సుబాబుల్ రైతులను ఆదుకుంటాం

Updated By ManamThu, 02/15/2018 - 02:20
thummala

కనీస మద్ధతు ధర అందిస్తాం: మంత్రి తుమ్మల

thummalaహైదరాబాద్: మద్దతు ధర అందకపోవటానికి ఉన్న దళారీ వ్యవస్థను తొలగించేలా చర్యలు చేపడతామని, దళారి వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ఆంధ్ర ప్రాంతంలో లభించే మద్దతు ధర తెలంగాణ ప్రాంతంలో కూడా అందేలా చర్యలు ఉంటాయన్నారు. సుబాబుల్ రైతుల కష్టాలు, మద్దతు ధర  అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మ ల మాట్లాడుతూ.. తెలంగాణా ప్రాంతంలో సుబాబుల్ సాగు చేసే  రైతులు పడుతున్న కష్టాలు, కనీస మద్దతు ధర అందక పడుతున్న తీవ్ర ఇబ్బందులను పరిష్కరిస్తామని అన్నారు. ఐటీసీ సంస్థ నియమించిన ఏజెంట్లు,దళారులను తొలగిస్తామని, ఆ కంపెనీ అందించే రూ. 4508 మద్దతు ధరకు  రూ. 4000 రైతుకు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు.  సుబాబుల్‌ను ఐటీసీ నేరుగా కొనేలా  చర్యలు తీసుకుంటామని తెలిపారు. సరకు అందించిన 15 రోజులలో మద్దతు ధర ప్రకారం రైతులకు డబ్బు అందేలా చూస్తామన్నారు. రైతులకు ఐటీసీ కంపెనీ మధ్య సమన్వయానికి ఒక నోడల్ ఆఫీసర్ నియమిస్తామన్నారు


ఈ ఏడాది 52 ఆర్వోబీల నిర్మాణం

రాష్ట్రంలో ఉన్న 460 రైల్వే లెవల్ క్రాసింగ్ ఆర్వోబీల నిర్మాణానికి రోడ్లు, భవనాల శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 52 ఆర్వోబీల నిర్మాణం పూర్తిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంకల్పించారు. ఇందుకోసం రూ.2700 కోట్లతో ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. రైల్వేశాఖ, రాష్ట్రప్రభుత్వం 50:50 నిష్పత్తిలో ఈ ఖర్చును భరించనున్నాయి. మంత్రి హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి రాష్ట్రంలోని ఆర్వోబీల నిర్మాణం, తదితరాలపై తుమ్మల బుధవారం నాడు సమీక్షించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆర్వోబీలు, భూసేకరణ, రైల్వే, ఆర్ అండ్ బీ అధికారుల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. భూసేకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో తుమ్మల వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నాలుగు వరుసల రహదారుల నిర్మాణాలు చేపడుతున్నందున 4 వరుసల ఆర్వోబీల నిర్మించేందుకు రైల్వేశాఖను ఒప్పించారు. నిర్మాణంలో ఉన్న ఆర్వోబీలకు, ట్రాఫిక్ జామ్ ఉన్న ఆర్వోబీల పునరుద్ధరణకు నిధులు సమకూర్చాలని రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్‌ను తుమ్మల కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆర్వోబీల నిర్మాణానికి, రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. మియాపూర్-పటాన్‌చెరువు ప్రాంతంలో రైల్వే టెర్మినల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మెదక్ అక్కంపల్లి రైల్వేలైన్, ఎంఎంటీఎస్ నిర్మాణం పూర్తవుతుందని తుమ్మల పేర్కొన్నారు.

English Title
we will support farmers: Thummala
Related News