మమతను పడగొడతాం

Updated By ManamSat, 08/11/2018 - 22:30
amith
  • ఆమె పతనాన్ని శాసిస్తాం.. అందుకే ఇక్కడికి వచ్చా..

  • కోల్‌కతా సభలో అమిత్‌షా.. మాకు దేశమే ప్రథమ ప్రాధాన్యం

  • టీఎంసీకి ఓటుబ్యాంకే ముఖ్యం

  • ఎన్‌ఆర్‌సీపై అనవసర రాద్ధాంతం.. దీదీ, రాహుల్‌పై తీవ్ర ధ్వజం

imageకోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీని కూకటివేళ్లతో పెకిలించివేస్తామని, ఆమె పతనాన్ని శాసిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. అందుకే తాను కోల్‌కతా కు వచ్చానని నిప్పులు చెరిగారు. కోల్‌కతాలో శనివారం జరిగిన బహిరంగ సభలో మమతా బెనర్జీతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాం ధీపై అమిత్‌షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ వలసదారులు మమతకు పెద్ద ఓటు బ్యాంకు అని, అందుకే జాతీయ పౌరసత్వ జాబి తా(ఎన్‌ఆర్‌సీ)పై ఆమె రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కానీ.. తమకు దేశమే ప్రధాన్యమని, ఓటు బ్యాంకు కాదని తేల్చిచెప్పారు. ఎన్‌ఆర్‌సీ నుంచి 40 లక్షల మంది బంగ్లాదేశ్ వలసదారులను తొలగించడంపై మమతా ఆరోపణలు చేస్తున్నారు.

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలివచ్చిన వలసదారులను వెనక్కి తరమడమే తమ లక్ష్యమని సుస్పష్టం చేశారు.image మమత, రాహుల్ ఎంతగా ప్రయత్నించినా ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ ఆగబోదని అన్నారు. ఎన్‌ఆర్‌సీతో హింస చెలరేగుతుందని, పౌర యుద్ధానికి దారితీయొచ్చని మమతా బెనర్జీ వ్యాఖ్యానించడం ద్వారా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. పౌరసత్వంపై కోర్టు తీర్పును ఎలాగైనా అమలు పరుస్తామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమలు చేసి తీరుతామని అమిత్‌షా స్పష్టం చేశారు. బంగ్లాదేశీ అక్రమ వలసదారులు దేశంలో ఉండాలని మమత ఎందుకు కోరుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ భద్రత ముఖ్యమో, ఓటు బ్యాంకు ముఖ్యమో మమతా బెనర్జీ, రాహుల్‌గాంధీ తేల్చిచెప్పాలని అన్నారు. తమ పార్టీకి మాత్రం దేశమే ముఖ్యమని అన్నారు. పశ్చిమబెంగాల్‌లో దాదాపు 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

గత ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి రెండు స్థానాల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎలాగైన అత్యధికంగా సీట్లు సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా అమిత్‌షా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తొలుత మమత సర్కారు తొలుత అనుమతివ్వకపోయినా చివరకు మంజూరు చేసింది

నల్లజెండాలతో కాంగ్రెస్ నిరసన
అమిత్‌షా పర్యటన సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేతలు నల్లజెండాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ ఘటన కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న అమిత్‌షాకు కొందరు నల్ల జెండాలు చూపి.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోటార్‌సైకిళ్లపై వచ్చిన కార్యకర్తలు అమిత్‌షా కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

English Title
We defeate mamatha
Related News