైతులకు రుణాలివ్వకపోవడంతో ఈ బీమాకు సైతం అనర్హులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రైతులకు పంట నష్ట పరిహారం ఏ కోశానా అందేపరిస్థితి లేదు.

Tags
English Title
Water in the fields
Related News