ఆకుల వీరమ్మ మనవడంటేనే తెలుసు

Updated By ManamSat, 08/04/2018 - 07:24
Singarayakonda

imageమా నాన్న ఊరు, మా అమ్మమ్మ ఊరూ.. రెండూ ఒకటే. సింగరాయకొండ దగ్గర కలికివాయ గ్రామం. మా ఊరి పక్కనే ఉన్న బిట్రగుంటను గుర్తుపట్టడం కోసం బిట్రగుంట ముందు కలికివాయను చేర్చి, కలికివాయ బిట్రగుంట అని పిలుస్తుంటారు. మా ఊరు కలికివాయ అనడంతోనే, ‘‘ఓహో.. కలికివాయ బిట్రగుంటా!’’ అంటారు. ‘‘కాదయ్యా.. మాది కలికివాయ’’ అని మళ్లీ గట్టిగా చెప్పాల్సి వచ్చేది. అమ్మమ్మ ఊరు గురించి రాయడం మొదలుకాగానే మనసునిండా అమ్మమ్మ జ్ఞాపకాలు ముసురుకున్నాయి. కంటిలో చెమ్మ నిండిపోయింది. ఎందుకంటే అమ్మమ్మే నాకు అమ్మయ్యింది. మా అమ్మకు ఎప్పుడూ ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. అమ్మని అదే ఊళ్లోనే ఇచ్చి పెళ్లి చేసింది. కాబట్టే ప్రత్యేకంగా అమ్మమ్మ ఊరెళ్లే అవకాశాన్నయితే కోల్పోయాను. కానీ అమ్మమ్మే అమ్మ కావడం చెదిరిపోని జ్ఞాపకం.

మా పూరింటికి దగ్గర్లోనే ఉండేది మా అమ్మమ్మ వాళ్ల పూరి గుడిసె కూడా. ఆ రోజుల్లో మా ఊళ్లో భవంతులు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఆ ఇంటి ముందు మా తాత మున్నంగి సుబ్బారెడ్డి ఏలుబడిలో ఎన్నో బర్రెగొడ్లు ఉండేవి. వాటికి రారాజు మా తాత. నల్లగా నీగ్రోవాసిలా ఉండేవాడు. ఆయన చొక్కా వేసుకోవడం నేనెప్పుడూ చూడలేదు. ఆయన నన్ను భుజమ్మీద ఎక్కించుకొని తిప్పేవాడు. బర్రెగొడ్లు తోలుకొని పోయేటప్పుడు ఊరు దాటి అలుగులోకి చేరేదాకా ఆయన భుజాన స్వారీ చేయించేవాడు.

మా ఊళ్లో మంచికంటి నరసారెడ్డి కొడుకంటే పెద్దగా ఎవరికీ తెలియదు. ఆకుల వీరమ్మ మనవడంటేనే ఎక్కువ మందికి తెలుసు. సింగరాయకొండకు దక్షిణం వైపుగా ఉండే కరేడుకుపోయి తమలపాకులు కొనుక్కుని, మా ఊరికి పడమటి వైపుగా నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉండే నందనవనం పోయి ఆ తమలపాకులు అమ్ముకొని వచ్చేది. మధ్యాహ్నం నుంచి బోండాలు చేసుకొని పొగాకు కంపెనీల దగ్గరకు పోయి అమ్మేది. అప్పుడప్పుడు నేను కూడా అమ్మమ్మతో పోయేవాడిని. ఎంతో కష్టపడి సంపాయించిన డబ్బంతా మా అమ్మని హాస్పిటళ్ల చుట్టూ తిప్పడానికే ఖర్చయిపోయేది. అయినా సరే నేనింత కష్టపడ్డానని అమ్మమ్మ ఎప్పుడూ అనుకునేది కాదు. నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం చెయ్యాలని అనేది. నేను ఏ మాట చెప్పినా ఎప్పుడూ కాదనేది కాదు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఒకసారి ఎస్సీ అమ్మాయిని, ఇంకోసారి సెట్టిగారమ్మాయిని చేసుకుంటానని చెప్పాను. ‘‘అట్నే చేసుకో’’ అన్నదే కానీ, ‘అదేమిటి, ఎలా చేసుకుంటావు?’ అని అనలేదు. అంత విశాలమైన మనసుతో ఉండేది. అమ్మమ్మ కంటే ముందే అమ్మ చనిపోవడంతో తల్లిలేని పిల్లాడినయ్యాను. అప్పటి నుంచీ ఇంకా గారాబంగా చూసేది. ‘‘తల్లిలేని పిల్లోడు కదా’’ అని ఎప్పుడూ అంటుండేది. చివరి రోజుల్లో అమ్మమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్లాను, చూడ్డానికి. హాస్పిటల్లో మా పిన్నమ్మ చేర్పించింది. నన్ను చూసి కంటతడి పెట్టుకుంది. ‘‘ఎవ్వరి అండా లేకుండా ఎట్ట చేస్తావో?’’ అంది. కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత ‘‘ఇంక లాభం లేదు. ఇంటికి తీసుకువెళ్లండి’’ అన్నారు డాక్టర్లు. శివరామిరెడ్డి హాస్పిటల్లో అంత ఎక్కువ ఫీజులు కాకపోయినా అప్పటి నా పరిస్థితి.. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఒక మిత్రుడు కనిపిస్తే అప్పు తీసుకున్నా. చెక్క రిక్షా మీద మంచం వెల్లకిలా వేసి, ఆ మంచమ్మీద అమ్మమ్మను పడుకోబెట్టి, గతుకుల మట్టిరోడ్డు మీద తీసుకువెళ్తుంటే అమ్మమ్మ కాదు, నేనే చచ్చిపోయినంత బాధేసింది. ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత కొన్ని రోజులు మంచంలోనే ఉండి చనిపోయింది. ఆ ఇంట్లోనే అమ్మమ్మ చెల్లెలు చిన్న అమ్మమ్మ కూడా ఉండేది. ఆమెను చూస్తే ఒళ్లంతా జలదరించేది. పుళ్లతో ఒళ్లంతా రసి కారుతూ ఉండేది. ఉబ్బసంతో బాధపడుతుండేది. ఎప్పుడూ మందు బిళ్లలు మింగుతూ ఉండేది. ఆమెను కూడా అమ్మమ్మే తన ఇంట్లో ఉంచుకొని చూసింది.

ఇలాగా అమ్మమ్మ, తాత జ్ఞాపకాలతో నిండిన మా ఊరు కలికివాయలో ప్రతి మనిషీ కష్టపడడానికే పుట్టారా.. అన్నట్టు ఉండేవాళ్లు. వేకువ జామునే నిద్ర లేచినప్పటి నుంచీ రాత్రి పడుకొనే వరకూ పనిచేస్తూనే ఉండేవాళ్లు. ఈ ఊరి కోసం ఏమైనా చెయ్యాలని బాల్యం నుండే అనుకుంటూ ఉండేవాడ్ని. ఆంధ్రకేసరి దినపత్రిక, పంతులు బాబాయిగారి రేడియో.. నా ఒంటరితనాన్ని దూరంచేసి నన్ను సాహిత్య లోకంలోకి లాక్కొచ్చింది. మా ఊళ్లోని పంచాయతీ గ్రంథాలయం, యువజన సంఘం చేసే కార్యక్రమాలు చూస్తూ పెరిగాం. ప్రతి సంవత్సరం పెద్దవాళ్లు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగారి నాటకం వెయ్యడం ఆనవాయితీగా ఉండేది. ఇంకో వైపు యువకులు వేసే సాంఘిక నాటకాలు కూడా మమ్మల్ని సాంస్కృతిక రంగానికి పరిచయం చేసి, తర్వాత రోజుల్లో మేం కూడా నాటకాలు వేసే స్థాయికి తీసుకొచ్చాయి. ఇలాగ బాల్య జ్ఞాపకాలన్నీ సాహిత్యంలోకి రావడానికి ముఖ ద్వారాలయ్యాయి. గ్రామంలో ఎంతో పేదరికం తాండవిస్తున్నా మంచి ఆలోచనలతో నిండిన మంచి మనుషులు మదినిండా మెదులుతూ ఉండడం, మా నాన్న మంచితనం, ఇతరుల గురించి ఆలోచించేతత్వం పూర్తిగా నిండిపోయిన అనువంశికత సమాజానికి అంకితమయ్యేట్లు చేశాయి.
శాంతివనం మంచికంటి
సెల్: 9100117375

English Title
We know that the leaves are very good
Related News